logo

కుక్కునూరులో కదం తొక్కిన ఆదివాసీలు

అడవి నరికి, పోడు సేద్యం చేసుకుంటున్న భూములకు పట్టాహక్కులు కల్పించాలని కోరుతూ మంగళవారం కుక్కునూరులో ఆదివాసీలు కదం తొక్కారు. తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు కూడా ఇప్పటివరకూ పట్టాహక్కులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 03 Jul 2024 03:28 IST

పోడు భూములకు పట్టాలు కోరుతూ నిరసన

కుక్కునూరు, న్యూస్‌టుడే: అడవి నరికి, పోడు సేద్యం చేసుకుంటున్న భూములకు పట్టాహక్కులు కల్పించాలని కోరుతూ మంగళవారం కుక్కునూరులో ఆదివాసీలు కదం తొక్కారు. తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములకు కూడా ఇప్పటివరకూ పట్టాహక్కులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని అవకాశంగా తీసుకున్న అటవీ సిబ్బంది ఆదివాసీల నుంచి పెద్దఎత్తున లంచాలు గుంజుతున్నారని ఆరోపించారు. ఏటా ఖరీఫ్‌ సీజన్‌కు ముందు ఆదివాసీల నుంచి కత్తులు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకుని.. ఎకరానికి ఇంత చొప్పున డబ్బు ఇస్తేనే అడవిలో అడుగుపెట్టనిస్తామంటారని తెలిపారు. అమాయక ఆదివాసీలు వారు అడిగినంత ఇచ్చి ఆ భూముల్లో సేద్యం చేసుకుంటున్నారని వివరించారు. అడవిపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీలకు పట్టాహక్కులు కల్పించటంలో ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. సీపీఐ (ఎంఎల్‌-ప్రజాపంథా) మాస్‌లైన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఆదివాసీలు హాజరయ్యారు. ఆ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన ప్రదర్శన ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాలు, పోలీసుస్టేషన్‌ మీదుగా అటవీ క్షేత్రాధికారి కార్యాలయానికి చేరుకుని అక్కడ ధర్నా చేశారు. కార్యక్రమానికి కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పోలవరం మండలాల నుంచి ఆదివాసీలు హాజరయ్యారు. ప్రజాపంథా జంగారెడ్డిగూడెం డివిజన్‌ కార్యదర్శి ఎస్‌.కె.గౌస్, పార్టీ నాయకులు ముత్యాలరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని