logo

మరింత భరోసా..!

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ సోమవారం జరగనుంది. తొలి రోజే నూరు శాతం లక్ష్యాన్ని చేరుకునేలా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Published : 01 Jul 2024 03:55 IST

నేడు పింఛన్ల పండగ
అధికారుల ఏర్పాట్లు

భీమవరం అర్బన్, పాలకొల్లు, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ సోమవారం జరగనుంది. తొలి రోజే నూరు శాతం లక్ష్యాన్ని చేరుకునేలా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్‌ నాగరాణి, సంయుక్త కలెక్టర్‌ ప్రవీణ్‌ఆదిత్య ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభించాల్సి ఉన్నందున 5.30 గంటలకు కేటాయించిన ప్రాంతాలకు ఉద్యోగులు చేరుకోవాలని ఆదేశించారు. 

4,248 ఉద్యోగులతో.. గతంలో పింఛన్ల పంపిణీలో వార్డు, గ్రామ వాలంటీర్లదే ప్రధాన పాత్ర. జులైలో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఈ ప్రక్రియ నిర్వహించాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. తొలిరోజే పంపిణీ మొత్తం పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రామ-వార్డు సచివాలయాల సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు కలిపి మొత్తం 4,248 మంది ఈ ప్రక్రియలో భాగస్వాములు కానున్నారు. జిల్లా పరిధిలో లబ్ధిదారులకు అందించాల్సిన రూ.155.71 కోట్లను సంబంధిత అధికారులు శనివారం సాయంత్రానికి బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసి భద్రపరిచారు. 

ముందుగానే ముఖ్యమంత్రి లేఖలు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు తొలిరోజే పింఛన్లు పంపిణీ చేసేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాం. లబ్ధిదారులు సమయానికి ఇంటి వద్ద అందుబాటులో లేకపోతే మరుసటి రోజు ఉదయం అందజేస్తాం. పింఛన్లకు సంబంధించి ముఖ్యమంత్రి పేరిట ఉన్న లేఖను ప్రతి లబ్ధిదారుకు ముందుగానే అందిస్తున్నాం. ఆదివారం సాయంత్రానికి 12 మండలాల్లో ఈ ప్రక్రియ పూర్తయింది.

వేణుగోపాల్, డీఆర్‌డీఏ పీడీ, భీమవరం

బాధితులకు భారీ ఊరట 

అవ్వాతాతలకు రూ. 3 వేలు ఉండే పింఛన్‌ రూ. 4 వేలకు పెంచగా.. దివ్యాంగులు, కుష్ఠు రోగులకు రెట్టింపు చేసి రూ.6 వేలకు పెంచారు. కిడ్నీ, లివర్, గుండె మార్పిడి చేయించుకున్నవారికి ఇచ్చే రూ.5 వేల పింఛను ఇప్పుడు రూ.10 వేలకు పెంచారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారిలో పక్షవాతం బారిన పడిన బాధితులకు, నరాల బలహీనతతో బాధపడుతున్న వారికి గతంలో ఇచ్చే రూ.5 వేలను  ఒకేసారి రూ.15 వేలకు పెంచడం ఆయా కుటుంబాలకు భరోసాగా నిలుస్తుంది. ఆయా రోగులకు నెలవారీ వైద్యం నిమిత్తం, మందులకు ఎక్కువగా ఖర్చు అవుతుండటంతో పెంపు అనేది ఊరటగా నిలవనుంది. బోదకాలుతో ఇబ్బందులు పడుతున్న రోగులకు రూ.5 వేలు ఉండే పింఛన్‌ ఇప్పుడు రూ.10 వేలకు పెంచారు. 

పింఛనుదారుల సంఖ్య: 2,32,885
అందించే సొమ్ము రూ.155.71 కోట్లు
వైకాపా ప్రభుత్వం గత నెల ఇచ్చింది రూ.69.05 కోట్లు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని