logo

వైద్యం సర్కారు ఆసుపత్రిలో.. స్కానింగ్‌ ప్రైవేటు కేంద్రాల్లో!

‘తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రసవం నిమిత్తం ఇటీవల శస్త్ర చికిత్స చేశారు. స్కానింగ్‌ మాత్రం బయట సెంటర్‌కు రాయడంతో రూ. 2300 వెచ్చించాల్సి వచ్చింది.’ అని పెరవలి మండలం ఖండవల్లికి చెందిన కె.కుమారి ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 01 Jul 2024 05:44 IST

యంత్రాలు ఉన్నా.. ప్రయోజనం శూన్యం 
వైద్య సిబ్బంది ఖాళీల భర్తీపై దృష్టి సారించని వైకాపా సర్కారు

జిల్లా కేంద్ర ఆసుపత్రిలో స్కానింగ్‌ చేస్తున్న శిక్షణ వైద్యులు

‘తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రసవం నిమిత్తం ఇటీవల శస్త్ర చికిత్స చేశారు. స్కానింగ్‌ మాత్రం బయట సెంటర్‌కు రాయడంతో రూ. 2300 వెచ్చించాల్సి వచ్చింది.’ అని పెరవలి మండలం ఖండవల్లికి చెందిన కె.కుమారి ఆందోళన వ్యక్తం చేశారు.

‘రెండో కాన్పుకు శస్త్ర చికిత్స చేశారు. ఔషధాలు కూడా ఇక్కడే తీసుకున్నా. స్కానింగ్‌కు మాత్రం రూ.6300 వరకు బయట కేంద్రాలకు చెల్లించాల్సి వచ్చింది.’ అని పెనుమంట్ర మండలం మల్లిపూడికి చెందిన ఆర్‌.వెంకటలక్ష్మి వాపోయారు. 

తణుకు, న్యూస్‌టుడే: తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి వంద నుంచి 150 పడకలకు చేరింది. ఆ స్థాయిలో సదుపాయాలు కల్పించకపోవడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా సిబ్బంది కొరతతో మెరుగైన సేవలు అందని పరిస్థితి నెలకొంది. గత అయిదేళ్ల వైకాపా పాలనలో పాలకులు సిబ్బంది నియామకంపై ఏ మాత్రం దృష్టి సారించలేదు. మత్తు వైద్యులు ఇద్దరికి గాను ఒక్కరే సేవలందిస్తున్నారు. ప్రసూతి వైద్య నిపుణులు ముగ్గురు ఉండాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. దీనికితోడు రేడియాలజిస్టు పోస్టు కూడా ఖాళీగా ఉంది. నిత్యం 500 నుంచి 600 మంది వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. 10 నుంచి 15 మంది రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. 

గర్భిణులకు తప్పని పాట్లు.. తణుకు పరిసర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో గర్భిణులు  చికిత్స కోసం వస్తుంటారు. రోజూ పది మందికి శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తోంది. ఇంత ప్రాధాన్యం ఉన్న ఆసుపత్రిలో షిప్టుల వారీగా  గైౖనకాలజిస్టులు లేరు. ఆదివారం, రాత్రి సమయాల్లో మత్తు వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణులను ఏలూరు తరలిస్తున్నారు. యంత్రాలు ఉన్నా.. అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ చేసేవారు లేకపోవడంతో బయట కేంద్రాల్లో దీని కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌ వెలగల అరుణ మాట్లాడుతూ రేడియాలజిస్టు లేకపోవడంతో ఇబ్బంది ఏర్పడుతోందన్నారు. ఖాళీ భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు.

మూలకు చేరిన యంత్రాలు 

పాలకొల్లు ప్రాంతీయ ఆసుపత్రిలో స్కానింగ్‌ యంత్రాలు మూలకు చేరి సంవత్సరాలు అవుతున్నా.. మిషనరీ కొనుగోలు చేయలేదు. ప్రారంభంలో స్కానింగ్‌ ఇక్కడే తీసేవారు. ప్రస్తుతం బయట కేంద్రాలకు పంపుతున్నారు. దీంతో ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని