logo

ఇసుక దొంగలొస్తున్నారు జాగ్రత్త!

భారీ పొక్లెయిన్, టిప్పర్లతో శనివారం సాయంత్రం కొందరు వ్యక్తులు కుక్కునూరు మండలం వింజరం నిల్వ కేంద్రం వద్దకు చేరుకుని టిప్పర్లలో ఇసుక నింపుతున్నారు. గ్రామస్థులు అడ్డుకొని ప్రశ్నించగా జిల్లాకు సరిహద్దుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ఎమ్మెల్యే పంపితే వచ్చామని సదరు వ్యక్తులు చెప్పారు.

Published : 01 Jul 2024 03:47 IST

మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు చెప్పి దందా 
వింజరంలో అడ్డుకున్న గ్రామస్థులు 

వింజరంలో నిల్వ ఉంచిన ఇసుక

కుక్కునూరు, న్యూస్‌టుడే: భారీ పొక్లెయిన్, టిప్పర్లతో శనివారం సాయంత్రం కొందరు వ్యక్తులు కుక్కునూరు మండలం వింజరం నిల్వ కేంద్రం వద్దకు చేరుకుని టిప్పర్లలో ఇసుక నింపుతున్నారు. గ్రామస్థులు అడ్డుకొని ప్రశ్నించగా జిల్లాకు సరిహద్దుగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ఎమ్మెల్యే పంపితే వచ్చామని సదరు వ్యక్తులు చెప్పారు. అనుమానం వచ్చిన గ్రామస్థులు వారికి తెలిసిన వారి ద్వారా ఆ ప్రజాప్రతినిధిని సంప్రదించే ప్రయత్నం చేశారు. సదరు వ్యక్తులు శాసనసభ్యుడు కాదంటూ అదే జిల్లాకు చెందిన ఓ మంత్రి పేరు చెప్పారు. ఈ నేపథ్యంలో వచ్చిన వారు అక్రమార్కులుగా భావించి ఇసుక తరలించేందుకు తెచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. వారు తమకు తెలియదన్నారు. చివరకు నియోజకవర్గ నాయకులు జోక్యం చేసుకుని ఆదివారం ఉదయం ఆ వాహనాలను విడిపించడంతో వాటిని తీసుకుని వెళ్లిపోయారు.

నిల్వలపై కన్ను 

వైకాపా ప్రభుత్వ హయాంలో వర్షాకాలంలో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కుక్కునూరు మండలం ఇబ్రహీంపేట, వింజరం ఇసుక రేవుల వద్ద లక్షల టన్నుల ఇసుక నిల్వ చేశారు. అప్పట్లో ఆ ఇసుకను తరలించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. ఇంతలోనే ఎన్నికలు రావడం, అధికార మార్పిడి జరగడంతో ఇప్పుడు ఆ నిల్వలపై ఇసుక వ్యాపారంలో ఆరితేరిన బడాబాబుల కళ్లు పడ్డాయి. ప్రముఖులతో చెప్పించుకుని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజా ఘటన కూడా ఆ తరహాలో జరిగిందే. గ్రామస్థులు ఎంత చెప్పినా వారు ఏ మాత్రం తడబడకుండా ఇసుకను తరలించుకుపోయే యత్నాలు చేయడం గమనార్హం. మీరు ఎంత మంది అడ్డు చెప్పినా.. అధికారులు వచ్చి దగ్గరుండి వాహనాలు పంపిస్తారంటూ బీరాలు పలికారు. అయితే గ్రామస్థులు ఆ బెదిరింపులకు లొంగకపోవడం, వాహనాలను కదలనీయకపోవడంతో చివరకు చేసేది లేక వదిలేయమని కోరారు. దానికి కూడా గ్రామస్థులు అంగీకరించలేదు. చివరకు నియోజకవర్గంలోని ఓ ప్రముఖ వ్యక్తితో ఫోన్‌ చేయించుకుని వాహనాలను తీసుకెళ్లాల్సి వచ్చింది. 

జిల్లాలో ఎక్కడా అందుబాటులో లేక.. 

ఈ స్థాయిలో జిల్లాలో ఎక్కడా ఇసుక అందుబాటులో లేదు. తూర్పుగోదావరి జిల్లాలో రేవులు ఉన్నా అక్కడ డ్రెడ్జింగ్‌ (నీళ్లలోంచి ఇసుక తీయడం) ద్వారానే లభిస్తోంది. ఈ నేపథ్యంలో అంత కష్టపడకుండా సులభంగా తరలించుకునే వీలున్న ఇక్కడి నిల్వలపై ఇసుకాసురుల కళ్లు పడ్డాయి. రాజకీయ నాయకుల సహకారం ఎంత ఉందో తెలియదు గానీ, వచ్చిన వ్యక్తులు మంత్రి, ఎమ్మెల్యేల పేర్లు చెప్పడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని