logo

సౌర వెలుగు.. ఆదరణ కరవు

వినియోగదారులపై విద్యుత్తు భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజ్లీ పథకాన్ని ప్రవేశపెట్టింది. సౌర విద్యుత్తు వినియోగాన్ని పెంచి ప్రజలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం.

Published : 01 Jul 2024 03:46 IST

ప్రచారానికి నోచుకోని పీఎం సూర్యఘర్‌ పథకం 

తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: వినియోగదారులపై విద్యుత్తు భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజ్లీ పథకాన్ని ప్రవేశపెట్టింది. సౌర విద్యుత్తు వినియోగాన్ని పెంచి ప్రజలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ మేరకు ఇంటి పైకప్పుపై సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకోవడానికి కేంద్రం పెద్ద ఎత్తున రాయితీ ఇస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్తు ఛార్జీల మోతతో వినియోగదారులు అల్లాడుతున్నారు. ఈ పథకం ద్వారా కరెంటు ఛార్జీల బాదుడు నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. కానీ ప్రజలకు అవగాహన  కల్పించడంలో అధికారులు  విఫలమయ్యారు. 

40 మంది మాత్రమే..  సోలార్‌ విద్యుత్తు వినియోగంతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాల్సిన విద్యుత్తు అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాడేపల్లిగూడెం డివిజన్‌ పరిధిలో ఇప్పటి వరకు  40 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 

భారీ రాయితీ.. ఒక ఇంటి పైకప్పు మీద గరిష్ఠంగా రెండు నుంచి మూడు కిలోవాట్ల వరకు సోలార్‌ ఫలకాలను అమర్చుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇందుకు సుమారు రూ.1.45 లక్షల వరకు ఖర్చవుతుంది. కిలోవాట్‌కు రూ.30 వేలు, రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు కిలోవాట్లకు పైబడి సౌరవిద్యుత్తు ప్ల్లాంటు ఏర్పాటు చేసుకుంటే రూ.78 వేల రాయితీని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అయితే ప్లాంటు ఏర్పాటుకు అయ్యే ఖర్చును ముందుగా వినియోగదారుడే భరించాల్సి ఉంటుంది. ఆ తరువాత వినియోగదారుడి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం రాయితీ డబ్బులు జమ చేస్తారు. 

అవగాహన కల్పిస్తున్నాం

‘సూర్యఘర్‌ పథకం గురించి విద్యుత్తు వినియోగదారులకు వివరిస్తున్నాం. భవిష్యత్తులో అవగాహన కార్యక్రమాలు చేపట్టి మరింత అవగాహన కల్పిస్తాం. ఎన్నికల కారణంగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ పథకానికి ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేస్తాం’ అని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు.  

దరఖాస్తు ప్రక్రియ ఇలా..

పీఎం సూర్యఘర్‌ పథకం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మెయిల్‌ ఐడీ, విద్యుత్తు కనెక్షన్, చరవాణి నంబర్లతో రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలి. అనంతరం సర్వీసు నంబరు, మొబైల్‌ నంబరుతో లాగిన్‌ అయ్యి రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆరు నెలలకు సంబంధించిన విద్యుత్తు బిల్లుల కాపీలను జత చేయాలి. అనుమతులు వచ్చాక ఏజెన్సీల ద్వారా ఇంటిమీద సోలార్‌ ఫలకాలను అమర్చుకోవాలి. ఆపై నెట్‌ మీటరుకు దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మీటరును మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన నెల రోజులకు రాయితీ డబ్బులు ఖాతాలో జమ అవుతాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు