logo

సమాజ హితం.. చైతన్య పథం!

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి తగిన చికిత్స ద్వారా ఊపిరిపోసి కొత్త జీవితం ప్రసాదించేది వైద్యులే. అధునాతన మార్పులు, సాంకేతికత ప్రభావంతో వైద్యం ఎంతో  ఖరీదైన ఈ రోజుల్లోనూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వైద్యులు ఎందరో ఉన్నారు.

Published : 01 Jul 2024 03:40 IST

స్వచ్ఛంద  సేవలతో ఆదర్శం
నేడు వైద్యుల దినోత్సవం

 

అంధ విద్యార్థులతో డాక్టర్‌ యూవీ రమణరాజు, ఉపాధ్యాయులు

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి తగిన చికిత్స ద్వారా ఊపిరిపోసి కొత్త జీవితం ప్రసాదించేది వైద్యులే. అధునాతన మార్పులు, సాంకేతికత ప్రభావంతో వైద్యం ఎంతో  ఖరీదైన ఈ రోజుల్లోనూ ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సమాజ శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వైద్యులు ఎందరో ఉన్నారు. వైద్య  శిబిరాలు, పరీక్షలు,  ఔషధాల పంపిణీ, వ్యాధుల నివారణకు చైతన్య కార్యక్రమాలతో పాటు బాధితులకు తమ పరిధిలో చేయూత అందించడం ద్వారా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఇలాంటి వారిపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం. 

చీకటి జీవితాల్లో వెలుగురేఖ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భీమవరానికి చెందిన నేత్ర వైద్య నిపుణుడు యూవీ రమణరాజు వృత్తిని కొనసాగిస్తూనే సేవలతో ఎంతో మంది అంధుల జీవితాల్లో వెలుగులు నింపారు.Ë భీమవరం జువ్వలపాలెం రోడ్డులో ఉన్న తన నేత్ర వైద్యశాలలో ఓ గదిని పాఠశాలగా మార్చి ఉపాధ్యాయులను నియమించారు. యూవీ సుబ్బరాజు మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎంఎస్‌ఎం రాంప్రసాద్, అమర్‌లాల్, జీవీకే రాజు తదితరుల సహకారంతో 2004లో ప్రారంభమైన ఈ పాఠశాలలో అంధులకు బ్రెయిలీ లిపిలో బోధన మొదలుపెట్టారు. ప్రస్తుతం 1 నుంచి ఇంటర్మీడియట్‌ వరకు 25 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో ఇక్కడ విద్యనభ్యసించిన అంధ విద్యార్థులు 30 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఉపాధ్యాయులుగా, వివిధ కార్యాలయాల్లో ఉద్యోగులుగా సేవలôదిస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు క్రీడలతో పాటు సంగీతం, మిమిక్రీ, పాటల పోటీల్లో పాల్గొని బహుమతులు సాధిస్తున్నారు. 

మరణానంతరం నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా 120 మంది దాతల నుంచి కార్నియాలు సేకరించారు. 240 మందికి ట్రస్టు ద్వారా కంటిచూపునిచ్చారు. వివిధ ప్రాంతాల్లో ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు.

మహిళల కోసం..

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన మహిళా వైద్యులు సమాజ సేవల్లో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. ఆబ్‌స్ట్రట్రిస్‌ గైనిక్‌ సొసైటీగా ఏర్పడి మహిళల కోసం ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో పాటు కొవిడ్‌ ప్రభావిత రుగ్మతలు అధికమయ్యాయి. బాధితుల్లో కొందరు ఇలాంటి రుగ్మతలను బయటకు చెప్పేందుకు సిగ్గుపడతారు. వ్యాధి ముదిరాక వైద్యుల వద్దకు వెళ్లినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతుంది. ఈ సమస్యలను అధిగమించేలా ఈ బృందం సభ్యులు పట్టణాలు, గ్రామాలకు వెళ్లి మహిళలను సమావేశపరిచి అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం 60 మంది మహిళా వైద్యులు ఈ బృందంలో ఉన్నారు. పలు ప్రాంతాల్లో నిర్వహించే వైద్య శిబిరాల్లో వీరు సేవలందిస్తున్నారు.

భీమవరం: అవగాహన కార్యక్రమంలో అధికారులు, సొసైటీ సభ్యులు (పాతచిత్రం) 

15 ఏళ్లుగా.. భీమవరం, నరసాపురం పట్టణాల్లో గత 15 ఏళ్లుగా దాదాపు 150 వైద్య శిబిరాలు నిర్వహించారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించేలా జిల్లా స్థాయి సదస్సులు నిర్వహించారు. ప్రముఖ వైద్యుల ద్వారా అవగాహన కల్పించడంతో పాటు బాధితులకు వైద్యం అందిస్తున్నామని సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్‌ గ్రంధి పద్మావతి పేర్కొన్నారు.

ఇళ్లకు వెళ్లి సేవలు..

తణుకు గ్రామీణం, న్యూస్‌టుడే: పేదలు, వృద్ధులకు సాధ్యమైనంత వరకు ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో తణుకు సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కొందరు వైద్యులు సేవలందిస్తున్నారు. ఆరేళ్లుగా వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న వారి కోసం సంచార వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. ఈ జన్మలో వైద్యులుగా తమకు గుర్తింపు ఇచ్చిన దేవుని కృప పొందాలంటే సమాజానికి, పేదలకు ఎంతో కొంత సేవ చేయాలనే యోచనతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని.. దీనికి మరికొందరు వైద్యులు, దాతలు సహకారం అందిస్తున్నారని అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు, నేత్ర వైద్య నిపుణుడు హుస్సేన్‌ చెబుతున్నారు. సీˆనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ ద్వారా అందిస్తున్న సంచార వైద్య సేవలకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు వృద్ధాశ్రమాల్లో వసతి పొందుతున్న వారికి కంటి, ఇతర చికిత్సలు అందిస్తున్నట్లు ప్రసూతి వైద్యురాలు అయేషా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు