logo

రూ.5 లక్షల విలువైన చెట్ల నరికివేత

మండలంలోని గొల్లపల్లిలో భూ ఆక్రమణకు యత్నించి రూ.5 లక్షల విలువైన టేకు, మామిడి చెట్లు నరికి వేసి సాగుదారుడిని పదే పదే ఇబ్బంది పెడుతున్న పలువురిపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు రూరల్‌ హెచ్‌సీ జి.విజయబాబు తెలిపారు.

Published : 01 Jul 2024 03:35 IST

భూ ఆక్రమణకు యత్నించిన వారిపై కేసు

నూజివీడు రూరల్, న్యూస్‌టుడే: మండలంలోని గొల్లపల్లిలో భూ ఆక్రమణకు యత్నించి రూ.5 లక్షల విలువైన టేకు, మామిడి చెట్లు నరికి వేసి సాగుదారుడిని పదే పదే ఇబ్బంది పెడుతున్న పలువురిపై ఆదివారం కేసు నమోదు చేసినట్లు రూరల్‌ హెచ్‌సీ జి.విజయబాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బాపులపాడు మండలంలోని రేమల్లె గ్రామానికి చెందిన యనమదల సాంబశివరావు గొల్లపల్లి శివారు వేంపాడులోని రఘునాథస్వామి ఆలయానికి చెందిన 24.06 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. గతంలో నూజివీడు మండలం అన్నవరం గ్రామ ఎంపీటీసీ మాజీ సభ్యుడు వీరమాచినేని మాణిక్యాలరావు, బాపులపాడు మండలం కొయ్యూరుకు చెందిన కొల్లి ప్రసాదరావులు ఈ భూమి ఆక్రమణకు యత్నించారన్నారు. ఇటీవల పలువురు ఎస్సీ, బీసీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారిని వెంట పెట్టుకుని పొలంలోకి వచ్చి మామిడి చెట్లు నరికారు. దీంతో సాగుదారుడు పోలీసులను ఆశ్రయించారు. సదరు వ్యక్తులు మళ్లీ తోటలోకి ప్రవేశించబోమని రాతపూర్వకంగా పోలీసుల ముందు హామీ ఇచ్చారు. అయినా వారు ఎప్పటికైనా ఇబ్బంది పెడతారని భావించిన సాగుదారుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ఇరు పార్టీలు సంయమనం పాటించాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో గత నెల 1న గొల్లపల్లి మాజీ సర్పంచి పొట్లూరి సత్యనారాయణ, అన్నవరం ఎంపీటీసీ మాజీ సభ్యుడు వీరమాచినేని మాణిక్యాలరావు కొంతమంది అనుచరులతో కలిసి రాత్రి సమయంలో తోటకు సరిహద్దుగా వేసిన ఇనుప కంచెను ధ్వంసం చేశారు. మరుసటి రోజు మళ్లీ పొలంలోకి వచ్చి సుమారు 25 సంవత్సరాలుగా పెంచుతున్న టేకు చెట్లను నరికేశారు. సాగుదారు గత నెల 29న పొలంలోకి వెళ్లి చూసుకునే సరికి పల్లెర్లమూడికి చెందిన పలువురు పొలంలో చెట్లను నరకడం గమనించారు. దీంతో సాగుదారు 100 నంబరుకు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చెట్లు నరుకుతున్న వారిని ప్రశ్నిస్తే వీరమాచినేని మాణిక్యాలరావు నరకమంటే వచ్చామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై సాగుదారు యనమదల సాంబశివరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు రూరల్‌ హెచ్‌సీ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని