logo

రీ సర్వే చిక్కులు.. రుణాలకు తిప్పలు!

ఖరీఫ్‌ సీజన్‌ మొదలైంది. అంతా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. సన్న, చిన్నకారు రైతులు పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. రుణాల కోసం అందుబాటులో ఉన్న వ్యవసాయ సహకార సంఘాలను (సొసైటీలు) సంప్రదిస్తున్నారు.

Updated : 01 Jul 2024 05:50 IST

రిజిస్ట్రేషన్లు నిలిచి రైతుల గగ్గోలు
పెట్టుబడి సొమ్ము లేక ఆందోళన

ఖరీఫ్‌ సీజన్‌ మొదలైంది. అంతా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. సన్న, చిన్నకారు రైతులు పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నారు. రుణాల కోసం అందుబాటులో ఉన్న వ్యవసాయ సహకార సంఘాలను (సొసైటీలు) సంప్రదిస్తున్నారు. ఈ సందర్భంగా రుణాలకు అవసరమైన ఒప్పంద బాండ్ల కోసం తనఖా రిజిస్ట్రేషన్లు జరగక గందరగోళానికి గురవుతున్నారు. రెవెన్యూ, సొసైటీ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం ఉండటం లేదు.

జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం గ్రామీణ, న్యూస్‌టుడే: వ్యవసాయ రుణాల కోసం బ్యాంకులు, సహకార సంస్థలకు రైతులు ఆస్తులను కుదువ పెడతారు. ప్రస్తుతం పలు గ్రామాల భూముల వివరాలు ఆన్‌లైన్‌లో లేక రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. గతంలో భూములకు సర్వే నంబర్లు ఉండేవి. రీ సర్వేలో ల్యాండ్‌ పార్సిల్‌ (ఎల్‌పీ) నంబర్లు కేటాయిస్తున్నారు. ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఎల్‌పీ నంబర్లు ఇంకా సబ్‌ రిజిస్ట్రార్‌ రికార్డుల్లో ఆన్‌లైన్‌ కాలేదు. సర్వే పూర్తయి, రెవెన్యూ అధికారులు సమగ్ర సమాచారం సబ్‌ రిజిస్ట్రార్‌కు అందజేస్తేనే సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారు. అప్పటి వరకు రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఈ గ్రామాల్లో భూములకు రిజిస్ట్రేషన్‌ విలువ కూడా నిర్ధారణ జరగాల్సి ఉంది. 

ఉన్నతాధికారుల జోక్యం కోసం.. ఏటా వందలాది మంది రైతులకు వ్యవసాయ రుణాలిచ్చి సహకరించే సొసైటీల యంత్రాంగం సైతం సమస్య పరిష్కారం వారి పరిధిలో లేక ఉన్నతాధికారుల జోక్యం కోసం ఎదురు చూస్తున్నారు. రీ సర్వే చిక్కుల కారణంగా కొయ్యలగూడెం సొసైటీ పరిధిలో ఏటా జరిగే సుమారు రూ.3 కోట్లు, గవరవరం సొసైటీ పరిధిలో సుమారు రూ.1.50 కోట్ల రుణాల విడుదల ప్రక్రియ స్తంభించింది.

రద్దు చేసుకోవాలన్నా వీలు లేదు.. ‘నాతో పాటు తోటి రైతులు మరో అయిదారుగురు మార్ట్‌గేజ్‌ రిజిస్ట్రేషన్‌ జరగక ఇబ్బందులు పడుతున్నారు. అప్పు తీర్చిన కొందరు మార్ట్‌గేజ్‌ రద్దు చేసుకోవాలన్నా వీలులేక ఆందోళన చెందుతున్నారు. బ్యాంకులకు వెళ్లినా ఇదే సమస్య ఎదురవుతోంది. రుణం దొరక్క ఇబ్బందులు పడుతున్నాం’ అని కొయ్యలగూడేనికి చెందిన మలిశెట్టి రాంబాబు వాపోయారు.

అడిగిన పత్రాలన్నీ ఇచ్చినా.. ‘గవరవరం సొసైటీలో రుణం కోసం దరఖాస్తు చేసి నెలలవుతోంది. అడిగిన కాగితాలన్నీ ఇచ్చా. తీరా రుణం మంజూరై మార్ట్‌గేజ్‌ రిజిస్ట్రేషన్‌ కోసం అడుగుతుంటే రీ సర్వే కారణంగా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో లావాదేవీలు జరగడం లేదంటున్నారు. చేసేది లేక బయట అధిక వడ్డీకి రుణం తీసుకోవాల్సి వచ్చింది’ అని పొంగుటూరుకు చెందిన ప్రగడ మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. 

అసమగ్ర సర్వే కారణంగా.. జగనన్న భూ హక్కు సర్వే అసమగ్రంగా జరగడంతో జంగారెడ్డిగూడెం సబ్‌ రిజిస్ట్రార్‌  పరిధిలోని మూడు గ్రామాల రైతులకు చిక్కులొచ్చాయి. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి, కొయ్యలగూడెం మండలం పరింపూడి, పొంగుటూరు రైతులు సహకార రుణాలు అందక, వ్యవసాయ క్షేత్రాల రిజిస్ట్రేషన్లు జరగక నానా అవస్థలు పడుతున్నారు. 

వారాలుగా తిరుగుతున్నా.. ‘పొంగుటూరు సొసైటీలో రూ.5 లక్షల రుణం కోసం దరఖాస్తు చేశా. మార్ట్‌గేజ్‌ కోసం జంగారెడ్డిగూడెం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళితే రీ సర్వే జరిగింది కానీ.. ఆ వివరాలు కనిపించడం లేదని, భూములకు సంబంధించి ఎల్పీ (ల్యాండ్‌ పార్సిల్‌) నంబర్లు సరిపోలడం లేదని రిజిస్ట్రేషన్‌ నిలిపివేశారు. కొన్ని వారాలుగా తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. మరోవైపు ఖరీఫ్‌ సాగుకు అదును ముంచుకొస్తోంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు’అని పొంగుటూరుకు చెందిన పసుపులేటి రవీంద్ర తెలిపారు. 

తహసీల్దార్‌కు లేఖ రాశారు.. ‘రీసర్వే పూర్తి కాకపోవడంతో సమస్య వచ్చింది. జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి కొయ్యలగూడెం తహసీల్దార్‌కు దీనిపై లేఖ పంపారు. దేవులపల్లికి సంబంధించి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. రీ సర్వే వివరాలు మాకు అందితే రిజిస్ట్రేషన్లకు ఇబ్బంది ఉండదు’ అని జంగారెడ్డిగూడెం రిజిస్ట్రార్‌ వి.శ్రీనివాస్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని