logo

ఉపాధి నిధులు ఊదేశారు!

పెదవేగి మండలం బి.సింగవరంలోని చెరువులో అసలు పనులే చేయకుండా చేసినట్లు నమోదు చేశారు. వైకాపా కార్యకర్తలు, అనుచరులను కూలీలుగా నమోదు చేశారు. వారితో సంతకాలు చేయించుకుని రూ.లక్షల్లో నిధులు స్వాహా చేశారు.

Updated : 29 Jun 2024 05:02 IST

వైకాపా పాలనలో అడ్డగోలు వ్యవహారాలు
పనులు చేయకుండానే బిల్లులు స్వాహా
ఈనాడు, ఏలూరు, న్యూస్‌టుడే, తణుకు

గుణ్ణంపల్లిలో  పనులు చేస్తున్న కూలీలు

పెదవేగి మండలం బి.సింగవరంలోని చెరువులో అసలు పనులే చేయకుండా చేసినట్లు నమోదు చేశారు. వైకాపా కార్యకర్తలు, అనుచరులను కూలీలుగా నమోదు చేశారు. వారితో సంతకాలు చేయించుకుని రూ.లక్షల్లో నిధులు స్వాహా చేశారు. దీనిపై అప్పట్లో కొందరు ఫిర్యాదు చేయగా సామాజిక తనిఖీ చేశారు. స్థానిక వైకాపా ప్రజాప్రతినిధి ద్వారా అధికారులపై ఒత్తిడి చేయించి ఈ అంశం అసలు విచారణకే రాకుండా చేశారు.

తణుకు మండలంలో ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవకతవకలపై 2023 డిసెంబర్లో  పీడీ సామాజిక తనిఖీ నిర్వహించారు. వేల్పూరులో క్షేత్ర సహాయకుడిగా ఉన్న చిన్నారావు పనులకు రాని వారి పేర్లు నమోదు చేసి మస్తర్లు వేయించి వారికి వచ్చే వేతనాలు తీసుకున్నట్లు గుర్తించారు. ఇంకా అనేక అభియోగాలున్నాయి. వైకాపాకు చెందిన వ్యక్తి కావడంతో సరైన చర్యలు తీసుకోలేదు.

ద్వారకాతిరుమల మండలం నారాయణపురం, గుణ్ణంపల్లి, బుట్టాయగూడెంలలో వైకాపాకు చెందిన మేట్లు ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారు. మస్తర్లు షీట్లలో వేయకుండా తెల్ల కాగితాలపై చేయించారు. పనికి రానివారి పేరు దగ్గర గైర్హాజరు అని చూపించకుండా ఖాళీ వదిలేశారు. తర్వాత పనికి రాని వారితో సంతకాలు చేయించి సొమ్ము చేసుకున్నారు.

ఉపాధి హామీ పనుల లక్ష్యాన్ని వైకాపా సర్కారు అక్రమాలతో మసకబార్చింది. అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసిన వైకాపా నాయకులు రూ.కోట్ల ఉపాధి నిధులనూ ఊదేశారు. అనధికారికంగా తమ అనుచరులను క్షేత్ర సహాయకులుగా పెట్టుకోవడం.. పనులు చేయకుండానే చేసినట్లు బిల్లులు చేసుకోవడం.. తప్పుడు మస్తర్లతో పని చేయని వైకాపా కార్యకర్తలకు వేతనాలు జమ చేయడం.. అధికార పార్టీ నాయకుల తోటలు, పొలాల్లో ఉపాధి కూలీలతో పని చేయించడం.. ఇలా లెక్కకు మించిన అక్రమాలకు పాల్పడ్డారు. అవకతవకలను నిగ్గు తేల్చే సామాజిక తనిఖీలనూ పక్కదారి పట్టించారు.

క్షేత్ర సహాయకులను తొలగించి

వైకాపా అధికారంలోకి రాగానే అప్పటివరకు ఉన్న క్షేత్ర సహాయకులను అడ్డగోలుగా తొలగించారు. పెదవేగి మండలం కన్నాపురం, వేగివాడ, తాళ్లగోకవరం, లక్ష్మీపురం, గార్లమడుగు, దెందులూరు మండలం జోగన్నపాలెం, సోమవరప్పాడు, చల్లచింతలపూడి.. ఇలా ఉమ్మడి జిల్లాలో వందల మంది క్షేత్ర సహాయకులను కారణం లేకుండా తొలగించారు. చాలా చోట్ల అధికారికంగా పాతవారే కొనసాగినా.. అనధికారికంగా వైకాపా కార్యకర్తలతోనే పనులు చేయించారు. పాత వారికి జీతాలు రాకుండా అవస్థలు పెట్టారు. రాజీనామాలు చేయాలని ఒత్తిడి చేయించారు. చాలా మంది న్యాయస్థానాలను ఆశ్రయించడంతో కొనసాగించాలని చెప్పినా పట్టించుకోకుండా దందా చేశారు.

మితిమీరిన నేతల పెత్తనం

పెదవేగి మండలం తాళ్లగోకవరంలో ఓ వైకాపా నాయకుడు ఏకంగా ఉపాధి కూలీలతో తన సొంత ఆయిల్‌పాం తోటలో పనులు చేయించారు. ఇక్కడ పనులు చేసిన వారిలో తెదేపా సానుభూతిపరులకు వేతనాలు వేయకుండా.. పనికి హాజరు కాని వైకాపా మద్దతుదారులకు జమ చేసి ఇబ్బందులకు గురిచేశారు. రహదారి పక్కన నాటిన మొక్కల పెంపకానికి ఇచ్చే నిధులను అసలు మొక్కలు లేని ప్రాంతాలను చూపి బిల్లులు చేసుకున్నారు. రైతులకు రాయితీపై ఇచ్చే అయిల్‌పాం, కొబ్బరి మొక్కల విషయంలోనూ భారీ కుంభకోణాలు చేశారు. తప్పుడు పేర్లతో దరఖాస్తు చేసుకుని మొక్కలు తీసుకుని బయట అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు.

మెరక పనుల్లోనూ దందా

జగనన్న కాలనీల్లో మెరక పనుల విషయంలోనూ వైకాపా నాయకులు భారీగా చేతివాటం చూపించారు. ఏలూరులో ఓ వైకాపా ప్రజాప్రతినిధి అండతో గోరంత మెరక పనులు చేసి కొండంత బిల్లులు చేసుకున్నారు. తణుకులో వైకాపా నాయకుడి ఆశీస్సులతో ఓ మండల స్థాయి అధికారి అసలు మెరక పనులు చేయకుండానే రూ.30 లక్షల వరకు స్వాహా చేశారు. దెందులూరు ఎమ్మెల్యే అండతో స్థానిక నాయకులు నియోజకవర్గంలోని లేఅవుట్లను సమీప ప్రాంతాల్లో ఉన్న మట్టితో మెరక చేసి దూర ప్రాంతాల నుంచి తరలించినట్లు బిల్లులు పెట్టి రూ.కోట్లలో సొమ్ము చేసుకున్నారు. నరసాపురంలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి అధ్వర్యంలో మట్టి తరలింపులో కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. వాస్తవంగా తరలించిన మట్టికి ఎన్నో రెట్లు ఎక్కువకు బిల్లులు చేసుకున్నారు. తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం, చింతలపూడి, నూజివీడు, కైకలూరు.. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ మెరక పనుల్లో వైకాపా నేతలు చేతివాటం ప్రదర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని