logo

ఆలయ ఉద్యోగులూ.. కూలీలే!

ద్వారకాతిరుమల, గుణ్ణంపల్లి గ్రామాల్లో చెరువుల్లో ఉపాధి హామీ పనులు జరుగుతున్నా వైకాపా నాయకులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. ఆయా ప్రాంతాల్లో పొక్లెయిన్లతో తవ్వి కూలీలు పని చేసినట్లు బినామీల పేర్లతో మస్తర్లు వేసి, నిధులు కాజేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా అనేక కోణాల్లో ఉపాధి పథకం సిబ్బంది అక్రమ మార్గంలో జేబులు నింపుకొన్నారు.

Published : 29 Jun 2024 04:22 IST

వారి పేర్ల మీద మస్తర్లు.. వేతనాల సొమ్ము కాజేత
ద్వారకాతిరుమల మండలంలో వెలుగుచూస్తున్న అక్రమాలు
ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే

గోవింద కుంట చెరువులో పొక్లెయిన్‌తో తవ్వడంతో నిలిచిన నీరు

పొక్లెయిన్లతో తవ్వి.. ద్వారకాతిరుమల, గుణ్ణంపల్లి గ్రామాల్లో చెరువుల్లో ఉపాధి హామీ పనులు జరుగుతున్నా వైకాపా నాయకులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపారు. ఆయా ప్రాంతాల్లో పొక్లెయిన్లతో తవ్వి కూలీలు పని చేసినట్లు బినామీల పేర్లతో మస్తర్లు వేసి, నిధులు కాజేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలా అనేక కోణాల్లో ఉపాధి పథకం సిబ్బంది అక్రమ మార్గంలో జేబులు నింపుకొన్నారు.

గుణ్ణంపల్లికి చెందిన వేములూరి విజయరాజు అనే ఔషధాల దుకాణం నిర్వాహకుడు ఉపాధి హామీ పనికి వచ్చినట్లు మస్తర్లు వేసి సొమ్ములు డ్రా చేశారు. అదే ఊరికి చెందిన కలపాల సుజాత ఏలూరు ఆశ్రం ఆసుపత్రిలో నర్సు. ఈమె పేరు మీద కూడా మస్తర్లు వేశారు.

ద్వారకాతిరుమలకు చెందిన గోరుముచ్చు వెంకన్న స్థానిక ఆలయంలో స్వీపర్‌గా పని చేస్తారు. ఎప్పుడూ ఉపాధి హామీ పనులకు వెళ్లలేదు. కానీ ఆయన పేరు మీద మస్తర్లు వేసి సుమారు రూ.40 వేలు కాజేశారు. కంచుం దుర్గారావు ఆలయంలో పొరుగు సేవల ఉద్యోగి. అతడి పేరు మీద కూడా మస్తర్లు వేసి డబ్బులు మింగేశారు. మరో వ్యక్తి మాదాస్‌ ఉపేంద్రకుమార్‌ శ్రీవారి ఆలయ కేశఖండనశాలలో పని చేస్తారు. అతడి పేరు మీద మస్తర్లు వేసి దోచుకున్నారు. మతిస్థిమితం లేని వృద్ధురాలి పేరు మీద మస్తర్లు వేసి అక్రమాలకు పాల్పడ్డారు. స్థానిక వైకాపా నాయకులు సురేశ్, ఉక్కుర్తి వెంకట్రావు పేర్ల మీద కూడా మస్తర్లు వేసి సొమ్ములు కాజేశారు.

ద్వారకాతిరుమల మండలంలో 16874 జాబ్‌ కార్డులుండగా సుమారు 26800 మంది కూలీలు ఉన్నారు. వీరిలో 9800 మంది పనులను ఉపయోగించుకుంటున్నారు. పథకంలో గత ప్రభుత్వ హయాంలో ద్వారకాతిరుమల, గుణ్ణంపల్లి గ్రామాల్లో భారీగా అక్రమాలు జరిగాయి. వైకాపా నాయకులు చొరవ, భరోసాతో కావాల్సిన వారి పేర్ల మీద మస్తర్లు వేసి రూ.లక్షలు నొక్కేశారు. అధికారులు, క్షేత్ర సహాయకులు, మేట్లు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ్డారు. ద్వారకాతిరుమలలో క్షేత్ర సహాయకురాలు తన కుటుంబ సభ్యులు పనికిరాకపోయినా మస్తర్లు వేశారు. పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం మిన్నకుండటంతో అడ్డగోలుగా దోచుకున్నారు. సుమారు రూ.30 లక్షలకు పైగా అవినీతి జరిగినట్లు అంచనా.

ఉపాధి హామీ అక్రమాల్లో తవ్వే కొద్దీ కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వంలో వైకాపా నాయకుల అండదండలతో పనికి వచ్చిన వారికి కాకుండా ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా పలువురి పేర్ల మీద మస్తర్లు వేసి రూ.లక్షలు కాజేశారు.
విచారణ  చేస్తాం.. ‘పథకంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేస్తాం. అవినీతి జరిగినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం’ అని ఎంపీడీవో తిరుపతిరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని