logo

అమ్మకు ఆవేదన

కొన్నేళ్లుగా సాధారణ ప్రసవాల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. వ్యాపార ధోరణితో అవసరం లేకున్నా సిజేరియన్‌ కాన్పులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 29 Jun 2024 05:03 IST

సిజేరియన్‌ ద్వారానే అధిక శాతం కాన్పులు
‘ప్రైవేటు’లో 80 శాతం పైనే..

భీమవరం పట్టణం, ఆకివీడు, పెనుమంట్ర, వీరవాసరం, న్యూస్‌టుడే: కొన్నేళ్లుగా సాధారణ ప్రసవాల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. వ్యాపార ధోరణితో అవసరం లేకున్నా సిజేరియన్‌ కాన్పులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో భీమవరం, తణుకు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీలో సాధారణ ప్రసవాలు తక్కువగా జరుగుతున్నట్లు గుర్తించిన వైద్య శాఖ అధికారులు ఇటీవల విచారణ నిర్వహించగా ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు 20 శాతం లోపే జరుగుతున్నట్లు గుర్తించారు. పలు పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు జరగకపోవడంపై వైద్యులకు తాకీదులు ఇచ్చారు.

భీమవరం ప్రాంతీయ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రసవాలు 260. వీటిలో సాధారణం  58 కాగా శస్త్ర చికిత్స నిర్వహించినవి 202.
పెనుగొండ సీహెచ్‌సీలో ఈ ఏడాది ఇప్పటి వరకు 16 మాత్రమే సాధారణ ప్రసవాలు జరిగాయి. శస్త్ర చికిత్స ద్వారా 118 కాన్పులు చేశారు.
వీరవాసరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మార్చి నుంచి ఇప్పటి వరకు 2 మాత్రమే సాధారణ ప్రసవాలు జరిగాయి. అయిదు కేసులను ఇతర ఆసుపత్రులకు పంపారు.

పశ్చిమగోదావరిలో తణుకులో జిల్లా ఆసుపత్రి, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, నరసాపురంలలో ప్రాంతీయ ఆసుపత్రులున్నాయి. పెనుగొండ, ఆచంటలలో సీహెచ్‌సీలున్నాయి. 2023-24లో జరిగిన ప్రసవాల్లో సింహభాగం సిజేరియన్లే. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో 80 శాతానికి పైగా సిజేరియన్లు జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అధిక శాతం సిజేరియన్లు నమోదు కావడంపై పట్టణాల్లోని ఆరు ఆసుపత్రుల నిర్వాహకులకు వైద్యశాఖ అధికారులు ఇటీవల తాకీదులిచ్చారు. దీనిపై నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు.

ఎప్పుడు అవసరం.. బిడ్డ అడ్డం తిరిగినా, గర్భసంచిలో తగినంత ఉమ్మనీరు లేకపోయినా, నెలలు నిండినా కాన్పు అయ్యే అవకాశం లేనప్పుడు మాత్రమే శస్త్రచికిత్స ద్వారా కాన్పు చేయాలి. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏదో ఒక సాకుతో శస్త్రచికిత్స చేసి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. మంచి ముహూర్తానికి ప్రసవం చేయాలంటూ భీమవరంలో ఓ ఆసుపత్రికి వెళ్లిన గర్భిణి నుంచి రూ. 80 వేలు వసూలు చేశారు. పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లోని ఆసుపత్రుల్లో సిజేరియన్లకు రూ.లక్ష నుంచి రూ.1.10 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.

భీమవరం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలు

దుష్ప్రభావాలు ఎన్నో..

శస్త్ర చికిత్స ద్వారా కాన్పు జరిగిన తర్వాత తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుట్లు వేసిన చోట ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదముంది. శస్త్ర చికిత్స సమయంలో ఇచ్చే మత్తుతో వెన్ను, తలనొప్పి వస్తుంది. కొందరికి తీవ్ర రక్తస్రావమవుతుంది. ప్రసవం తర్వాత బలహీనపడతారు. మొదటిసారి సిజేరియన్‌ చేస్తే రెండో కాన్పును కూడా శస్త్ర చికిత్స ద్వారా నిర్వహించాలి.

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు తక్కువే..

వీరవాసరం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు రోజు రోజుకు తగ్గుతోంది. వీరవాసరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఇద్దరు మహిళలకు సాధారణ ప్రసవాలు చేశారు. ఇక్కడికి వచ్చిన అయిదుగురు మహిళలను భీమవరం, పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్‌ చేయగా ఆపరేషన్‌ చేసి ప్రసవాలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఈ పీహెచ్‌సీ పరిధిలో 53 మందికి ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగినట్లు తెలిపారు.

అవగాహన కల్పిస్తున్నాం.. శస్త్ర చికిత్స ద్వారా కాన్పులు చేస్తున్న ఆసుపత్రులను తనిఖీ చేసి కారణాలు తెలుసుకుంటున్నాం. ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు గర్భిణుల ఇళ్లకు వెళ్లినప్పుడు సాధారణ ప్రసవాలపై అవగాహన కల్పించేలా ఆదేశాలిచ్చాం. ఐఎంఏ సమావేశాల్లోనూ ప్రైవేటు వైద్యులకు తగు సూచనలు ఇస్తున్నాం.

డి.మహేశ్వరరావు, డీఎంహెచ్‌వో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని