logo

నగర హోదా దిశగా అడుగులు!

పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం నగర పాలక సంస్థ హోదా దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి కొన్నేళ్ల నాటి ప్రణాళిక ఎన్డీయే సర్కారు అధికారంలోకి రావడంతో మళ్లీ తెరపైకి వచ్చింది.

Published : 29 Jun 2024 04:19 IST

ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు
భీమవరం పురపాలక కార్యాలయ ఆవరణ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం నగర పాలక సంస్థ హోదా దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి కొన్నేళ్ల నాటి ప్రణాళిక ఎన్డీయే సర్కారు అధికారంలోకి రావడంతో మళ్లీ తెరపైకి వచ్చింది. న్యాయస్థానాల పరిధిలో ఉన్న కేసులను పరిష్కరించి చట్టబద్ధంగా నగర పాలక హోదా తెచ్చేందుకు ప్రజాప్రతినిధులు రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలోనే పట్టణంలో విలీనమైన గ్రామాల్లో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు నివేదికలు తయారు చేస్తున్నారు. పురపాలక కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమీక్షలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఈ అంశంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

గతంలోనే రాజపత్రం విడుదల

తాడేరు, రాయలం, చినఅమిరం, కొవ్వాడ- అన్నవరం గ్రామాలను భీమవరం పట్టణంలో విలీనం చేసేలా గతంలోనే రాజపత్రం విడుదలైంది. అప్పట్లో వార్డుల విభజన కూడా జరిగింది. పట్టణంలో ప్రస్తుతం ఉన్న 39 వార్డుల్లోనే గ్రామాల ఓటర్లను చేర్చారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కొన్ని గ్రామాల నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో విలీన ప్రక్రియ నిలిచింది. తర్వాత పునర్విభజనలో భాగంగా పశ్చిమగోదావరికి భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పడింది. ఈ నేపథ్యంలో  విలీన గ్రామాలకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకునేందుకు పురపాలక అధికారులను బృందాలుగా ఏర్పాటు చేశారు. ఇంతలో న్యాయస్థానం స్టే ఇవ్వడంతో మొత్తం ప్రక్రియ నిలిచింది. ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాప్రతినిధులు అధికారులకు సూచనలు ఇవ్వడంతో విలీన ప్రక్రియలో సమస్యలను పరిష్కరించడంతో పాటు భీమవరానికి నగర పాలక సంస్థ హోదా తెచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి.

అంచెలంచెలుగా విస్తరణ

1948లో మూడో శ్రేణి పురపాలక సంఘంగా భీమవరం ఏర్పడింది. 1963లో రెండోశ్రేణిగా, 1967లో ప్రథమ శ్రేణిగా, 1980 ప్రత్యేక, 2011 సెప్టెంబరులో సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా వర్గోన్నతి పొందింది. ప్రస్తుతం 39 వార్డుల్లో దాదాపు 1.63 లక్షల మంది జనాభా ఉన్నారు. విలీన గ్రామాలు కలిస్తే జనాభా దాదాపు 2 లక్షలకు చేరనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని