logo

ప్రాంతీయ హా..సుపత్రి

జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యం గగనమైంది. ఓపీ నుంచి వైద్య సేవల వరకు అన్నింటా రోగులు అగచాట్ల పడుతున్నారు. అత్యవసర సేవల కోసం వచ్చినా ప్రాథమిక వైద్యంతోనే సరిపుచ్చుతున్నారు.

Updated : 29 Jun 2024 05:04 IST

ప్రతి కేసూ రిఫర్‌ చేయడమే

ఓపీ వద్ద నిత్యం నిరీక్షణే

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యం గగనమైంది. ఓపీ నుంచి వైద్య సేవల వరకు అన్నింటా రోగులు అగచాట్ల పడుతున్నారు. అత్యవసర సేవల కోసం వచ్చినా ప్రాథమిక వైద్యంతోనే సరిపుచ్చుతున్నారు. అవకాశం ఉన్నంత వరకు ఏలూరు సర్వజన ఆసుపత్రి పంపేసి చేతులు దులుపుకొంటున్నారు. ప్రమాద సమయాల్లో గాయాలకు కట్లుకట్టి పంపేస్తున్నారు. ప్రసూతి సేవలతో పాటు పలు విభాగాల్లో రోగులకు అంతంత మాత్రంగా సేవలందుతున్నాయి. రక్త పరీక్షలు, స్కానింగ్‌ కోసం బయటకు పంపుతున్నారు. రేడియాలజిస్టు లేరు. చిన్నారులకు ఎన్‌బీఎస్‌యూ యూనిట్‌ ఉన్నా ప్రైవేటు ఆసుపత్రులకు పంపుతున్నారు. ఎక్స్‌రే యూనిట్‌లో రేడియోగ్రాఫర్‌ లేరు. చివరకు రోగులకు సరఫరా అవుతున్న భోజనం నాణ్యత కూడా అంతంత మాత్రమే.

ఏలూరు  వెళ్లమన్నారు..

‘కింద పడిపోవడంతో నాకు గాయాలయ్యాయి. మా అమ్మ లక్ష్మి సహాయంతో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చా. వైద్యం అందించకుండానే ఏలూరు కు సిఫార్సు చేశారు. వెళ్లడానికి కనీస ఖర్చులు కూడా లేని స్థితి మాది’అని కనకాద్రిపురానికి చెందిన సంపంగి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

స్కానింగ్‌  బయటకు రాశారు

‘గర్భిణి అయిన నా భార్యను వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకొచ్చా. స్కానింగ్‌ కోసం బయటకు రాశారు. మేము పేదలం. ఏలూరు సర్వజన ఆసుపత్రిలో కూడా స్కానింగ్‌ లేదు. ఏం చేయాలో తెలియడం లేదు’అని పంగిడిగూడేనికి చెందిన గంటా బేబీ మానస భర్త బాబూ భుజంగరావు వాపోయారు. 

అలంకార ప్రాయంగా..

ఆసుపత్రిలో నవజాత శిశువులకు వైద్యం అందించే ఎన్‌బీఎస్‌యూ యూనిట్‌ అలంకారప్రాయంగా ఉంది. ఇక్కడ 80 శాతం మంది పిల్లలను బయటి ఆసుపత్రులకు పంపుతున్నారు. అక్కడ వారు ఆరోగ్యశ్రీలో సొమ్ము చేసుకుంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే సిఫార్సు చేసిన డాక్టరే ప్రైవేటుగా వైద్యం అందిస్తుండటం గమనార్హం.

ఫిజియో థెరపిస్టులతో సరిపెడుతున్నారు

ఎముకల వైద్యుడు ఉన్నా ఉపయోగం లేదు. ఫిజియో థెరపిస్టులతోనే సరిపెడుతున్నారు. ఈ విభాగంలో శస్త్ర చికిత్సలు లేవు. ఆర్థో అసిస్టెంట్‌ అవసరం ఉంది. ఎక్స్‌రేలో రేడియాలజిస్టు లేరు. డిప్యుటేషన్లపై నెట్టుకొస్తున్నారు.

రక్తానికి కొరత

ప్రత్యేక రక్త నిధి కేంద్రం ఉన్నా ప్రజలకు అవసరమైన రక్తం అందుబాటులో ఉండటం లేదు. ఆయా నిల్వలు పెరిగేలా చూడాల్సిన అవసరం ఉంది.

అన్ని చోట్లా నిరీక్షణే..

‘ఓపీ చీటీ రాసే వద్ద గంటకుపైనే సమయం పడుతోంది. ఇక్కడ ఆధార్‌ చూపిస్తున్నాం. మళ్లీ రక్త పరీక్షల వద్ద అడుగుతున్నారు. ప్రైవేటుకు వెళ్లలేక ఇక్కడికొస్తే గంటల తరబడి పడిగాపులు తప్పట్లేదు’అని ఆరిపాటిదిబ్బలుకు చెందిన రామ్‌ వెంకటలక్ష్మి తెలిపారు.

ఎమ్మెల్యే దృష్టికి.. చింతలపూడి ఎమ్మెల్యే రోషన్‌కుమార్‌ ఇటీవల ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వద్ద పలువురు రోగులు తమ ఇబ్బందులను ఏకరవు పెట్టారు. వీటిపై వైద్యులతో సమీక్ష చేశారు.  ‘ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగు పరుస్తున్నా’ అని సూపరింటెండెంట్‌ బేబీ కమల తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని