logo

నిర్వహణ లేక.. నీరు పారక!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, అశ్వారావుపేట మండలాల రైతులకు వరప్రదాయినిగా నిలిచిన ప్రాజెక్టు రాష్ట్ర విభజన కారణంగా నేడు ఎందుకూ పనికి రాకుండాపోయింది.

Published : 29 Jun 2024 04:14 IST

దెబ్బతిన్న పెదవాగు ప్రాజెక్టు స్లూయిజ్‌లు, కాలువలు
నష్టపోతున్న విలీన మండలాల రైతులువేలేరుపాడు, న్యూస్‌టుడే

అడవిని తలపిస్తున్న రెడ్డిగూడెం సమీప కాలువ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, అశ్వారావుపేట మండలాల రైతులకు వరప్రదాయినిగా నిలిచిన ప్రాజెక్టు రాష్ట్ర విభజన కారణంగా నేడు ఎందుకూ పనికి రాకుండాపోయింది. అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సమీపంలో 16 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు 1979లో నిర్మించిన పెదవాగు ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలు, స్లూయిజ్‌లు దశాబ్దకాలంగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. ఫలితంగా వివిధ రకాల పంటలు సాగు చేసే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల రైతులు ఏటా వరుణుడి కరుణ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

చిట్టడవిని తలపిస్తూ.. ప్రాజెక్టు కాలువల్లో ప్రస్తుతం చెట్లు పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. పూడిక పేరుకుపోయింది. డిస్ట్రిబ్యూటర్లు, స్లూయిజ్, అక్విడక్ట్‌లు మరమ్మతులకు గురయ్యాయి. చేసేది లేక... దిగువన ఉన్న మేడేపల్లి, కమ్మరిగూడెం, కోయమాదారం, రెడ్డిగూడెం, రామవరం, విప్పలగుంపు, రాళ్లపూడి, ఒంటిబండ, బండ్లబోరు రైతులు ఏటా కొంత నగదు పోగు చేసి కాలువల్లో పూడిక తీయిస్తున్నారు. అయినా పంట పొలాలకు పూర్తి స్థాయిలో నీరు సరఫరా కావడం లేదు. వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, పొగాకు, సెనగ పంటలు సాగు చేస్తున్న వారు ఏటా నష్టపోతున్నారు. 

శిథిలావస్థకు చేరుకున్న స్లూయిజ్‌ తలుపులు

పలుమార్లు విన్నవించాం

కాలువలు, స్లూయిజ్‌లు, అక్విడక్టుల మరమ్మతుల కోసం గత ప్రభుత్వ హయాంలో రూ.43 లక్షల అంచనాతో పలుమార్లు నివేదించాం. స్పందన లేదు. ప్రభుత్వం మారినందున మరోసారి ఉన్నతాధికారులకు వివరించి సాగు నీరందించేందుకు చర్యలు చేపడతాం’ అని కేఆర్‌పురం ఐటీడీఏ జలవనరుల శాఖ ఏఈ సురేశ్‌ తెలిపారు.


రూ.3 లక్షలు నష్టపోయా..

‘గతేడాది నేను 12 ఎకరాల్లో పత్తి, మినుము, వరి సాగు చేశా. అప్పులు చేసి పెట్టుబడి పెట్టా. పంట చేతికొస్తుందనుకున్న తరుణంలో వరుణుడు ముఖం చాటేయడంతో ఎండిపోయాయి. సుమారు రూ.3 లక్షల వరకు నష్టపోయా. అప్పులు తీరలేదు. ఈ ఏడాది పంటలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది’ అని పాతరెడ్డిగూడేనికి చెందిన గిరిజన రైతు సోయం సీతయ్య తెలిపారు.


మరమ్మతులు చేయించాలి

‘పెదవాగు ప్రాజెక్టు కాలువలు, స్లూయిజ్‌ల దుస్థితిపై ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ఈ సీజన్‌లోనైనా పంటలకు ఉపయోగపడేలా కాలువల్లో పూడిక తీయించాలి. రెండు మండలాల పరిధిలో శిథిలావస్థకు చేరిన స్లూయిజ్‌లు, అక్విడక్ట్‌లకు మరమ్మతు చేయించాలి’ అని రామవరం ఎంపీటీసీ మాజీ సభ్యుడు గడ్డాల ముత్యాలరావు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని