logo

పేరుకే నిషేధం.. విరివిగా విక్రయం

రొయ్యల సాగులో నిషేధిత యాంటీ బయోటిక్స్‌ వినియోగం మరోసారి కలకలం సృష్టిస్తోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యలకు స్థానికంగా మార్కెట్‌ లేకపోవడంతో వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.

Published : 29 Jun 2024 04:11 IST

రొయ్యల సాగులోనిషేధిత యాంటీబయోటిక్స్‌ వాడకం
మండవల్లి, కైకలూరు, న్యూస్‌టుడే

రొయ్యల సాగులో నిషేధిత యాంటీ బయోటిక్స్‌ వినియోగం మరోసారి కలకలం సృష్టిస్తోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యలకు స్థానికంగా మార్కెట్‌ లేకపోవడంతో వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వాటిల్లో యాంటీ బయోటిక్స్‌ అవశేషాలు ఉండటంతో కంటైనర్లను ఆయా దేశాలు తిప్పి పంపుతున్నాయి. అధికారులు ఎంత మొత్తుకున్నా సాగుదారులు వాటి వినియోగాన్ని మానుకోవడం లేదు. ఇటీవల కైకలూరులో ఎంపెడా, మత్స్య శాఖ, విజిలెన్స్‌ అధికారులు చేసిన దాడుల్లో విస్తూ పోయే నిజాలు వెలుగుచూశాయి. కొందరు ఆక్వా దుకాణ దారులు లాభాల కోసం నిషేధించిన హానికర రసాయనాలను ఇష్టారీతిలో విక్రయిస్తున్నారు.

మ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 2.70 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు విస్తరించి ఉంది. అందులో 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగుచేస్తున్నారు. జిల్లా నుంచే ఏటా 3.5 లక్షల టన్నుల వరకు రొయ్యలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇటీవల మన ప్రాంతంలోనూ రొయ్యల సాగులో పెద్ద ఎత్తున యాంటీ బయోటిక్స్‌ వాడుతున్నారని ఎంపెడా అధికారులు చెబుతున్నారు. కాకినాడ, చెన్నై కేంద్రాలుగా రాష్ట్రం నుంచి విదేశాలకు రొయ్యలను ఎగుమతి చేస్తున్నారు. ముఖ్యంగా జపాన్, అమెరికా దేశాలు మన ప్రాంతంలోని రొయ్యల్లో అవశేషాలను కనుగొని కంటైనర్లను వెనక్కు పంపుతున్నాయి. దీనివల్ల ట్రేడర్స్‌ నష్టపోవడంతో పాటు మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న ఉత్పత్తులపై నమ్మకాన్ని తగ్గిస్తున్నాయి. కొన్ని దేశాలు మన దేశ ఉత్పత్తులను ఇప్పటికే నిషేధించాయి. నీ మన దేశం నుంచి 2022-23లో  17.18 లక్షల టన్నులు, 2023-24లో 17.82 లక్షల టన్నుల రొయ్యలను ఎగుమతి చేసి రూ.60 వేల కోట్లకు పైగా విదేశీ ఆదాయం వచ్చింది. నీ 2022లో 9, 2023లో 13 కంటైనర్లు వెనక్కి పంపినట్లు అధికారులు చెబుతున్నారు.

వీటి వాడకం ఎక్కువ

నిషేధిత జాబితాలో ఉన్న క్లోరాంఫెనికల్, నైట్రోఫ్యూఠాన్, నైట్రోఫ్యూటంటోయిన్, నియోమైసిన్‌ వంటి యాంటీ బయోటిక్స్‌ ఎక్కువగా వినియోగిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తెలిసింది. వీటితో పాటు నిషేధించిన పురుగు మందులు నువాన్, ఫార్మాలిన్‌ వంటి ప్రమాదకర మందులు సైతం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు.

మోతాదుకు మించి..

రొయ్యలకు అనేక వైరస్‌లతో కూడిన వ్యాధులొస్తుంటాయి. వైట్‌స్పాట్, వైట్‌గట్‌ సమస్యలను అధిగమించేందుకు పశువులు, కోళ్ల పెంపకంలో ఉపయోగించే యాంటీ బయోటిక్స్‌ను చెరువుల్లో వినియోగిస్తున్నారు. మంచి ఫలితాలు రావడంతో వీటి వాడకం అలవాటుగా మారింది. ఇదే అదనుగా కొన్ని వినియోగంలో లేని రసాయనాలు మార్కెట్లోకి ప్రవేశించాయి. వాటిని మోతాదుకు మించి వినియోగించడం అనేక అనర్థాలకు దారితీస్తోంది. దీంతో ఎంపెడా (మెరైన్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఆక్వా సాగులో 20 రకాల యాంటీ బయోటిక్స్‌ వాడకాన్ని నిషేధించింది.

ఆక్వా మందుల దుకాణంలో వివరాలు సేకరిస్తున్న అధికారులు

తనిఖీలు అంతంత మాత్రమే

కొన్నింటిని నిషేధించినా రైతులకు అందుబాటులో ఉంటున్నాయంటే అధికారులు తనిఖీలు తీరును అర్థం చేసుకోవచ్చు. మత్స్య శాఖ, ఆహార భద్రత,   ఎంపెడా అధికారులు వీటిని అడ్డుకునేందుకు తనిఖీలు చేపట్టాలి. అయితే దుకాణాల నిర్వాహకుల నుంచి ముడుపులు దండుకుని తనిఖీలు చేయడం లేదనే విమర్శలున్నాయి. కైకలూరు, గణపవరం, ఏలూరు ప్రాంతాల్లో అడపాదడపా విజిలెన్స్, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయి.  కైకలూరు ప్రాంతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు మత్స్య శాఖ, విజిలెన్స్, ఎంపెడా ఆధ్వర్యంలో 2021లో ఏడు కేసులు నమోదు చేశారు. ఇటీవల కైకలూరులోని దుకాణాల్లో నిషేధించిన యాంటీ బయోటిక్స్‌ దొరికినా చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

వ్యాధుల తీవ్రత తగ్గించేందుకు..

రొయ్యల సాగులో ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఇదే సమయంలో వ్యాధుల తీవ్రత అధికమైంది. మూడు పంటలకు ఒకటి మాత్రమే రైతుల చేతికి వస్తోంది. రెండు పంటలు మందుల్లేని వైట్‌స్పాట్‌ వ్యాధికి దెబ్బతింటున్నాయి. రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. వైట్‌స్పాట్‌ వ్యాధి నుంచి ముందస్తు రక్షణకు ఎంపెడా నిషేధించిన 20 రకాల యాంటీ బయోటిక్స్‌ను పలువురు రైతులు అనధికారికంగా వినియోగిస్తున్నారు.


ఎగుమతులపై ప్రభావం

‘ఆక్వా సాగులో యాంటీ బయోటిక్స్‌ వాడకంతో రొయ్యల విదేశీ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. రైతులకు వీటి వాడకంతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నాం. అయితే కొందరు దుకాణదారులు పశువులు, కోళ్ల పెంపకంలో వినియోగించే నిషేధిత రసాయనాలను విక్రయిస్తున్నారు. ఎప్పటికప్పుడు దుకాణాలపై దాడులుచేసి అపరాధ రుసుములు విధిస్తున్నాం. అయినా పద్ధతి మార్చుకోకపోతే కేసులు నమోదు చేసి దుకాణాలు సీజ్‌ చేస్తాం’ అని కైకలూరు మత్స్య శాఖ ఏడీ చాంద్‌బాషా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని