logo

నిఘా నేత్రం.. నామమాత్రం..!

తాడేపల్లిగూడెం పట్టణంలోని నిఘా కెమెరాలు దాదాపు పని చేయడం మానేశాయి. దొంగలు, పాత నేరస్థులు, సంఘవిద్రోహుల కదలికలను పసిగట్టడానికి  ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కేసుల దర్యాప్తులో వీటి పాత్ర కీలకం.

Published : 29 Jun 2024 04:08 IST

కొరవడిన పర్యవేక్షణ
తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే

పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కంట్రోల్‌ రూమ్‌

తాడేపల్లిగూడెం పట్టణంలోని నిఘా కెమెరాలు దాదాపు పని చేయడం మానేశాయి. దొంగలు, పాత నేరస్థులు, సంఘవిద్రోహుల కదలికలను పసిగట్టడానికి  ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. కేసుల దర్యాప్తులో వీటి పాత్ర కీలకం. పలు కేసుల్లో నిందితులను పట్టుకోవడానికి ఇవి ఎంతో దోహదం చేస్తాయి. వీటి నిర్వహణ పట్టించుకోకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి.  పలు చోట్ల ధ్వంసమై స్తంభాలకు వేలాడుతున్నాయి. వైకాపా అయిదేళ్ల పాలనలో వీటి నిర్వహణను పూర్తిగా విస్మరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో సీసీ కెమెరాలకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.

రూ.లక్షలు వెచ్చించి..

నిఘా నేత్ర వ్యవస్థను పట్టణ పోలీసులు రెండున్నరేళ్ల కిందట ఆధునికీకరించారు. రూ.24 లక్షల విరాళాలు సేకరించి పట్టణ పరిధిలోని ప్రధాన కూడళ్లు, రహదారులు, సమస్యాత్మక ప్రాంతాల్లో  84 సీసీ కెమెరాలు అమర్చారు. వీటిలో 59 కెమెరాలు కొత్తవే. మిగిలిన వాటికి మరమ్మతులు నిర్వహించారు.  సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించడానికి వీలుగా పోలీస్‌ స్టేషన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. కొంత కాలం వరకు ఇవి ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేశాయి. కాలక్రమేణా నిర్వహణ లేకపోవడంతో  పని చేయకుండా పోయాయి. ప్రస్తుతం కేవలం అయిదు కెమెరాలు మాత్రమే పనిచేస్తుండటం గమనార్హం. తిరిగి ఈ వ్యవస్థ పునరుద్ధరించాలంటే రూ.6 లక్షల వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.మున్సిపల్‌ సాధారణ నిధుల నుంచైనా  మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా...

నేర నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుంది.   నేరాలకు రెక్కీ నిర్వహిస్తున్నా, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నా, రాత్రులు అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులను నిఘా వ్యవస్థ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. రహదారి ప్రమాదాలకు కారణాలను  తెలుసుకోవచ్చు. వీటి వల్ల విస్తృత ప్రయోజనాలు ఉన్నా...వీటిని యంత్రాంగం పట్టించుకున్న దాఖలాలు లేవు.

‘‘కొన్ని నెలల కిందట రూ.లక్ష వెచ్చించి కెమెరాలకు మరమ్మతులు చేయించాం. వర్షాలు, గాలులకు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. నిఘా వ్యవస్థ ఆధునికీకరణపై దృష్టి సారిస్తాం.’’ అని సీఐ సుబ్రహ్మణ్యం అన్నారు.


పట్టణంలోని కడగట్ల వంతెనపై ఏర్పాటు చేసిన నిఘా నేత్రం ఇది. రెండేళ్ల కిందట దీనిని ఏర్పాటు చేశారు. ఆరు నెలల నుంచి ఈ విధంగా నేలచూపులు చూస్తూ దర్శనమిస్తోంది. కొన్నాళ్ల కిందట ఈ ప్రాంతంలో రహదారి ప్రమాదం చోటు చేసుకుంది. కెమెరా పని చేయకపోవడంతో ప్రమాదానికి గల కారణాలను పోలీసులు గుర్తించడం కష్టమైంది. స్థానికులు చెప్పిన సమాచారం మేరకే దర్యాప్తు కొనసాగించారు.


పట్టణంలోని కోడె వెంకట్రావు పురపాలక ఉన్నత పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన కెమెరా ఇది. దీని చుట్టూ చెట్లు ఉండటంతో ఎటువంటి ప్రయోజనం లేని పరిస్థితి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని