logo

లేదు.. ఓ ప్రణాళిక.. పద్ధతి

పల్లెలు కరుగుతున్నాయి.. పట్టణాలు  విస్తరిస్తున్నాయి..ఏటా పట్టణాలకు వలసలు పెరుగుతుండటంతో దీనికనుగుణంగా ప్రణాళికలు మాత్రం పట్టాలెక్కడం లేదు. దశాబ్దాల నాటి మాస్టర్‌ ప్లానే ఇప్పటికీ అమలు చేస్తుండటంతో పట్టణవాసులకు ఇక్కట్లు తీరడం లేదు.

Published : 27 Jun 2024 04:46 IST

పట్టించుకోని పట్టణ ప్రణాళిక విభాగం !

గత పాలనలో పూర్తి నిర్లక్ష్యం

చక్రబంధంలో పట్టణ జీవనం 

తణుకు, భీమవరం పట్టణం, తాడేపల్లిగూడెం అర్బన్, న్యూస్‌టుడే: పల్లెలు కరుగుతున్నాయి.. పట్టణాలు  విస్తరిస్తున్నాయి..ఏటా పట్టణాలకు వలసలు పెరుగుతుండటంతో దీనికనుగుణంగా ప్రణాళికలు మాత్రం పట్టాలెక్కడం లేదు. దశాబ్దాల నాటి మాస్టర్‌ ప్లానే ఇప్పటికీ అమలు చేస్తుండటంతో పట్టణవాసులకు ఇక్కట్లు తీరడం లేదు. భవిష్యత్‌ అవసరాల రీత్యా  మాస్టర్‌ ప్లాన్‌ను ఆయా పట్టణాల్లో రూపొందిస్తారు. పట్టణ నైసర్గిక స్వరూపం, జనాభా, ట్రాఫిక్‌ వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని ఇరవై ఏళ్ల తర్వాత ఎదురయ్యే ఇబ్బందులను ముందుగా అంచనా వేస్తారు. కానీ గత 40 ఏళ్ల నాటి మాస్టర్‌ ప్లాన్‌నే ఇప్పటికీ జిల్లాలోని పట్టణాల్లో అమలు చేస్తుండటం గమనార్హం. దీంతో కొత్తగా భవన నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకున్న వారికి అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం  నివాసాలు ఉన్న ఏరియాను వాణిజ్య ప్రాంతాలుగా చూపుతూ అనుమతులు ఇవ్వడం లేదు. 

విస్తరణకు నోచుకోని మార్గాలు

భీమవరం పట్టణంలో 1987 నాటి బృహత్‌ ప్రణాళిక ఇప్పటికీ కొనసాగుతోంది. కొత్తగా ప్రణాళిక ఇటీవల ఆమోదించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. దీంతో రహదారులు ఇరుకుగా ఉన్నాయి. స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే కారణంతో రహదారుల విస్తరణపై  దృష్టిసారించ లేదు. నరసాపురం- భీమవరం రోడ్డు, జాతీయ రహదారి ఇలా ప్రధానరోడ్లు మినహా పట్టణంలోని మిగిలిన మార్గాలు విస్తరణకు నోచుకోలేదు.

రాబోయే రెండు దశాబ్దాల్లో పెరిగే జనాభా పెరుగుదలను పరిగణనలోకి తీసుకొని అవసరమయ్యే మౌలిక సదుపాయాలకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తారు. దీని ప్రకారం రహదారుల విస్తరణ చేపడతారు. మరో వైపు వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రజా అవసరాలు గుర్తించి సమస్యలు లేకుండా చేయాలంటే మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేయాలి. ఇంత కీలకంగా ఉన్న ఈ ప్రణాళికను యంత్రాంగం విస్మరించింది. ముఖ్యంగా ఇది చేయకపోవడంతో రహదారులు విస్తరణకు నోచుకోవడం లేదు.

జిల్లాలోని చాలా పట్టణాల్లో మాస్టర్‌ ప్లాన్‌ కాల పరిమితి ముగిసింది. 44 ఏళ్ల నాటి ప్రణాళికతో రాష్ట్రంలోని  నగర పాలక సంస్థల్లో ఏలూరు ద్వితీయ స్థానంలో ఉండగా,  మున్సిపాలిటీల్లో భీమవరం నాలుగో స్థానంలో ఉంది. 

పుట్టగొడుగుల్లా కొత్త కాలనీలు.. పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందిన తణుకు పట్టణం 2001లో ప్రణాళిక రూపొందించారు. కొన్ని రహదారులు ఇప్పటికీ ఇరుగ్గానే ఉన్నాయి. అధికారులు ఇష్టానుసారంగా షెల్లార్లకు అనుమతులు మంజూరు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.  పట్టణాన్ని ఆనుకుని కొత్తగా కాలనీలు వెలిశాయి. రాష్ట్రపతి రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది.్చ

నీట మునుగుతున్న రోడ్లు..నరసాపురం రెవెన్యూ డివిజన్‌ కేంద్రం. సముద్ర తీర ప్రాంతం ఇక్కడే ఉంది. 2002 మార్చిలో ప్రణాళిక తయారు చేశారు. ప్రధాన కూడళ్లు విస్తరణకు నోచుకోకపోవడంతో ట్రాఫిక్‌ సమస్య జటిలమవుతోంది. కొద్ది పాటి వర్షానికే రహదారులు నీట మునుగుతున్నాయి.

గూడెం.. ట్రాఫిక్‌ దిగ్బంధం

జిల్లాకు వాణిజ్య కేంద్రంగా ఉన్న తాడేపల్లిగూడెం పురపాలక సంఘ పరిధిలో ఏళ్ల నాటి ప్లానే ఇప్పటికీ కొనసాగుతోంది. తాడేపల్లిగూడెం పురపాలక సంఘం 1958 లో ఏర్పడింది. అప్పటి పరిస్థితులకనుగుణంగా మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. అప్పటి నుంచి గత ఏడాది వరకు పాత ప్రణాళికనే అనుసరిస్తూ వచ్చారు. ప్రస్తుతం పట్టణ పరిధిలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. కే.ఎన్‌ రోడ్డు, శేషమహాల్‌ రోడ్డు, భీమవరం రోడ్డు, జూబ్లీరోడ్డులలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. 2023 ఆగస్టు నెలలో నూతన మాస్టర్‌ ప్లాన్‌ను తెరపైకి తెచ్చినా పకడ్బందీగా అమలు చేయలేదు. ప్రధాన కూడల్లో వంద అడుగుల రోడ్లు ఉండేలా దీనిని రూపొందించారు.

ప్రయాణానికి ఆటంకాలే

వ్యాపార కేంద్రంగా ఉన్న పాలకొల్లులో 2002లో తెరపైకి తెచ్చిన ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. పెనుగొండ, నరసాపురం, భీమవరం వెళ్లాలంటే రహదారులు ఇరుకుగా ఉండి ట్రాఫిక్‌ సమస్యతో ప్రయాణికులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
‘‘జీఐఎస్‌ విధానం ద్వారా కొన్ని పట్టణాల్లో మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించే బాధ్యతను స్కై గ్రూపు ఏజెన్సీకి అప్పగించారు. ఈ గ్రూపు సభ్యులు ప్రస్తుతం ఆయా పట్టణాల్లో గతంలో వివరాలు సేకరించారు. త్వరలో ప్రణాళికను అమలు చేస్తాం.’’ అని పట్టణ ప్రాంతీయ సంచాలకులు అరుణవల్లి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని