logo

మీరెలా చెబితే అలా సార్‌

వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధుల సిఫార్సులతో విధుల్లోకి చేరిన అధికారులు ఇప్పటి వరకు వాళ్ల వెంట అంటకాగారు. వాళ్లు చెప్పినట్లే నడుచుకున్నారు

Published : 27 Jun 2024 04:38 IST

నాడు వైకాపా నేతలతో అంటకాగి.. నేడు కొత్త భజన

పోస్టింగుల కోసం ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు

భీమవరం పట్టణం, పాలకొల్లు పట్టణం, తణుకు, న్యూస్‌టుడే : వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధుల సిఫార్సులతో విధుల్లోకి చేరిన అధికారులు ఇప్పటి వరకు వాళ్ల వెంట అంటకాగారు. వాళ్లు చెప్పినట్లే నడుచుకున్నారు. ప్రజలు గగ్గోలు పెట్టినా, ప్రతిపక్షాలు తప్పు అన్నా పట్టించుకోకుండా ఆ ప్రజాప్రతినిధుల మెప్పు  కోసం పనులు చేశారు. ఇప్పుడా పరిస్థితి మారింది. అధికారుల్లో కొందరు అప్పట్లో మళ్లీ ఆ ప్రభుత్వమే వస్తుంది..మా హోదాకు ఢోకా ఉండదంటూ అప్పటి నాయకుల మాదిరే చెప్పుకొచ్చారు. ఎన్నికల నిబంధనావళిని సైతం లెక్క చేయకుండా వాళ్లకోసం కష్టపడ్డారు. ఎన్నికల ఫలితాలొచ్చాక వారి ఆశలు తలకిందులయ్యాయి,  ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడా అధికారులు కొత్తగా భజనలు ప్రారంభించారు. ప్రస్తుత ప్రజాప్రతినిధిని ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

  • తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ఓ అధికారి గతంలో అధికారంలో ఉన్న పార్టీకి విధేయుడిగా వ్యవహరించారు. వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆ అమాత్యుని అండదండలుండటంతో జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా చర్యలుండేవి కాదు. అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే పెద్దాయన్ని కలిసి రండంటూ ఉచిత సలహాలిస్తూ స్వామి భక్తిచాటుకున్నవాళ్లలో కొందరు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధి దగ్గరకు వెళ్లి వినయం ప్రదర్శిస్తున్నారు.
  • పారిశ్రామిక కేంద్రం తణుకు నియోజకవర్గంలో కొందరు అధికారుల తీరు కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధికి విస్మయం కలిగిస్తోంది. గతంలో అక్కడి అమాత్యుని కనుసన్నల్లో పనిచేసి ఇప్పుడు మీరెలా అంటే..అలా అంటున్నారు. ఇదే నియోజకవర్గంలోని ఓ ఆలయ అధికారైతే గత కొన్నేళ్లుగా ఏ ప్రజాప్రతినిధి గెలిస్తే ఆ ప్రజాప్రతినిధి పేరిట పూజలు చేయించి ప్రసాదాలు ఇచ్చి మచ్చిక చేసుకోవడంలో మంచి దిట్ట. ఇక్కడ పోలీసు అధికారుల్లో కొందరు మళ్లీ అవకాశం అంటూ వెంపర్లాడుతున్నారు. గతంలో ఉద్యోగ ధర్మాన్ని విస్మరించి పనిచేసిన అధికారులు పోస్టుల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు.
  • నరసాపురం నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధికి విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఏదైనా సమస్యపై, కేసులు విషయమై ఆ అధికారుల దగ్గరకు వెళ్తే పట్టించుకునేవారు కాదు. పైగా చులకనగా చూసేవారు. గతంలో ఉన్న ప్రజాప్రతినిధికి అధికారులు ఇద్దరూ అంగరక్షకులుగా వ్యవహరించారు. కంటికి రెప్పలా కాపాడేవారని చెప్పుకొంటున్నారు. ఇప్పుడు సీను మార్చారు. ఆ నియోజకవర్గంలో కీలకమైన రెవెన్యూ విభాగంలోని అధికారులు కూడా అలాగే కొనసాగారు. లక్ష్మీకటాక్షం ఉండే పోస్టులను వదిలి వెళ్లలేక ఆ ప్రజాప్రతినిధిని ప్రసన్నం చేసుకునేందుకు యత్నాలు ముమ్మరం చేశారు.

సొమ్ములు పంచుకున్నారు..సిఫార్సులంటున్నారు

సాధారణ ఎన్నికల సమయంలో యథేచ్ఛగా నగదు పంపిణీ జరిగింది. వాలంటీర్లకు, రాజకీయంగా కొద్దిపాటి పరపతి ఉన్న చోటా నాయకులకు కూడా వైకాపా నాయకులు నేరుగా ముట్టజెప్పారు. ఓటర్లకు రాత్రివేళల్లో నగదు పంపిణీ చేయడం గతంలో జరిగిన ఎన్నికల్లో చూశాం. ఈసారి పట్టపగలు ఇచ్చారు. ఆ సమయంలో పంపిణీకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలంటూ వివిధ పోలీస్‌స్టేషన్లకు నగదును అందించారు. ఉండి, ఆచంట, నరసాపురం, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల్లో కొన్ని స్టేషన్లకు అప్పటి అధికార వైకాపా మద్దతుదారులు ఇచ్చిన నగదును ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత పంచుకున్నారు. ఇప్పుడేమో వాళ్లంతా మళ్లీ అదే స్టేషన్‌లో అవకాశం కల్పించాలంటూ కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను వేడుకొంటున్నారు.

  • జిల్లా కేంద్రమైన భీమవరం పురపాలక సంఘం, రెవెన్యూ, జలవనరులు, విద్యుత్తు, పోలీసు ఇలా ప్రముఖమైన శాఖల్లో పోస్టుల కోసం ఆ ప్రజాప్రతినిధి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వచ్చిన అధికారులను ఆ ప్రజాప్రతినిధి చిరునవ్వుతో పలకరిస్తూ చూద్దాంలే అంటూ పంపించేస్తున్నారు.
  • పాలకొల్లు నియోజకవర్గంలోని ఓ పుణ్యక్షేత్రంలో పనిచేస్తున్న అధికారి మొన్నటి వరకు అక్కడి ప్రజాప్రతినిధి చిత్రం లేకుండానే భారీఫ్లెక్సీలు కట్టారు. అయినా ఆ ప్రజాప్రతినిధి ఏమీ అనేవారు కాదు. ఇప్పుడు అక్కడ పరిస్థితి మారింది. మళ్లీ ఆయనే ఎన్నికయ్యారు, పైగా అమాత్యులయ్యారు. దెబ్బతో ఆ అధికారి రూటే మార్చేశారు. మంత్రిగారి చిత్రంతో భారీ బ్యానర్లు కట్టేసి ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు పడుతున్నారు. పురపాలక సంఘంలో ఓ అధికారి ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ల అంటకాగుతూ కొన్నేళ్లుగా అక్కడే విధుల్లో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ అవకాశం కోసం అమాత్యుని చుట్టూ వెంపర్లాడుతున్నారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని