logo

ఎన్నాళ్లకెన్నాళ్లకో!

ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పంటకాలువలు, డ్రెయిన్ల ప్రక్షాళన పనులు పదిరోజుల్లోగా చేపట్టేలా ప్రతిపాదనలు చేయాలి. ప్రధానంగా తూడు గుర్రపుడెక్క మట్టి పూడికతీత పనులు చేపట్టాలి.

Published : 27 Jun 2024 04:30 IST

త్వరలోనే డ్రెయిన్లు, కాలువల ప్రక్షాళన

ఆమాత్యుని ఆదేశాలతో టెండర్లకు పిలుపు

నరసాపురం మండలం కొప్పర్రు మురుగు కాలువలో గుర్రపుడెక్క ఇలా.. 

పాలకొల్లు, భీమవరం అర్బన్, న్యూస్‌టుడే: ‘ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పంటకాలువలు, డ్రెయిన్ల ప్రక్షాళన పనులు పదిరోజుల్లోగా చేపట్టేలా ప్రతిపాదనలు చేయాలి. ప్రధానంగా తూడు గుర్రపుడెక్క మట్టి పూడికతీత పనులు చేపట్టాలి. లాకులు, ఔట్‌ఫాల్‌ స్లూయిజ్‌ల మరమ్మతులు చేపట్టాలి. దీనికి బడ్జెట్‌ ఇబ్బందులున్నా ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు సుముఖత తెలిపారు.’ అమరావతిలో జలవనరులశాఖ ముఖ్యఅధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాటలివి.

ఖరీఫ్‌లో డ్రెయిన్లు మురుగు లాగడం లేదని గత కొన్నేళ్లుగా డెల్టాలోని కొన్ని ప్రాంతాల్లో అన్నదాతలు గతంలో పంటవిరామం ప్రకటించిన నేపథ్యానికి తాజా నిర్ణయం ఎంతో ఊరటనిస్తోంది. ఇకపై ఎటువంటి పంట విరామాలు అక్కర్లేదు.. ధైర్యంగా ఖరీఫ్‌ సాగుకు రైతులందరూ ఉపక్రమించవచ్చనే సంకేతాలను కొత్త ప్రభుత్వం క్షేత్రస్థాయికి పంపించింది. పశ్చిమడెల్టాలో 410 కిలోమీటర్ల మేర ఉన్న 21 మేజర్‌ డ్రెయిన్లలో తొలి విడత పనులు పూర్తిచేసినా వచ్చే వర్షాకాలంలో పంటలకు పెనుముప్పు తప్పుతుందని రైతాంగం భావిస్తోంది. రబీలో శివారు భూములకు సాగునీరందడం లేదంటే ఆధునికీకరణ పనులు పడకెయ్యడమే కారణం. ఆయా పనులను కూడా యుద్ద ప్రాతిపదికన చెయ్యాలని ఆదేశాలు వెలువడటం వ్యవసాయానికి మంచిరోజులు తెచ్చినట్టుగా అన్నదాతలు భావిస్తున్నారు.

వరద భయానికి చెక్‌.. ఏటిగట్టును ఎంత కాపలా కాసినా లాకుల వెంబడి గోదావరి నీరు ఎగబాకి ఊళ్లలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నక్కల, కాజడ్రెయిన్లపై యలమంచిలి, నరసాపురం, మొగల్తూరు శివారు ప్రాంతాల్లో ఉన్న ఔట్‌ఫాల్‌ స్లూయిజ్‌లు సైతం శిథిలావస్థకు చేరడంతో వరదల సమయంలో ఆ నీరు గ్రామాల్లోకి ప్రవేశించి ఇళ్లతోపాటు పంటపొలాలను ముంచెత్తుతుంది. ఆయా స్లూయిజ్‌ల మరమ్మతులపై కూడా ప్రభుత్వం దృష్టిసారించడం తీరగ్రామాలకు ఊరడింపునిస్తుంది. జిల్లాలో 60 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కరకట్టకు గతంలో పెనుగొండ మండలం దొంగరావిపాలెం దగ్గర గట్టు పటిష్టతకు రూ.16.5 కోట్లు, యలమంచిలి మండలం దొడ్డిపట్ల దగ్గర రూ.1.98 కోట్లు, నరసాపురం, యలమంచిలి ప్రాంతాల్లో రూ.17.88 కోట్లు, ఆచంట మండలం కోడేరులంక, పల్లిపాలెంలంక సమీపంలో రూ.38.14కోట్లుతో అధికారులు ప్రతిపాదనలు చేశారు. వీటిలో అత్యవసరంగా చేయాల్సిన పనులకు తొలి ప్రాధాన్యతనివ్వాల్సి ఉంది. వారం రోజుల్లోపు టెండర్లు పూర్తిచేసి పనులు వేగంగా పూర్తిచేయడానికి రంగం సిద్ధం చేశామని అధికారులు చెబుతున్నారు. ‘జూలై 4న టెండర్లు తెరిచి గుత్తేదారులను ఖరారు చేయనున్నాం. ఆ తర్వాత జూలై మొదటి వారంలోను పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం’ అని డ్రెయినేజీ శాఖ ఈఈ కిశోర్‌ తెలిపారు.

జిల్లాలో 357 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న 11 ప్రధానకాలువల్లో అత్యవసర పనులు చేపట్టినా రబీగండం గడుస్తుందనే ఆశలు చిగురిస్తున్నాయి. ఆయా డ్రెయిన్లు, పంటకాలువల్లో తూడు తొలగింపు, పూడికతీత, మరమ్మతుల నిమిత్తం సుమారు రూ.18 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రస్తుతం టెండర్లు పిలిచారు. కొత్త ప్రభుత్వం ఆయా పనులు చేయడానికి అదును దాటినా పదునైన నిర్ణయాలు తీసుకోవడం సర్వత్రా సాగుపై ధీమా పెంచుతోంది.


ఉమ్మడి జిల్లాలో ప్రతిపాదనలిలా

పంటకాలువల మొత్తం పనులు 62
ప్రతిపాదన రూ.7.70 కోట్లు
డ్రెయిన్లు మొత్తం పనులు 52
ప్రతిపాదన రూ. 9.98 కోట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని