logo

పేరుకు పశ్చిమం..విధులన్నీ ఏలూరులో

జిల్లాల పునర్విభజన తర్వాత ఆలస్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో చేరిన మండలం గణపవరం. 2022 నవంబరుకు ముందు ఏలూరు జిల్లాలోని ఏలూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఈ మండలం ఉండేది.

Updated : 27 Jun 2024 06:19 IST

ఉపాధ్యాయులకు తప్పని పాట్లు

పార్వతికి వినతి పత్రం ఇస్తున్న లక్ష్మణరావు, వెంకటేశ్వర్లు
భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: జిల్లాల పునర్విభజన తర్వాత ఆలస్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో చేరిన మండలం గణపవరం. 2022 నవంబరుకు ముందు ఏలూరు జిల్లాలోని ఏలూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఈ మండలం ఉండేది. పరిపాలన కేంద్రానికి సుదూరంలో ఉందని, ఇక్కడి ప్రజలకు భీమవరంతో సత్సంబంధాలుండటంతో పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేయాలని ఆ ప్రాంత ప్రజల విజ్ఞప్తులతో భీమవరం రెవెన్యూ డివిజన్‌లోకి చేర్చుతూ రాజపత్రాన్ని విడుదల చేశారు. ఇది జరిగి 20 నెలలు పూర్తయింది. విద్యాశాఖ మాత్రం ఇంకా ఏలూరు డీఈవో పరిధిలోనే కొనసాగుతోంది. దీంతో వందలాది ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు.

సుదూరం వెళ్లాల్సిందే.. వైకాపా అయిదేళ్ల పాలనలో ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బోధనేతర పనులతో సతమతమయ్యారు. మరుగుదొడ్లను పరిశీలించి ఫొటోలు యాప్‌ల్లో అప్‌లోడ్‌ చేయడం, మధ్యాహ్న భోజనం వివరాలు ఇలా రోజుకు 10కిపైగా యాప్‌ల్లో వివరాల అప్‌లోడ్‌తో ఇబ్బందులుపడ్డారు. ఆ నివేదికలను డీఈవో కార్యాలయంలో అందించాలి. లేకపోతే సంబంధిత ఉపాధ్యాయులపై కఠిన చర్యలుండేవి. దీంతో గణపవరం నుంచి వ్యయప్రయాసలతో ఏలూరు వెళ్లారు. కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం హయాంలో అలాంటి ఇబ్బందులు తొలగాలని కోరుతున్నారు. 
ఎవరికి చెప్పాలో తెలియదు.. గణపవరం మండలంలో 48 ప్రాథమిక, 7 ఉన్నత, 15 ప్రైవేటు పాఠశాలలున్నాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులు 263 మంది ఉన్నారు. ఎన్నికల విధులకు నియమించిన ఉపాధ్యాయులు అవస్థలు పడ్డారు. వివరాలు ఎవరికి చెప్పాలో తెలియలేదు. తాడేపల్లిగూడెం ఆర్‌.వో.కార్యాలయానికి వెళ్తే ఉంగుటూరు వెళ్లమనేవారని, అక్కడికి వెళ్తే పూర్తి వివరాలు ఏలూరులో ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడంతో ఎండలో తిరిగామని పలువురు వాపోయారు. ఆరోగ్యం సహకరించకపోయినా విధులకు తప్పక హాజరయ్యామంటున్నారు. నాడు-నేడు పనుల పురోగతి, మధ్యాహ్న భోజన పథకం వివరాలు, ఉపాధ్యాయ సమావేశాలకు ఏలూరు వెళ్లాలి. పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనకూ అక్కడికే వెళ్లాలి.

విజ్ఞప్తులు చేస్తున్నాం.. గణపవరాన్ని పశ్చిమగోదావరి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ పరిధిలోకి చేర్చాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ  లక్ష్మణరావు ఆధ్వర్యంలోని బృందం పాఠశాల విద్య అదనపు సంచాలకులు పి.పార్వతికి గతంలో వినతి పత్రం ఇచ్చారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి జిల్లా యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో తీసుకెళ్లాం. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పశ్చిమ విద్యాశాఖలో విలీనం చేయాలి’ అని మండల యూటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి భవానీ ప్రసాద్‌ తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని