logo

గుల్ల చేసి వెళ్లిన వైకాపా సర్కారు : రఘురామ

డెల్టాలో కీలకమైన పంట కాలువలు, డ్రెయిన్ల నిర్వహణను గత వైకాపా సర్కారు గాలికి వదిలేసిందని ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు విమర్శించారు.

Updated : 27 Jun 2024 04:22 IST

రైతులు పూడికతీత పనులు చేపట్టడం ప్రశంసనీయం

అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే
ఉండి, న్యూస్‌టుడే: డెల్టాలో కీలకమైన పంట కాలువలు, డ్రెయిన్ల నిర్వహణను గత వైకాపా సర్కారు గాలికి వదిలేసిందని ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు విమర్శించారు. ఉండిలోని వాండ్రం మార్గంలో బొండాడ డ్రెయిన్‌లో తూడు, గుర్రపుడెక్క తొలగింపు, ఉండి పంటకాలువ, రుద్రాయకోడుల్లో మట్టిపూడిక తీత పనులను బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ‘కాలువ పనులకు రైతుల సహకారం తీసుకోవడం సరికాదని ఒకరిద్దరు అంటున్నారు. గత పాలకులు పంట కాలువల్లో పార మట్టి కూడా తీయలేదు. పైసా ఇవ్వలేదు. మొత్తం గుల్ల చేసి వెళ్లిపోయారు. ప్రస్తుతం నిధుల్లేవు. అలాగని వ్యవసాయాన్ని పోగొట్టుకుంటామా..? మా పని మేం చేసుకోవడం న్యాయం కాదని కొన్ని సంస్థలు అంటున్నాయి. అది సరి కాదు. నా ఇల్లు నేను ఊడ్చుకుంటే.. నువ్వు ఊడ్వకూడదు. ప్రభుత్వమే చేయాలన్నట్లు కొందరు నాయకులు వ్యాఖ్యానిస్తుండటం బాధాకరం. ప్రజలు వారంతట వారు సామాజిక స్పృహతో చేసుకుంటున్న కార్యక్రమిది. నా ఆలోచనకు అన్నదాతల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. వారే కొన్నిచోట్ల మట్టిపూడికతీత పనులు చేపట్టడం ప్రశంసనీయం. నాయకుడిగా వారందరినీ ఏకతాటిపైకి తెచ్చి ప్రోత్సహిస్తున్నా. రెండు నెలల తర్వాత ఒక సభ పెట్టుకుని ఈ క్రతువులో భాగస్వాములైన వారందరినీ సన్మానిస్తాం.’ అని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తెలిపారు. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి జుత్తిగ నాగరాజు, తెదేపా మండల అధ్యక్ష, కార్యదర్శులు కరిమెరక నాగరాజు, కిన్నెర వెంకన్న, నాయకులు కట్టా రాంబాబు, పేరిచర్ల బాలరాజు, యడవల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని