logo

చెరువులకు మంచి రోజులెప్పుడు?

ఏలూరు జిల్లాలో మూడొంతుల భాగం మెట్ట మండలాలే. సన్న, చిన్నకారు రైతులు ఎక్కువ. సాగునీటికి చెరువులే ఆధారం. విలువైన ఆ జలవనరులను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.

Published : 27 Jun 2024 04:05 IST

నిర్వహణను గాలికొదిలేసిన వైకాపా ప్రభుత్వం

ఆక్రమణలతో తగ్గిన విస్తీర్ణం
తరుగుతున్న సాగు..

అడుగంటుతున్న భూగర్భ జలాలు 

కబ్జా చెరలో కొయ్యలగూడెం అంకాల చెరువు
జల వనరుల శాఖ అప్‌ల్యాండ్‌ కొయ్యలగూడెం సబ్‌డివిజన్‌ పరిధిలోని బందకట్టు  జలాశయం కాలువలన్నీ దాదాపు పాడయ్యాయి. సైఫన్లు శిథిలయ్యాయి. దిగువన చెరువులకు చేరాల్సిన వరద మధ్యలోనే వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొయ్యలగూడెం మండలంలో అంకాల, వడిసెలవాని, రాజు చెరువులు ఆక్రమణల బారిన పడటంతో వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు  ప్రశ్నార్థకంగా మారింది.
 

కొయ్యలగూడెం గ్రామీణ,  పోలవరం, టి.నరసాపురం,  ఉంగుటూరు, న్యూస్‌టుడే:  ఏలూరు జిల్లాలో మూడొంతుల భాగం మెట్ట మండలాలే. సన్న, చిన్నకారు రైతులు ఎక్కువ. సాగునీటికి చెరువులే ఆధారం. విలువైన ఆ జలవనరులను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఆయకట్టు అభివృద్ధికి, నీటి పారుదల నిర్మాణాల కనీస మరమ్మతులకు పైసా విదల్చ లేదు. ఫలితంగా పట్టించుకునే వారు లేక ఎక్కడికక్కడ చెరువులు ఆక్రమణల బారిన పడ్డాయి. విస్తీర్ణం తగ్గి సాగునీరు అందక ఆయకట్టు రైతులు విలవిల్లాడుతున్నారు. 

మక్కినవారిగూడెం జిమ్మి చెరువుకు పడిన గండి 

తూములు దెబ్బతిన్నాయని.. చెరువు తూములు దెబ్బతిన్నాయని గత ప్రభుత్వ హయాంలో మొరపెట్టుకోగా.. ఎవరూ పట్టించుకోలేదు. మూడు మరమ్మతులకు ఇటీవల మండల పరిషత్తు నిధులు రూ.4 లక్షలు మంజూరయ్యాయి. దీంతో అధికారులు టెండర్లు పిలిచారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. వచ్చేనెల ఒకటిన టెండరు తెరుస్తామని అధికారులు చెప్పడంపై రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలే పేడ్రాల కాలువ ఉద్ధృతి తీవ్రంగా ఉంటుందని, పాపికొండల్లో ఏ మాత్రం వర్షం పడినా చెరువు నిండిపోతుందని, వేసవి కాలంలో చేపట్టాల్సిన తూముల పనులు ఇప్పుడు చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

హైకోర్టు ఆదేశించినా..

ఉంగుటూరు మండలం అక్కుపల్లిగోకవరంలో 58.38 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉంది. దీని ద్వారా 60.70 హెక్టార్ల ఆయకట్టుకి సాగునీరు అందుతుంది. చెరువు విస్తీర్ణంలో సుమారు 19 ఎకరాలు ఆక్రమణకు గురైంది. నల్లమాడు రెవెన్యూ పరిధి గొల్లగూడెంలో 35.92 ఎకరాల విస్తీర్ణంలో ధర్మ చెరువు ఉôది. సుమారు 32 హెక్టార్లకు సాగునీరు అందుతుంది. ఇందులో 8.10 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. గతంలో  ప్రభుత్వ, అసైన్డు, శ్మశాన, చెరువుల్లో ఆక్రమణలు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. యర్రమిల్లిపాడు, బాదంపూడిలోని రెండు చెరువుల్లో ఆక్రమణలు తొలగించి మమ అనిపించారు. 

ఆక్రమణలు తొలగించడం లేదు

‘చెరువు మొత్తం ఆక్రమణకు గురైంది. ఈతగండి తూము సమీపం వరకు పంటల సాగు చేస్తున్నారు. అదేమంటే మాకు పట్టాలున్నాయని ఆక్రమణదారులు చెబుతున్నారు. ఈ విషయమై అనేక సార్లు రైతులంతా కలిసి రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు అందజేసినా పట్టించుకోలేదు’ అని కృష్ణారావుపేటకు చెందిన రైతు పాశాల రవి తెలిపారు. 

ప్రపంచ బ్యాంకు నిధులిచ్చినా..

గొలుసు కట్టు చెరువుల అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధులు విడుదల చేసినా పోలవరం పంచాయతీ కొత్తూరు చెరువుకు ఖర్చు చేయలేని పరిస్థితి. సుమారు 200 ఎకరాల  గర్భం ఆక్రమణల ఫలితంగా వంద ఎకరాలకు పరిమితమైంది. దీని కింద మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఏ మాత్రం చినుకు పడినా పేడ్రాల వాగు ద్వారా నీరు చెరువులోకి వచ్చి చేరుతుంది. సంవత్సరం అంతా ఎంతో కొంత నీరు వస్తూనే ఉంటుంది. వర్షాలు కురవకపోయినా పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ నుంచి నీరు సరఫరా చేసేలా తెదేపా ప్రభుత్వ హయాంలో రెగ్యులేటర్‌ నిర్మించారు. నీటి ఎద్దడి తలెత్తినప్పుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చే నీటిని చెరువులోకి మళ్లించి రైతులు సాగు చేసుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని