logo

నకిలీల గుట్టు రట్టు

ఆరుగాలం శ్రమించి పొలంలో చెమటోడ్చే రైతుకు నకిలీ విత్తనాలు కంటనీరు తెప్పిస్తున్నాయి. సరైన విత్తనాలు చేతికందితేనే కర్షకుని శ్రమకు ప్రతిఫలం ఉంటుంది.

Updated : 27 Jun 2024 06:21 IST

విత్తన దుకాణాలపై విస్తృత తనిఖీలు
వేగం పెంచిన విజిలెన్స్‌ అధికారులు

చినమల్లంలో ధాన్యలక్ష్మి సీడ్స్‌ గోదాములో అధికారుల తనిఖీలు(పాత చిత్రం)

న్యూస్‌టుడే, ఏలూరు: ఆరుగాలం శ్రమించి పొలంలో చెమటోడ్చే రైతుకు నకిలీ విత్తనాలు కంటనీరు తెప్పిస్తున్నాయి. సరైన విత్తనాలు చేతికందితేనే కర్షకుని శ్రమకు ప్రతిఫలం ఉంటుంది. నాసిరకం, నకిలీ విత్తనాల బారిన పడితే కష్టాలు, నష్టాలు మినహా ఏమీ మిగలవు. అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిందే. ఖరీఫ్‌ సాగు ప్రారంభమవుతున్న వేళ... రైతులకు సరైన, మేలురకం విత్తనాలు అందించడంపై విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించారు. ఉమ్మడి జిల్లాలో విత్తన దుకాణాలు, గోదాములపై విస్తృతంగా దాడులు చేస్తూ... నకి‘లీలల’ గట్టు విప్పుతున్నారు.

 ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు విత్తన దుకాణదారులు రైతులను బురిడీ కొట్టిస్తున్నారు. నాసిరకం విత్తనాలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని గుర్తించిన విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగి విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ప్రభుత్వ అనుమతుల్లేని విత్తనాలు విక్రయిస్తున్న దుకాణదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. తెల్లహంస, పీఆర్‌ 126 రకం, ఇతర నాసిరకం కంపెనీలకు చెందిన విత్తన విక్రయాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ కొందరు వ్యాపారులు వాటిని విక్రయిస్తూ... కర్షకులను దెబ్బతీస్తున్నారు. కొన్ని మేలురకం విత్తనాల కొరత సృష్టించి... ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాకుండా అధిక మొత్తానికి విక్రయిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన దుకాణ యజమానులపై విజిలెన్స్‌ అధికారులు నిత్యావసరాల చట్టం, సీడ్‌ కంట్రోల్‌ చట్టం 1983 కింద కేసులు నమోదు చేశారు. 

నిబంధనలివీ...

  • వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసిన, అన్ని రకాలుగా రైతులకు లాభం చేకూర్చే విత్తనాలను వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఆమోదం పొందాకే రైతులకు విక్రయించాలి.
  • విత్తిన విత్తనాల్లో 80 శాతం మొలకెత్తేలా ఉండాలి.
  • 12 నుంచి 14 శాతం తేమ ఉండేలా చూసుకోవాలి. అలాగైతేనే  మొలకెత్తుతాయి
  •  రైతుల నుంచి కొనుగోలు చేసిన మేలు రకం విత్తనాలను ఆయా కంపెనీల బాధ్యులు సరిగా ఆరబెట్టాలి.
  •  విత్తనాలు నిల్వ ఉంచే గోదాములో పురుగు మందులు, ఎరువులు ఉంచరాదు.
  •  గోదాములో తేమ, ఊట ఉండకుండా చూడాలి.
  • పెంటపాడు మండలం రాచర్లలోని శ్రీధన సీడ్స్‌ హోల్‌సేల్‌ విత్తన దుకాణ గోదాముపై గత నెల 28న విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తెల్లహంస కంపెనీ విత్తనాలు, పీఆర్‌ 126 రకం విత్తనాలు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. గోదాములో దాచిన రూ.4.75 లక్షల విలువైన 61 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకొని నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
  • పెనుగొండ మండలం చినమల్లంలోని శ్రీధాన్యలక్ష్మి సీడ్స్‌ దుకాణ గోదాములో గత నెల ఒకటిన విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేశారు. అనుమతుల్లేని విత్తన నిల్వలను గుర్తించారు. మొత్తం రూ.51.80 లక్షల విలువైన 2,590 క్వింటాళ్ల వరి విత్తనాలున్నట్లు గుర్తించారు. గోదాము యజమానిపై కేసు నమోదు చేశారు. 

చర్యలు తీసుకుంటాం...

విత్తన కంపెనీలు, దుకాణదారులు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి. లేనిపక్షంలో చర్యలు తప్పవు. అనుమతుల్లేని, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. బ్లాక్‌లో విత్తనాలు అమ్మినా నేరమే. విత్తన దుకాణాలపై గోదాములపై విస్తృతంగా దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నాం.
- కరణం కుమార్, విజిలెన్స్‌ జిల్లా ఎస్పీ


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని