logo

కొండలా పెరుగుతున్న ఫెర్రీ బకాయి

నరసాపురం మాధవాయిపాలెం ఫెర్రీ రేవుకు సంబంధించి నిర్వాహకుడు చెల్లించాల్సిన బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి.

Published : 27 Jun 2024 03:14 IST

రూ.52,57,648  లక్షలకు చేరిన మొత్తం

రేవు నిర్వాహకుడిపై క్రిమినల్‌ చర్యలకు రంగం 

నరసాపురం గ్రామీణ, న్యూస్‌టుడే: నరసాపురం మాధవాయిపాలెం ఫెర్రీ రేవుకు సంబంధించి నిర్వాహకుడు చెల్లించాల్సిన బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం - కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మధ్య గోదావరిపై పంటు నడిపేందుకు 2023-24 సంవత్సరానికి సంబంధించి నరసాపురానికి చెందిన సీహెచ్‌ఎస్‌వీ రెడ్డప్ప ధవేజీ రూ.3.61 కోట్లకు పాట పాడుకున్నారు. ఈ రేవు పాట గడువు ఏప్రిల్‌ 1తో ముగిసింది. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో జడ్పీ అధికారులు ఫెర్రీ రేవు పాట నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేదు. దీంతో తిరిగి రేవు పాట నిర్వహించే వరకు రోజు వారీగా రూ.1,02,904 చెల్లించే పద్ధతిలో రెడ్డప్ప ధవేజీని కొనసాగించేలా సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలో కొన్ని నెలలపాటు రోజు వారీ చెల్లింపులు సక్రమంగానే నడిచినా తర్వాత గాడి తప్పింది. దీంతో ఈ నెల 26 నాటికి మండల పరిషత్‌కు రూ.52,57,648 లక్షల సొమ్ము బకాయి పడ్డారు. 

ముందు నుంచే కొంత.. నరసాపురం మండల పరిషత్‌ అధికారులు ఈ పరిస్థితిని సంయుక్త కార్యాచరణ కమిటీ, జడ్పీ సీఈవో (ఏలూరు) దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంయుక్త కార్యాచరణ కమిటీ కమిటీ ఈ నెల 15న సమావేశమై రేవు నిర్వహణ బకాయి సొమ్ములు మండల పరిషత్తు చెల్లించాలని రెడ్డప్ప ధవేజీకి సూచించింది. ఈ మేరకు అప్పటికే బకాయి ఉన్న సొమ్ము రూ.35 లక్షలు త్వరలో చెల్లిస్తానని, మిగిలిన సొమ్మును త్వరలో చెల్లించడంతోపాటు రోజు వారీ నిర్దేశించిన సొమ్మును ఏ రోజుకు ఆ రోజుకు చెల్లిస్తానని కమిటీకి హామీ ఇచ్చారు. అయితే నిర్వాహకుడు పూర్తిస్థాయిలో చెల్లింపులు చేయకపోవడంతో 26-06-24 నాటికి బకాయి మొత్తం రూ.52,57,648 చేరిందని ఎంపీడీవో రమణారావు పేర్కొన్నారు. బకాయి సొమ్ము చెల్లించాలని ధవేజీకి ఇప్పటికే అనేక సార్లు నోటీసులు జారీ చేశామని తెలిపారు. రేవు నిర్వాహకుడు మార్గదర్శకాలకు బిన్నంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల సూచన మేరకు అతడిపై క్రిమినల్‌ చర్యలు చేపట్టనున్నట్లు ఎంపీడీవో పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు