logo

మమతలు పంచి.. మనసులు గెలిచారు!

విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించే ఉపాధ్యాయులు చాలా మందే ఉంటారు. పిల్లల్ని అర్థం చేసుకొని నడిపించేవారు  అరుదుగా కనిపిస్తారు. అలాంటి గురువులను  శిష్యులు ఎక్కడున్నా తమ గుండెల్లో గుడి కట్టి పూజిస్తారు. 

Updated : 04 Jul 2024 06:32 IST

ఉపాధ్యాయుల బదిలీల్లో భావోద్వేగం 

‘ఉత్తమ వ్యక్తిని తయారు చేయడమే విద్య పరమార్థం. అది గొప్ప ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది’

  - డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 


ఉపాధ్యాయులు దేశానికి వెన్నుముకలాంటివారు. గురువులు వేసే పునాదిపైనే ఆ దేశం ఆశలు, ఆకాంక్షలు నెరవేరుతాయి.

 - మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ అబ్దుల్‌కలాం 


విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించే ఉపాధ్యాయులు చాలా మందే ఉంటారు. పిల్లల్ని అర్థం చేసుకొని నడిపించేవారు  అరుదుగా కనిపిస్తారు. అలాంటి గురువులను  శిష్యులు ఎక్కడున్నా తమ గుండెల్లో గుడి కట్టి పూజిస్తారు. 

ఇటీవల ఉమ్మడి వరంగల్‌ పరిధిలో బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా ఉపాధ్యాయులు మరోచోటికి వెళుతుంటే ‘మేడం మమ్మల్ని వదిలి వెళ్లొద్దు’, ‘సార్‌.. మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లనిచ్చేదిలేదు’ అంటూ కొన్ని పాఠశాలల్లో భావోద్వేగ ఘటనలు కనిపించాయి. పిల్లలు కంటతడి పెడుతూ తమ గురువులపై మమకారాన్ని చాటారు. ఇలా ఉపాధ్యాయులందరూ పిల్లల మనసులు గెలుచుకునేలా బోధన సాగిస్తే అద్భుత ఫలితాలు సాకారం అవుతాయి.  

విద్యా నిపుణులు ఏం చెబుతున్నారంటే.. 

ఉపాధ్యాయుల ప్రభావం విద్యార్థులపై  ఉంటుంది. బోధనతో పాటు విలువలు నేర్పిస్తే ఉన్నత శిఖరాలను అందుకుంటా రని.. జీవితాంతం గుర్తు చేసుకుంటారని  విద్యా నిపుణులు చెబుతున్నారు..  

  • విద్యార్థులతో కటువుగా కాకుండా ప్రేమగా మాట్లాడితే వారు సందేహాలు అడిగి తెలుసుకుంటారు. ఏ విషయాన్నైనా పంచుకుంటారు.
  • నేటి పరిస్థితుల్లో విద్యతోపాటు విలువల గురించి తెలియజెప్పాలి.
  • బోధన వరకే పరిమితం కాకుండా జీవిత నైపుణ్యాలకు అవసరమైన విషయాలపై అవగాహన కల్పించాలి. 
  • క్రమశిక్షణ, సమయపాలన, పుస్తకపఠనం లాంటివి పిల్లలకు అలవాటు చేయాలి. పాటించేలా చూడాలి.
  • గట్టిగా మందలించినా తర్వాత వారితో ప్రేమగా మాట్లాడితే ఉపాధ్యాయులు ఏది చెప్పినా విద్యార్థులు   ఆసక్తిగా నేర్చుకుంటారు.
  • ఆటలు ఆడించడం, జీవన నైపుణ్యాలు నేర్పించడం, ఆత్మవిశ్వాసం పెంపొందించడం, మహనీయుల గురించి చెప్పడం లాంటి వాటితో విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.   
  •  గొప్పగా జీవించడం ఎలాగో తమను చూసి నేర్చుకునేలా ఉపాధ్యాయులు వ్యవహరించాలి. 

పిల్లల గుండెల్లో నిలిచిపోయారు..

ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌గా పనిచేస్తున్న సీహెచ్‌ శ్రీనివాస్‌ పదోన్నతిపై తాడ్వాయి మండలం నార్లాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లారు. మొదటి పోస్టింగ్‌ వెంకటాపూర్‌ ప్రభుత్వ పాఠశాలలోనే. హిందీ అంటే భయపడే విద్యార్థులకు భాషపై మక్కువ పెంచేలా బోధించారు. 11 సంవత్సరాల పాటు ఒకే పాఠశాలలో పనిచేయడంతో ప్రతి విద్యార్థితో చనువు పెరిగింది. బోధనతోపాటు పిల్లలకు అనేక అంశాలను చెబుతూ, ఆప్యాయంగా మాట్లాడుతూ వారికి ఎన్నో విషయాలు నేర్పారు. శ్రీనివాస్‌ బదిలీ విషయం తెలియడంతో విద్యార్థులు ఆప్యాయంగా దగ్గరకు వచ్చి మీరు వెళ్లొద్దు సార్‌ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

- న్యూస్‌టుడే, వెంకటాపూర్‌ 


గేటు వేసేశారు..

 జనగామ జిల్లా శామీర్‌పేట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సుధీర్‌రెడ్డి 13 ఏళ్లుగా తెలుగు, ఆంగ్లం బోధిస్తున్నారు. ఉపాధ్యాయురాలు ఫాతిమా మేరీ గణితం చెబుతారు.  వీరు విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలిగి వారి మనసులు గెలిచారు. వారిద్దరూ బదిలీ కావడంతో పిల్లలు ఒక్కసారిగా భోరుమంటూ విలపించారు. మీరు వెళ్లొద్దంటూ గేటు మూసేసి గురువులపై తమ ప్రేమను చాటుకున్నారు.  

-న్యూస్‌టుడే, జనగామ రూరల్‌


స్నేహితుడిలా ఉన్నాం 

విద్యార్థులతో ఎంతో ప్రేమగా ఉండేవాళ్లం. టీచర్‌లా కాకుండా  స్నేహితుడిలా వ్యవహరించాం. తరచూ వారి తల్లిదండ్రులతో సమావేశమయ్యేవాళ్లం. చదువుతోపాటు వారి బాగోగుల గురించి అడిగేవాళ్లం. ఉపాధ్యాయుడిగా వారి మనసులు గెలుచుకోవడం కన్నా వృత్తిలో సంతృప్తి ఏముంటుంది. 

కటకం సుధీర్‌రెడ్డి,  కొన్నె ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జనగామ జిల్లా

కన్నీటి వీడ్కోలు 

మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం పెద్దకిష్టాపురంలో తొమ్మిదేళ్లుగా ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించారు  బాదావత్‌ శ్రీను. పాతపోచారం పీఎస్‌కు బదిలీ అయిన ఆయనకు విద్యార్థులు కన్నీటితో వీడ్కోలు పలికారు. ఇదే పాఠశాలలో ఉండాలని ప్రాధేయపడ్డారు. శ్రీను ఆంగ్లం బోధించి పిల్లల మనస్సుకు దగ్గరయ్యారు. సహజంగా గ్రామీణ విద్యార్థులకు ఆంగ్లం అంటే భయం ఉంటుంది. సులువైన పద్ధతులతో బోధించి భాషపై మక్కువ పెరిగేలా చేశారు. ఆప్యాయంగా బోధించే ఉపాధ్యాయుడు బదిలీపై వెళుతుంటే విద్యార్థులు తట్టుకోలేకపోయారు.

- న్యూస్‌టుడే, గార్ల (మహబూబాబాద్‌) 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని