logo

కొంచెం ఇష్టంగా.. నిధులు లేక కష్టంగా!

జిల్లా పరిషత్‌ పాలక వర్గాల పదవీ కాలం గురువారంతో ముగుస్తుంది.  ఈ ఐదేళ్లలో పాలకవర్గ సభ్యులు ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు.

Published : 04 Jul 2024 06:15 IST

 నేటితో ముగియనున్న జడ్పీ పాలక వర్గాల పదవీకాలం 

భూపాలపల్లి జిల్లా పరిషత్‌ భవనం 
ఈనాడు డిజిటల్,  జయశంకర్‌ భూపాలపల్లి: వరంగల్‌ కలెక్టరేట్, జనగామ,సుబేదారి, న్యూస్‌టుడే : జిల్లా పరిషత్‌ పాలక వర్గాల పదవీ కాలం గురువారంతో ముగుస్తుంది.  ఈ ఐదేళ్లలో పాలకవర్గ సభ్యులు ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి సాధ్యమైనంత వరకు కృషి చేశారు.. నిధులు లేక ఇబ్బంది పడ్డారు.. 

స్థానిక సంస్థల సమస్య పరిష్కారంలో కీలకం

జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఏ సమస్య ఉందో ఉన్నతాధికారులకు తెలియజేసేందుకు.. వాటి పరిష్కారానికి జిల్లా పాలనలో జిల్లా పరిషత్‌లు కీలకంగా ఉంటాయి. స్టాండింగ్‌ కమిటీల్లో అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకుంటారు. జిల్లా సర్వసభ్య సమావేశాలను నిర్వహిస్తారు. జడ్పీ సమావేశాలకు వివిధ శాఖల అధికారులు, జిల్లాలోని జడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్‌ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరవుతారు. సమావేశంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా సభ్యులుగా ఉన్న జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్కడే సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. వచ్చిన నిధులను ఆయా మండలాలకు కేటాయించి అభివృద్ధిలో జిల్లా పరిషత్‌లు కీలకంగా ఉంటాయి.

 రేపటి నుంచి  ప్రత్యేక అధికారుల..

పాలక వర్గాల పదవీకాలం గురువారంతో ముగుస్తుండంతో 5వ తేదీ నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. జిల్లా పరిషత్‌కు జిల్లా కలెక్టర్‌ ప్రత్యేకాధికారిగా ఉంటారు. జిల్లా అధికారులు మండల ప్రత్యేకాధికారులుగా వ్యవహరించనున్నారు. కలెక్టర్లు అధికారుల కేటాయింపులు సిద్ధం చేశారు. 

ఆ ఐదు మండలాల మార్పు..

 మండలాల విభజన వల్ల కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. హనుమకొండ జిల్లాలోని నడికుడ, ఆత్మకూరు, శాయంపేట, పరకాల, దామెర మండలాలు వరంగల్‌ జిల్లా పరిషత్‌ పరిధిలో ఉండేవి. ఇక నుంచి హనుమకొండ జిల్లా పరిషత్‌ కిందికి వెళతాయి.

ఇలా ఏర్పడ్డాయి.. 

జిల్లాల పునర్విభజన 2016లో జరిగినప్పడు వరంగల్‌ను ఐదు జిల్లాలు చేశారు. 2019లో ములుగు ఏర్పడటంతో ఆరు జిల్లాలు అయ్యాయి. కొత్తగా ఏర్పడిన వరంగల్‌ (వరంగల్‌ రూరల్‌), వరంగల్‌ అర్బన్‌ (హనుమకొండ), జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, ములుగు జిల్లాల్లో ఎక్కడికక్కడే ఆరు జిల్లా పరిషత్‌లు ఏర్పాటయ్యాయి. 2019 జులై 5న జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల జడ్పీ పాలక వర్గాలు కొలువుదీరాయి. ములుగు, మహబూబాబాద్‌ జడ్పీలు ఆగస్టు 5 వరకు కొనసాగనున్నాయి.. ఈ జిల్లాల పరిధిలోని కొన్ని మండలాలు గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉండేవి. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్‌కు ఎన్నికలు రెండు నెలలు ఆలస్యం కావడంతో ఆమేరకు వీటికి గడువు పెరిగింది.

నేడు చివరి సర్వసభ్య సమావేశం..

 జిల్లా పరిషత్‌లలో చివరి సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. పాలక వర్గ సభ్యులకు వీడ్కోలు పలకనున్నారు. 

ఆగిన సీనరేజీ..

సీనరేజీ నిధులను నేరుగా ప్రభుత్వమే తీసుకుని గ్రామాలకు పల్లెప్రగతి కింద కేటాయించారు. దీంతో స్థానిక సంస్థలకు వచ్చే 25:50:25 నిష్పత్తి నిధులు ఆగిపోయాయి. ఇది కొంత ఇబ్బందిగా మారింది.  ఇదివరకు ఉన్న విధంగా సీనరేజీని కేటాయించాలని జడ్పీల్లో తీర్మానాలు చేసినా ఫలితం లేకపోయింది..

విషాదం..

ములుగు జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కుసుమ జగదీష్, జనగామ జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డిలు అకాల మరణంతో ఆయా జిల్లాల్లో విషాదం నెలకొంది. తర్వాత వారి స్థానంలో నూతన ఛైర్‌పర్సన్లను ఎన్నుకున్నారు.        

నాడు కళకళ.. నేడు వెలవెల

ఒకప్పుడు జిల్లా పరిషత్‌ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున జనాలు కనిపించేవారు. పనుల కోసం, అభివృద్ధి నిధుల కేటాయింపుల కోసం, బిల్లులు, తదితర అవసరాల నిమిత్తం వచ్చిన వారితో కళకళలాడేవి. మండలాల్లో కూడా జడ్పీటీసీ సభ్యులు హుందాగా తిరిగేవారు, ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ముందకు వచ్చేవారు. ఈసారి జిల్లా పరిషత్‌లు నిధుల్లేక వెలవెలబోయాయి. 2021 వరకే సాధారణ గ్రాంటు(సీనరేజీ) వచ్చింది. తర్వాత ఎస్‌ఎఫ్‌సీ, ఎస్‌ఎంజీ, ప్రత్యేక గ్రాంట్లతోనే స్థానిక సంస్థలకు సర్దుబాటు చేశారు. రహదారులు, మురుగు కాల్వల నిర్మాణం, పాఠశాలల అభివృద్ధి, తదితర పనులు చేశారు. 


 ప్రజాసేవ అవకాశం దక్కడం అదృష్టం 
- జక్కు శ్రీహర్షిణి, జడ్పీ ఛైర్‌పర్సన్, జయశంకర్‌ భూపాలపల్లి

కొత్తగా ఏర్పడిన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు మొదటి జడ్పీ ఛైర్‌పర్సన్‌గా పదవిని అలంకరించడం, ప్రజాసేవ చేసేందుకు అవకాశం దక్కడం అదృష్టంగా భావించాను. నా పదవీకాలంలో కాటారం రెవెన్యూ డివిజన్, మినీ స్టేడియం మంజూరు కావడం గర్వంగా ఉంటుంది. వివిధ గ్రాంట్లు, సీనరేజీ నిధులను మండలాలకు కేటాయించి అభివృద్ధి పనులు జరిగేలా కృషి చేశాం. 


 ఐదేళ్ల పాలన సంతృప్తికరం 
- డాక్టర్‌ ఎం. సుధీర్‌కుమార్, జడ్పీ ఛైర్మన్, హనుమకొండ(వరంగల్‌ అర్బన్‌)

జడ్పీ ఛైర్మన్‌గా ఐదేళ్ల పదవీకాలం సంతృప్తికంగా సాగింది. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో జిల్లా అభివృద్ధి కృషి చేశాం. వచ్చిన నిధులను అవసరమైన ప్రాంతాల్లో కేటాయించి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేశాం. 


స్వల్ప కాలమైనా అభివృద్ధిలో భాగస్వామిని అయ్యాను 
- గిరబోయిన భాగ్యలక్ష్మి, జడ్పీఛైర్‌పర్సన్, జనగామ

జడ్పీ ఛైర్‌పర్సన్‌గా కొంతకాలమే పదవిని అలంకరించినా.. జిల్లా అభివృద్ధిలో భాగస్వామిని అయ్యాను. వచ్చిన నిధులను అత్యవసర పనులకు కేటాయించాం. జడ్పీటీసీ సభ్యులు, జడ్పీలకు, స్థానిక సంస్థలకు నిధులు అప్పగించే విషయంతో ప్రభుత్వం ఆలోచన చేయాలి. 


ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా చేశాం

-గండ్ర జ్యోతి, జడ్పీ ఛైర్‌పర్సన్, వరంగల్‌

చారిత్రిక జిల్లా వరంగల్‌కు జడ్పీ ఛైర్‌పర్సన్‌ కావడం, ఇక్కడి ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిన్న జిల్లాల ఏర్పాటుతోనే ఈ అవకాశం దక్కింది. నాపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు ఎల్ల వేళలా అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేశాను. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని