logo

ఆశయం బాగుంది.. నిర్వహణే పడకేసింది!

పర్యావరణ హితం, నాణ్యమైన పట్టణ వాసం, వ్యర్థాల నుంచి అర్థాన్ని సృష్టించడం లక్ష్యాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి.

Published : 04 Jul 2024 06:09 IST

వడపోతకు వినియోగపడే ఛాంబర్లు వృథాగా..

న్యూస్‌టుడే, జనగామ: పర్యావరణ హితం, నాణ్యమైన పట్టణ వాసం, వ్యర్థాల నుంచి అర్థాన్ని సృష్టించడం లక్ష్యాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. రాష్ట్రాన్ని ఓడీఎఫ్‌ ప్లస్‌ ప్లస్‌ దిశగా తీసుకువెళ్లేందుకు గత ప్రభుత్వం మానవ వ్యర్థాల శుద్ధీకరణకు ప్రత్యేక పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 71 పురపాలికల్లో ఎఫ్‌ఎస్‌టీపీ (ఫీకల్‌స్టడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌)లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 2018లోనే తొలి కేంద్రం ఏర్పాటయింది. తొమ్మిది పురపాలికల్లోనూ వీటిని నిర్మించడానికి ప్రయత్నాలు జరిగాయి. కొన్ని చోట్ల పూర్తయ్యాయి. మరికొన్ని కార్యరూపం దాల్చలేదు.

పర్యావరణ హితం.. ఆదాయ మార్గం

ఇళ్లలోని సెప్టిక్‌ ట్యాంకుల నుంచి మల వ్యర్థాలను ప్రత్యేక వాహనాల ద్వారా కేంద్రంలోని ప్రత్యేక ట్యాంకులోకి చేర్చాల్సి ఉంటుంది. ఆపైన యంత్ర, మానవ చోదక రహిత విధానంలో గ్రావిటీ ద్వారా వ్యర్థాలు వివిధ దశల్లో శుద్ధి అవుతాయి. ఘన వ్యర్థాలు ఎరువుగా, ద్రవ వ్యర్థాలను శుద్ధి చేసి, కేంద్రంలోని మొక్కలకు, చెట్లకు గార్డెనింగ్‌ అవసరాలకు వాడుకోవచ్చు. 20 వేల లీటర్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన కేంద్రంలో 800 కిలోల ఎరువు తయారవుతుంది. దీనిని పురపాలిక విక్రయించి ఆదాయాన్ని పొందవచ్చు. నిర్మాణ ఏజెన్సీకే పదేళ్లపాటు నిర్వహణ బాధ్యత అప్పగించారు. సుమారు నెలకు రూ.1.50 లక్షలు వారికి పురపాలక శాఖ చెల్లించాల్సి ఉంటుంది. కానీ సేకరించే మానవ వ్యర్థాలు కేంద్రాలకు చేరడం లేదు. తరలింపు వాహనదారులపై పర్యవేక్షణ లేకపోవడంతో వారు వృథా స్థలాల్లో, రద్దీలేని దారుల వెంట, చెరువుల చెంత డంపు చేస్తున్నట్లు సమాచారం. దీంతో కేంద్రాలకు దూరమై లక్ష్యానికి చేరడం లేదు.

కేంద్రంలో గార్డెన్‌  

పక్కా ప్రణాళికతో..

వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం అంటే ముక్కుమూసుకోవాల్సిన అవసరం లేదు. కనులకు ఇంపు గొల్పే రీతిలో, మనసుకు ఆహ్లాదాన్ని పంచే రీతిలో ఈ కేంద్రం పూర్తి పర్యావరణ హితంగా నిర్మించాలన్నది ప్రణాళిక. అందుకే వీటికి ‘పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనం’ అనే పేరు పెట్టారు.

ఇదీ పరిస్థితి.. 

  • జనగామ పురపాలికలో రూ.2.30 కోట్ల అంచనా వ్యయంతో 20కేఎల్‌డీ సామర్థ్యంతో చంపక్‌హిల్స్‌లో మున్సిపల్‌ డంపుయార్డులో ఎకరం స్థలంలో 2021లో నిర్మాణం చేపట్టి, మార్చి 2022లో ప్రారంభించారు. పచ్చదనం, పరిశుభ్రతకు నిలయంగా మార్చారు. కేంద్రం ఉపయోగంలో ఉన్నా, లక్ష్యం నెరవేరడం లేదు. 
  • భూపాలపల్లిలో నిర్మించిన కేంద్రం నిరుపయోగంగా ఉంది.
  • నర్సంపేటలో రూ.కోటి వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించారు. ఎంపిక చేసిన స్థలం కేంద్రం నిర్మాణానికి అనువుగా లేదని భూసార పరీక్ష ద్వారా నిర్ధారించారు. ప్రతిపాదన ఖాయిలా పడింది. పరకాలలోనూ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.
  • మహబూబాబాద్‌లో రూ.కోటి వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదించినా స్థల సేకరణ పూర్తి కాలేదు. 
  • మరిపెడలో రూ.1.79 కోట్లతో నిర్మించాల్సి ఉంది. టెండర్‌ అయ్యింది. పనులు ప్రారంభం కావాల్సి ఉంది. 
  • డోర్నకల్‌లో రూ.80 లక్షల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. సివిల్‌ పనులు మాత్రం పూర్తయ్యాయి. 
  • తొర్రూరు పురపాలిక డంపుయార్డులో కేంద్రం నిర్మాణం పనులు ప్రారంభించి వదిలేశారు. 
  • 2018లో వరంగల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అమ్మవారి పేటవద్ద కేంద్రాన్ని ప్రారంభించారు. ఇది ఉపయోగంలో ఉంది.
  • ఈ విషయమై జనగామ కేంద్రం నిర్మాణ, నిర్వహణ ఏజెన్సీ యజమాని కళాధర్‌రావును వివరణ కోరగా, వ్యర్థాలను సేకరించి తరలించే వాహనదారులపై నియంత్రణ కరవైందని అన్నారు. పురపాలక శాఖ అన్ని స్థాయిల అధికారులకు తమ ఇబ్బందులను వివరించామన్నారు.
  • జనగామ పారిశుద్ధ్య అధికారి మధును వివరణ కోరగా, తరలింపు వాహనాల నియంత్రణకు ప్రయత్నిస్తున్నామన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని