logo

మహిళా శక్తి.. స్వయం ఉపాధికి దీప్తి

గతనెల 29న హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళా శక్తి క్యాంటీన్‌ ప్రారంభించారు. ఇదే స్ఫూర్తితో వరంగల్‌ ప్రాంతంలో కొత్తగా అయిదు క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు వరంగల్‌ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ప్రతిపాదనలు తయారు చేసింది

Published : 04 Jul 2024 05:55 IST

గతనెల 29న హనుమకొండ జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళా శక్తి క్యాంటీన్‌ ప్రారంభించారు. ఇదే స్ఫూర్తితో వరంగల్‌ ప్రాంతంలో కొత్తగా అయిదు క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు వరంగల్‌ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ప్రతిపాదనలు తయారు చేసింది. తద్వారా మహిళలకు ఉపాధి లభించనుంది.

రంగంపేట, న్యూస్‌టుడే:  వరంగల్‌ ఆర్టీసీ బస్టాండ్, ఎంజీఎం ఆసుపత్రి, కాకతీయ వైద్య కళాశాల, గ్రేటర్‌ వరంగల్‌ కాశీబుగ్గ సర్కిల్‌ కార్యాలయం, రంగశాయిపేట నాయుడు పంపు కూడలిలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద కొత్తగా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. వీటి నిర్వహణ స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) అప్పగిస్తారు. ఇందులో మహిళలు సొంతంగా తయారు చేసిన పచ్చళ్లు, సర్వపిండి, పిండి పదార్థాలు, పండ్ల రసాలు, చాయ్‌ తదితరాలు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఎస్‌హెచ్‌జీలు తయారు చేసే వస్తువులతో స్టాల్‌ ఏర్పాటు చేస్తారు.

 విక్రయాలకు వేదికగా..

గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) పర్యవేక్షణలో 15,964 స్వయం సహాయక సంఘాలు, 1.67 లక్షల మహిళలు సభ్యులుగా ఉన్నారు. 13 పట్టణ సమాఖ్యలు, 529 స్లమ్‌ సమాఖ్యలు పనిచేస్తున్నాయి. వీరికి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు బ్యాంకు లీంకేజీ రుణాలు, పట్టణ స్వయం ఉపాధి పథకం, స్త్రీ నిధి పథకం, పీఎం స్వనిధి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందుతున్నాయి. తద్వారా వేలాది మంది మహిళలు ఇళ్లలోనే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. పిండి వంటలు, పచ్చళ్లు, పండ్ల రసాలు తయారు చేయడం, వస్త్ర సంచులు, టైలరింగ్, కిరాణ దుకాణాలు, కంగన్‌ హాల్స్, బ్యూటీషియన్‌ కేంద్రాలు, చిరు వ్యాపారాలు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. అయితే తయారు చేసిన పదార్థాలు, వస్తువుల అమ్మకాల తగిన వేదిక లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రత్యేక పథకం తీసుకొచ్చింది.

ఇలా కాకుండా చూడాలి..?

 గ్రేటర్‌ వరంగల్‌ ప్రధాన కార్యాలయంలో పదేళ్ల క్రితమే క్యాంటీన్‌ ఏర్పాటు చేశారు. కాకతీయ-1 దివ్యాంగుల పట్టణ సమాఖ్యకు నిర్వహణ అప్పగించారు. నెలకు రూ.12 వేల అద్దె ఖరారు చేశారు. అద్దె తగ్గించాలని దివ్యాంగులు అర్జీ పెట్టుకున్నారు. దీనిపై బల్దియా అధికారులు తుది నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో గతేడాది నుంచి క్యాంటీన్‌ మూతబడింది. దీనిని తెరిచి ఎస్‌హెచ్‌జీలకు అప్పగించాలని కోరుతున్నారు. ఇప్పుడు ప్రారంభించే మహిళా శక్తి క్యాంటీన్లకు సైతం ఇలాంటి అవాంతరాలు లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. 


అవకాశం ఇవ్వాలి: - కొలిపాక సంధ్యారాణి

 మాది రంగశాయిపేట. మా పొదుపు సంఘంలో 10 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. లీంకేజీ, స్త్రీనిధి పథకం ద్వారా రుణాలు తీసుకున్నాం. అందరం కలిసి పిండి వంటలు తయారు చేస్తున్నాం. వీటిని విక్రయించేందుకు ఇబ్బందిగా ఉంది. మహిళా శక్తి క్యాంటీన్‌ ఏర్పాటుకు అవకాశం కల్పించాలి.


వ్యాపారం బాగానే ఉంది..: - బండారి శ్రీకళ, శంభునిపేట

 మా పొదుపు సంఘంలో పది మంది సభ్యులున్నారు. బ్యాంకు లీంకేజీ రుణంతో స్వయం ఉపాధి కేంద్రం ఏర్పాటు చేసుకున్నాం. మొదట్లో ఇబ్బందిగా అనిపించింది. ప్రస్తుతం వ్యాపారం బాగానే ఉంది. మేము తయారు చేసిన పిండి పదార్థాలు, పచ్చళ్లు ఇతర వస్తువులు విక్రయించడం ఇబ్బందిగా మారింది. వరంగల్‌ ప్రాంతంలో మహిళా శక్తి క్యాంటీన్‌ అవకాశం ఇవ్వాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని