logo

స్వయం ఉపాధికి మహిళా శక్తి క్యాంటీన్లు

మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే  ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి ప్లాంట్లు, దుస్తుల తయారీ, వివిధ రకాల వ్యాపారాల్లో అవకాశం కల్పిస్తూ.. వారి ఆర్థికాభివృద్ధిని విస్తృతంగా ప్రోత్సహిస్తోంది

Published : 04 Jul 2024 05:51 IST

ములుగు, న్యూస్‌టుడే: మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇప్పటికే  ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి ప్లాంట్లు, దుస్తుల తయారీ, వివిధ రకాల వ్యాపారాల్లో అవకాశం కల్పిస్తూ.. వారి ఆర్థికాభివృద్ధిని విస్తృతంగా ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం జిల్లాల్లో కొత్తగా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుడుతోంది. 

జిల్లా పరిధిలో ఆరు.. 

జనం రద్దీగా ఉండి వ్యాపారం జోరుగా సాగే ప్రదేశాలను ఎంపిక చేస్తున్నారు. జిల్లాలో ఆరు క్యాంటీన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఈ నెల 7న కొన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ములుగులోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయం, జిల్లా ఆసుపత్రి, వెంకటాపూర్‌ మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క-సాలరమ్మ ప్రాంగణం, ఏటూరునాగారం పట్టణంలోని  ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణం, వాజేడు మండలంలోని బొగత జలపాతం వంటి ప్రదేశాల్లో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. 

రూ.20 లక్షల రుణసాయం 

 మహిళా సంఘాల సభ్యులతో ఏర్పాటు చేయనున్న క్యాంటీన్ల కోసం రూ.20 లక్షల రుణసాయాన్ని ప్రభుత్వం అందించనుంది. అవసరం ఉన్న మేరకు రుణం తీసుకుని నిర్వహణకు కావాల్సిన వంట సామగ్రి, ఫర్నీచర్, రిఫ్రిజిరేటర్‌తో పాటు ఇతర వస్తువులు సమకూర్చుకోవచ్చు. ములుగులోని కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికే క్యాంటీన్‌ కొనసాగుతోంది. వారినే ప్రోత్సహించి ఆ భవనాన్ని కొంత విస్తృతపరిచి మహిళా శక్తి క్యాంటీన్‌గా నడిపించేందుకు సిద్ధమయ్యారు. ఇతర ప్రాంతాల్లో గదులు అందుబాటులో లేనట్లయితే కంటెయినర్‌ లాంటివి సమకూర్చుకుని ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ములుగు జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటుకు ఓ భవనం సిద్ధంగా ఉంది. 

భోజనం, బేకరి తరహాలో తినుబండారాలు 

భోజనంతో పాటు బేకరి కేంద్రాల్లో లభ్యమయ్యే వివిధ రకాల తినుబండారాలు అందుబాటులో ఉండనున్నాయి. ఇలాంటి పదార్థాలతో ఎక్కువ మందిని ఆకర్షించే అవకాశం ఉంది. కలెక్టరేట్‌లో పని చేసే అధికారులు, సిబ్బంది, నిత్యం కలెక్టరేట్‌కు వచ్చే సందర్శకులు, సమీపంలోని తహసీల్దారు కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులు ప్రస్తుతం కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో క్యాంటీన్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు. అదే విధంగా జిల్లా ఆసుపత్రిలో ఇంతవరకు క్యాంటీన్‌ వసతి లేదు. రోజుకు సుమారు 500 మంది రోగులు ఆసుపత్రికి వస్తుంటారు. ప్రతి రోజు సుమారు 150 మంది ఇన్‌ పేషంట్లు ఉంటారు. ఇలాంటి ప్రదేశాల్లో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే విజయవంతంగా నడిచే అవకాశం ఉంది. 


భవిష్యత్తులో మరిన్ని ప్రదేశాల్లో విస్తరిస్తాం.. 
- శ్రీనివాస్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ, ములుగు

తొలుత జిల్లాలో రెండు క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే కలెక్టరేట్‌లో అందుబాటులో ఉన్న క్యాంటీన్‌ను మహిళా సంఘం సభ్యులే నిర్వహిస్తున్నారు. దాన్ని మరింత విస్తృతపర్చి మహిళా శక్తి క్యాంటీన్‌గా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం. దాంతో పాటు ములుగు జిల్లా ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని ప్రదేశాల్లో వీటిని విస్తరించనున్నాం. మహిళా సంఘం అవసరాలను బట్టి రుణం పొందొచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని