logo

దర్జాగా భూ కబ్జా..

ప్రభుత్వ భూములు, చెరువులను అక్రమిస్తున్న దళారులపై చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Published : 04 Jul 2024 05:45 IST

ఫిర్యాదులపై చర్యలు శూన్యం

భూపాలపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ భూములు, చెరువులను అక్రమిస్తున్న దళారులపై చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేసి సాగు చేస్తున్న సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలోని జంగేడు శివారు తిప్పిరెడ్డికుంట అభివృద్ధి పనులకు 1994లో నీటిపారుదల శాఖ అధికారులు 62 ఎకరాల భూమి సేకరించి సదరు రైతులకు నష్టపరిహారం చెల్లించారు. అప్పట్లో రూ.70 లక్షలతో చెరువు అభివృద్ధి పనులను చేపట్టారు. ఈ చెరువు కింద 260 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతుంది. ఈ మేరకు చెరువు మత్తడి ప్రాంతంలో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సర్వే నెంబరు 920, 921 లో ఉన్న ఆరు ఎకరాల భూమిపై కొంత మంది దళారుల కన్ను పడింది. ఈ భూమి అక్రమణకు గురవుతుందని జంగేడు గ్రామానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు గతంలో ఫిర్యాదు చేశారు. 6 ఎకరాల భూమిని ఇద్దరు వ్యక్తులు  తప్పుడు సర్వేనంబర్ల పేరుతో ఒకరు 1.20, మరో వ్యక్తి 1.21 ఎకరాలు పట్టా చేసుకొని 2022లో పట్టాదారు పాసు పుస్తకాలను సైతం  తీసుకున్నట్లు తెలిసింది. మూడు ఎకరాలను అక్రమ పట్టా చేసుకుని, మరో మూడు ఎకరాల చెరువు భూమిని సాగు చేస్తున్న విషయం అధికారులకు తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ ఎకరానికి రూ.15 లక్షల ధర పలుకుతోంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ స్పందించి విలువైన చెరువు భూములను రక్షించాలని పలు గ్రామాల ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

ఆక్రమణలు ఇలా..

  • భూపాలపల్లి పురపాలక సంఘం పరిధిలోని మంజూరునగర్‌ జాతీయ రహదారికి అతిసమీపంలో ఉన్న చెరువు భూములను కొందరు వ్యాపారులు అక్రమంగా పట్టాలు చేసుకొని అమాయకులకు నివాస స్థలాలకు విక్రయిస్తున్నారు. ఇదే విషయంపై గతంలో ‘ఈనాడు’లో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో అక్రమణలను గుర్తించి భూములకు హద్దులు ఏర్పాటు చేశారు. ఈ చెరువు కలెక్టర్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంటుంది.
  • మంజూర్‌నగర్‌ ప్రాంతంలోని తుమ్మల చెరువు భూములు సుమారు మూడు ఎకరాల వరకు అన్యాక్రాంతమయ్యాయి. వీటిని కొందరు దళారులు అక్రమంగా పట్టాలు చేసుకున్నట్లు తెలిసింది. రెండు ఎకరాల భూమి విలువ రూ.2 కోట్లకు పై మాటే.
  • గణపురం మండలం చెల్పూరు శివారు, కేటీకే 8వ గని ప్రధాన రోడ్డు సమీపంలో ఉన్న ఎర్రచెరువు భూమి రెండు ఎకరాలకు పైగా ఓ వ్యక్తి అక్రమించి చుట్టూ గోడ నిర్మించారు.  
  • మహబూబ్‌పల్లి సమీపంలోని సోమన్నకుంట భూములు రెండు ఎకరాల వరకు కబ్జాకు గురయ్యాయి. మరో రెండు ఎకరాలు శ్మశానవాటిక కోసం కేటాయించగా ఓ వ్యక్తి అక్రమించుకొని హద్దులు ఏర్పాటు చేసుకున్నారు.  

    విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం 

- ప్రసాద్, నీటిపారుదల శాఖ డీఈ

మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాల్లో అక్రమణకు గురైన చెరువు  భూములపై వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే మూడు చెరువు శిఖం భూములకు హద్దులు ఏర్పాటు చేశాం. అవసరమైతే భూ కబ్జాదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని