logo

మార్కెట్‌ కేంద్రంగా.. రేషన్‌ బియ్యం అక్రమ దందా

ఆహార భద్రత పథకంలో భాగంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని అక్రమార్కులు వివిధ రూపాల్లో బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

Published : 04 Jul 2024 05:39 IST

లారీలో సరకును పరిశీలిస్తున్న రెవెన్యూ, పౌరసరఫరా అధికారులు 

జనగామ, న్యూస్‌టుడే: ఆహార భద్రత పథకంలో భాగంగా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని అక్రమార్కులు వివిధ రూపాల్లో బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జనగామలో అధికారులను ఏమార్చేందుకు రేషన్‌ బియ్యం రూపం మార్చి నూకలుగా చేసి, అధికారుల దృష్టి మార్చేందుకు ఏకంగా జనగామ వ్యవసాయ మార్కెట్‌ను అడ్డాగా మార్చుకున్నారు. మార్కెట్‌ ఆవరణలోకి బయటి నుంచి బియ్యం, నూకల పేరిట రేషన్‌ బియ్యం పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. 

నిబంధనల బేఖాతరు

వ్యవసాయ మార్కెటింగ్‌ నిబంధనల ప్రకారం లోపలికి, బయటికి వచ్చే వాహనాల వివరాలను నమోదు చేయాలి. కానీ బియ్యం అక్రమ రవాణా విషయంలో ఈ నిబంధనలు అమలు కావడం లేదు. వేకువ జామున చిన్న వాహనాల్లో యార్డు కేంద్రంగా ఈ దందా చేస్తున్న పలువురి దుకాణాలకు నూర్పిడి చేసిన బియ్యాన్ని, కొన్ని సందర్భాల్లో రేషన్‌ బియ్యాన్ని చేరవేస్తున్నారు. బియ్యాన్ని తడిపి నూకలుగా మార్చిన బస్తాల మాటున నూర్పిడి చేయని వాటిని సంచుల్లోకి ఎత్తి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. మార్కెట్లో రద్దీ లేని సమయంలో ఏకంగా లారీల్లో తరలిస్తున్నట్లు సమాచారం. మార్కెట్‌ హమాలీలే వాహనాల్లోకి సరుకును ఎత్తుతున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెట్‌ అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావునిస్తోంది. రెవెన్యూ అధికారులు తమకు సమాచారం లేదని ప్రేక్షక పాత్ర వహిస్తున్నారనే విమర్శలున్నాయి. గత సంవత్సరం లారీ బియ్యం, నూకలను పట్టుకున్నారు. ఆ తర్వాత కూడా మార్కెట్‌ అధికారులు ఈ అక్రమానికి అడ్డుకట్ట వేయలేదు. అక్రమ వ్యాపారానికి సహకరించేలా అడ్డా ఇచ్చిన వారిపైన, పట్టించుకోని కొందరు మార్కెట్‌ అధికారులపైన చర్యలు తప్పవని పలువురు భావిస్తున్నారు.

తరలింపును అడ్డుకున్న అధికారులు 

మార్కెట్‌యార్డులో బుధవారం నూకల తరలింపు సమాచారం అందుకున్న పౌరసరఫరా విభాగం డీటీ శ్రీనివాస్, జనగామ ఆర్‌ఐ బృందం యార్డుకు చేరుకున్నారు. లారీలో తరలింపు సరకు గురించి వివరాలు అడగగా, నూకలను కోళ్ల దాణాకోసం బయటకు తరలిస్తున్నామని ఓ దుకాణాదారు వివరించారు. అధికారులు సరకును పరిశీలించగా సుమారు 70 సంచులు మడికొండలోని ఓ మిల్లు నుంచి తెచ్చానని, ఇక్కడి దుకాణం నుంచి ఎత్తే సరుకును తీసుకువెళ్తున్నట్లు లారీ డ్రైవర్‌ వివరణ ఇచ్చారు. లారీకి ఎత్తిన సరుకును దించి, పరిశీలించామని, ఆరు సంచుల రేషన్‌ బియ్యంతో పాటు, నూకల సంచులను స్వాధీనం చేసుకున్నామని డీటీ శ్రీనివాస్‌ తెలిపారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని