logo

నిధుల కొరత.. నిలిచిన ప్రగతి

ఆరు నెలలుగా గ్రేటర్‌ వరంగల్‌లో నిధుల కొరత వెంటాడుతోంది. గతేడాది నవంబరులో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) నుంచి రూ.50 కోట్లు తీసుకున్నారు

Published : 04 Jul 2024 05:37 IST

గ్రేటర్‌లో రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్‌

వరంగల్‌లో పూర్తయిన సీసీ రోడ్డు కొలతలు తీయిస్తున్న కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే 
కార్పొరేషన్, న్యూస్‌టుడే: ఆరు నెలలుగా గ్రేటర్‌ వరంగల్‌లో నిధుల కొరత వెంటాడుతోంది. గతేడాది నవంబరులో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) నుంచి రూ.50 కోట్లు తీసుకున్నారు. నగరంలో పూర్తయిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వడం లేదు. కొత్తగా చేపట్టనున్న పనులన్నీ నిలిచిపోయాయి. ఇప్పటికే రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. సాధారణ నిధులు(జనరల్‌ ఫండ్స్‌) రూ.50 కోట్లు, ముఖ్యమంత్రి హామీల పథకం రూ.30 కోట్లు, పట్టణ ప్రగతి రూ.15 కోట్లు, ఇతర పనులకు రూ.5 కోట్ల బిల్లులు అత్యవసరంగా చెల్లించాల్సి ఉంది.

 ఇప్పటికే నగరంలో పూర్తయిన అభివృద్ధి పనులను బల్దియా కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెక్కులు రాయడమే తరువాయి.. కానీ! సరిపడా నిధులు లేవు. సగం సగం చెక్కులు రాస్తే విమర్శలొచ్చే అవకాశాలున్నాయి. దీంతో కమిషనర్‌ బిల్లుల చెల్లింపులపై ఆచితూచి అడుగులేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని హనుమకొండ సివిల్‌ కాంట్రాక్టర్స్‌ వేల్పేర్‌ సంఘం నాయకులు సోమవారం ప్రజావాణిలో కమిషనర్‌ను కలిసి విన్నవించారు. పూర్తయిన పనులకు బిల్లులు చెల్లిస్తే తప్ప కొత్త పనులు చేసేది లేదని చెప్పకనే చెబుతున్నారు.

మంచి అవకాశం చేజారింది..

నగరంలో గత నెలలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అత్యవసరంగా కావాల్సిన నిధులు అడిగేందుకు గ్రేటర్‌ వరంగల్‌ సర్వం సిద్ధం చేసింది. సీఎం హామీలు, పట్టణ ప్రగతి, జీఓ నంబరు 65, పట్టణ ప్రగతి ద్వారా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.100 కోట్ల నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించేందుకు కమిషనర్, అధికారులు నివేదికలు, దస్త్రాలు తయారు చేశారు. గతనెల 29న హనుమకొండ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జరిగిన గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఈ విషయాలు చర్చకు రాకుండా.. ఇతర అంశాలపై ఎక్కువ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అత్యవసర నిధులు, భవిష్యత్తు పనులకు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రస్తావించ లేకపోయామని అధికారులంటున్నారు. అనవసర చర్చల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పెండింగ్‌ నిధులు అడిగే మంచి అవకాశం చేజారిందని కొందరు వింగ్‌ అధికారులు అంతర్గతంగా వ్యాఖ్యానించారు.

  •  నగరంలోని 66 డివిజన్లకు జనరల్‌ ఫండ్స్‌ ద్వారా రూ.50 లక్షల చొప్పున నిధులు విడుదల చేయాలని కార్పొరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. గతేడాది 2023-24 బడ్జెట్‌ నిధులు ఇవ్వలేదు. ఈసారైనా కేటాయించాలంటున్నారు.

వినతిపత్రం అందించాం..
- గుండు సుధారాణి, మేయర్‌ గ్రేటర్‌ వరంగల్‌

 గ్రేటర్‌ వరంగల్‌కు అత్యవసరంగా రూ.100 కోట్ల నిధులు కావాలని సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం ఇచ్చాం. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా నిధులు విడుదల చేయించేలా చూస్తాం.

నేటి సమావేశంలో చర్చకు వచ్చేనా?

 సీఎం రేవంత్‌రెడ్డి సూచనతో గురువారం హైదరాబాద్‌లో గ్రేటర్‌ వరంగల్, ‘కుడా’, వరంగల్, హనుమకొండ జిల్లాల సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క, మేయర్‌ గుండు సుధారాణి, వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కేఆర్‌.నాగరాజు, కడియం శ్రీహరి, ఎమ్మెల్సీలు సారయ్య, డాక్టర్‌ బండా ప్రకాశ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్‌ సత్యశారదా, కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే తదితరులు పాల్గొననున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని