logo

ఇక వాట్సప్‌లోనూ పిర్యాదు చేయొచ్చు

ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన మూడు నేర చట్టాల కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఐపీసీ, సీఆర్‌పీసీ, భారత సాక్ష్యాధార చట్టాలు కనుమరుగై వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియమ్‌ (బీఎస్‌ఏ) వచ్చాయి.

Published : 03 Jul 2024 05:33 IST

కొత్త నేర చట్టాల ద్వారా విచారణ వేగవంతం
వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ఝా
ఈనాడు, వరంగల్, వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే

ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన మూడు నేర చట్టాల కింద పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఐపీసీ, సీఆర్‌పీసీ, భారత సాక్ష్యాధార చట్టాలు కనుమరుగై వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య అధినియమ్‌ (బీఎస్‌ఏ) వచ్చాయి. వీటిపై కేసులు ఎలా నమోదు కానున్నాయి. వాట్సప్‌లో సైతం ఫిర్యాదు ఎలా చేయాలి? సందేహాలుంటే బాధితులు ఎవరిని సంప్రదించాలి? తదితర అంశాలపై వరంగల్‌ సీపీ  అంబర్‌కిశోర్‌ఝా తో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది.

కొత్త చట్టాలపై సిబ్బంది పూర్తి శిక్షణ పొందారా?
ఈ చట్టాలతో కేసులు నమోదు చెయ్యడంలో సిబ్బంది నూటికి నూరు శాతం శిక్షణ పొందారు. మొత్తంగా ఎనిమిది బృందాలకు తెలంగాణ పోలీసు అకాడమీలో శిక్షణ అందించారు. ఈ బృందాల్లోని వారిని ‘ట్రైనింగ్‌ ఆఫ్‌ ట్రైనర్‌’ (టీవోటీ) గా వ్యవహరిస్తాం. వీరు కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్‌లలో రోజుకు 30 మంది పోలీసులకు శిక్షణ ఇచ్చారు. అలా మనకున్న 1800 సివిల్‌ సిబ్బందితో పాటు, ఎస్బీ, సీసీఆర్‌బీ, స్పెషల్‌ పార్టీలకు ఈ చట్టంపై శిక్షణ ఇచ్చాం. ఇప్పటికీ టెలీకాన్ఫరెన్స్‌లు జరుగుతున్నాయి. మరేమైనా సందేహాలుంటే నివృత్తి చేస్తున్నాం.

నూతన చట్టంతో మహిళలకు, బాలలకు ఎలాంటి రక్షణ ఉంటుంది?
గతంలో కంటే నూతన చట్టంలో మహిళలు, బాలలపై జరిగే నేరాలకు కఠిన శిక్షలు అమలు చేస్తారు. దీని వలన నిందితులకు వేగంగా శిక్షలు పడే అవకాశం ఉంది. అయితే పిల్లల భద్రత కోసం తీసుకొచ్చిన పోక్సో లాంటి చట్టాలు అలాగే ఉంటాయి.

బాధితులకు ఏమైనా సందేహాలుంటే ఎలా నివృత్తి చేసుకోవాలి?
నూతన చట్టంతో ప్రజలకు పూర్తిగా రక్షణ ఉంటుంది. పోలీసులు కేసు నమోదు చేస్తే దానిని ప్రజలు పరిశీలించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎఫ్‌ఐఆర్‌ వివరాలు  బాధితులు, నిందితులు పొందొచ్చు. ఏమైనా అనుమానాలు వస్తే ఠాణా స్థాయిలో స్పష్టత రాకపోతే ఏసీపీ, డీసీపీ, లేదా నా వద్దకు వచ్చినా సందేహాలను నివృత్తి చేసి పంపుతాం.  ఈ చట్టాలపై మేం కూడా నిరంతరం అవగాహన పెంచుకుంటూనే ఉంటాం.

ఇక నుంచి సాంకేతిక ఆధారాలు కీలకంగా మారుతాయంటున్నారు. మరి బాధితులు వాట్సప్‌లో ఎలా ఫిర్యాదు చేయొచ్చు?
బాధితులు అత్యవసరంగా సంబంధిత ఠాణా నెంబర్‌కు వాట్సప్‌ ద్వారా ఫిర్యాదుచేయొచ్చు. మా వాళ్లు కేసు నమోదు చేస్తారు. కాకపోతే ఫిర్యాదుదారులు మూడు రోజుల తర్వాత ప్రత్యక్షంగా కూడా వెళితే బాగుంటుంది. కేవలం వాట్సప్‌ ఫిర్యాదులపైనే ఆధారపడితే ఎవరు ఎవరిమీదైనా ఇష్టానుసారంగా ఫిర్యాదు చేసే ప్రమాదం ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు వచ్చిన తర్వాత ఠాణాలోని రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. అధికారి విచారించిన తర్వాత  కోర్టు అనుమతి తీసుకొని కేసు నమోదు చేస్తారు. ఠాణాల్లో ఇక నుంచి నెంబర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.

కొత్త చట్టాల వల్ల బాధితులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది?
ఈ రోజు ఒక హత్య కేసు నమోదైంది. పాత చట్టంలో అయితే అది ఐపీసీ 302 ఉండేది. ఇప్పుడు బీఎన్‌ఎస్‌ 103 క్లాజ్‌ వన్‌ కింద కేసు పెట్టాం. ఇదే కేసు తీసుకొంటే గతంలో ప్రత్యక్ష సాక్షులే కీలకంగా ఉండేది. ఇప్పుడు సాంకేతిక ఆధారాలు ప్రత్యక్ష సాక్షులకు సమానంగా న్యాయస్థానం పరిగణిస్తుంది. అంటే వీడియో ఆధారాల లాంటివి అన్నమాట. ఆధునిక యుగంలో సాంకేతిక ఆధారాలే కీలకం. దీని వల్ల తీర్పులు వేగంగా వచ్చే అవకాశం ఉంది. ఈ చట్టాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. ఇప్పటికే 37 ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌)లను రూపొందించారు. వీటిపై మా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో సమావేశం కూడా నిర్వహించారు. ఇక సైబర్‌ నేరాల విషయంలో ఐపీసీ కింద నమోదు చేసే వాటిలో మార్పు ఉంటుంది. ఐటీ చట్టం లాంటి వాటిని కూడా సైబర్‌లో ఉపయోగించేవాళ్లం. అవి అలాగే కొనసాగుతాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని