logo

ఆదిమానవుల ఆనవాళ్లివి.. సమాది చేయొద్దు!

అవి ఆది మానవుల సమాధులు.. చూస్తే రాళ్లు పేర్చారేమో అనిపిస్తుంది... తరచి చూస్తే ఆశ్చర్యం.. ఎన్నో సందేహాలు కలుగుతాయి.  ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దామెరవాయిలో ఉన్న వీటిని చూడడానికి పర్యాటకు లు ఆసక్తి చూపుతున్నారు.. వీటి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు..

Published : 03 Jul 2024 05:32 IST

న్యూస్‌టుడే, తాడ్వాయి(ములుగు జిల్లా)

అవి ఆది మానవుల సమాధులు.. చూస్తే రాళ్లు పేర్చారేమో అనిపిస్తుంది... తరచి చూస్తే ఆశ్చర్యం.. ఎన్నో సందేహాలు కలుగుతాయి.  ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని దామెరవాయిలో ఉన్న వీటిని చూడడానికి పర్యాటకు లు ఆసక్తి చూపుతున్నారు.. వీటి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు..

ఎందుకు ప్రత్యేకం అంటే..

ఆదిమానవుల సమాధులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. ఆయా దేశాల్లో వేర్వేరు పేర్లు ఉన్నప్పటికీ వీటిని ప్రధానంగా డోల్మన్లుగా పిలుస్తారు. మన దేశంలోనూ పలు రాష్ట్రాల్లో కనిపిస్తాయి.. ఎక్కడైనా పదుల సంఖ్యలో ఉంటాయి. ఇక్కడ మాత్రం ఒకే ప్రదేశంలో 200కు పైగా కనిపిస్తాయి. ఇవి క్రీ.పూ.2 వేల సంవత్సరాల కిందటిగా గుర్తించారు.

ఒకే సమాధిలో ఉన్న మూడు శవపేటికలు

తరలివస్తున్న పర్యాటకులు... పట్టించుకోని అధికారులు

ఐదేళ్లుగా దామెరవాయి సమాధులను వీక్షించేందుకు పర్యాటకులు సెలవు రోజుల్లో తరలివస్తున్నారు. వారికి పర్యాటకశాఖ సౌకర్యాలు కల్పించడం లేదు. రూ.48 లక్షలతో విశ్రాంతి భవనం నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా వదిలేశారు. దామెరవాయికి చెందిన బింకారి కార్తీక్‌ అనే యువకుడు ఎలాంటి లాభాపేక్ష లేకుండా పర్యాటకులకు గైడ్‌లా సేవలందిస్తున్నారు.

ధ్వంసమైన చోట..

రక్షణ చర్యలు శూన్యం..

సమాధుల రక్షణకు ప్రభుత్వం దృష్టి సారించాలి. ఎండ, వానకు కొన్ని పగిలిపోతుండగా, కొన్ని చెదలు పట్టి పుట్టలుగా మారుతున్నాయి. కొందరు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. మరికొందరు ఇళ్ల నిర్మాణాలకు సమాధుల బండరాళ్లను పగులగొడుతున్నారు.

వాటికి నెంబర్లు వేసి నడక బాట ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు.

శవపేటిక లేకుండా ఉన్న సమాధిని చూపిస్తున్న కార్తీక్‌

ఇలా చేరుకోవచ్చు..

ఆదిమానవుల సమాధుల వద్దకు వెళ్లేందుకు సులువైన రవాణా మార్గాలున్నాయి. హనుమకొండ నుంచి సరిగ్గా 107 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హనుమకొండ బస్టాండ్‌ నుంచి ఏటూరునాగారం, మంగపేట, భద్రాచలం, గుంటూరు వెళ్లేందుకు ప్రతి 10 నిమిషాలకో ఆర్టీసీ బస్సు సర్వీసు ఉంటుంది. ఈ బస్సులో వచ్చి తాడ్వాయిలో దిగి అక్కడి నుంచి 13 కి.మీ. దూరంలోని కాటాపురం గ్రామానికి వెళ్లాలి. కాటాపురం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని దామెరవాయికి వెళ్లేందుకు ఆటోలు సిద్ధంగా ఉంటాయి. సమాధుల సమీపం వరకు ఆటోలు, కార్లు వెళ్లేందుకు పర్యాటకశాఖ మట్టి రోడ్డు నిర్మించింది.

శవపేటికలో లభించిన ఎముకలు

కొత్త విషయాలు  కనుకొన్న స్థానికులు..

ఈ సమాధులను ప్రజలు రాకాసి గుహలుగా పిలుస్తారు. పూర్వ కాలంలో రాక్షసులు నివాసం ఉండేవారని చెప్పుకొంటారు. 4 అడుగుల ఎత్తు, 4 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ గుహల గోడలు, కప్పులపైన 10 నుంచి 20 టన్నుల బరువున్న పెద్ద బండరాళ్లను పేర్చారు. వీటిని ఎక్కడి నుంచి తెచ్చారనే సందేహాలను ఇటీవల స్థానిక యువకులు నివృత్తి చేశారు. స్థానిక యువకుడు బింకారి కార్తీక్, మరికొందరు ఈ నిర్మాణాలకు 100 నుంచి 500 మీటర్ల దూరంలో ఓ గుట్ట నుంచి బండరాళ్లను వేరు చేసిన ఆనవాళ్లను గుర్తించారు. వాటిని వేరు చేసేందుకు ఇనుము, లేదా రాతి పనిముట్లకు పదును పెట్టుకొనే రాళ్లను సైతం కనుగొన్నారు.

ఇనుప పనిముట్లకు పదును పెట్టేందుకు ఉపయోగించిన బండ

సమాధులను నిర్మించేందుకు గుట్టపైన బండలు పగులగొట్టినట్లు కనిపిస్తున్న గుర్తులు

త్వరలో సౌకర్యాలు కల్పిస్తాం

- శివాజీ, జిల్లా పర్యాటక అధికారి

సమాధుల సందర్శనకు పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. విశ్రాంతి భవన నిర్మాణం చివరి దశలో ఉంది. విద్యుత్తు, తాగునీటి వసతి కల్పించి విశ్రాంతి భవనాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తాం.  గైడ్‌ను నియమించాల్సిన అవసరాన్ని ఉన్నతాధికారుల దృషికి తీసుకెళ్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని