logo

దర్జాగా మట్టి దందా..

చెరువుల్లో మట్టి తవ్వకాలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో నిబంధనలకు విరుద్ధంగా నల్లమట్టి, మొరం దందా జోరుగా సాగిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు.

Published : 03 Jul 2024 05:26 IST

ఇటుక బట్టీలకు, స్థిరాస్తి వ్యాపారాలకు తరలింపు
చోద్యం చూస్తున్న అధికారులు
ఐనవోలు (హనుమకొండ), న్యూస్‌టుడే

ఐనవోలు మండలం వెంకటాపూర్‌లోని ఊర చెరువులో రాత్రి వేళలో మట్టి తరలింపు

చెరువుల్లో మట్టి తవ్వకాలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో నిబంధనలకు విరుద్ధంగా నల్లమట్టి, మొరం దందా జోరుగా సాగిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు.

నల్లమట్టిని ఒక్కో టిప్పర్‌నకు రూ.16 వేలు, మొరం రూ.7 వేలకు విక్రయిస్తున్నారు. అధిక లోడుతో టిప్పర్లలో మట్టి తరలిస్తుండటంతో రహదారులు ధ్వంసమవుతున్నాయి.

ఇదీ పరిస్థితి..

ఐనవోలు మండలంలోని వెంకటాపూర్‌లో 2 వేల మెట్రిక్‌ టన్నుల మట్టి తరలింపునకు మైనింగ్‌ శాఖ అధికారులు అనుమతి ఇచ్చారు. గుత్తేదారు పగలు రాత్రి తేడా లేకుండా జేసీబీతో మట్టిని తోడేస్తున్నారు. ప్రతి రోజు 20 గంటలు జేసీబీ యంత్రాన్ని నడిపించి 2 వేల మెట్రిక్‌ టన్నులను రెండు రోజుల్లోనే పూర్తి చేశారు. వే బిల్లులు లేకుండా టిప్పర్లలో మట్టిని తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌లో 20 మెట్రిక్‌ టన్నులు తరలించవచ్చు. రోజుకు 15 టిప్పర్ల ద్వారా 200 ట్రిప్పులను తరలిస్తున్నారు. గత 15 రోజులుగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 50 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా  తరలించి సొమ్ము చేసుకున్నారు. ఆత్మకూరులోని ఊర చెరువులో, కొత్తగట్టు చెరువు, ఊరుగొండ చెరువుల్లోనూ ఇదే పరిస్థితి..

ముల్కలగూడెం ఊరచెరువులో మట్టి తోడటంతో 15 అడుగులపైగా లోతుగా ఏర్పడిన గోతులు

నిబంధనలు ఇక్కడ పనిచేయవు..

ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో ఎక్కడ తవ్వకాలు జరిపినా గ్రానైట్, కంకర క్వారీల మాదిరిగానే గనులశాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. హెక్టారుకు రూ.50 వేలు గనులశాఖకు డిపాజిట్‌ చేయాలి. రిజిస్ట్రేషన్‌ కోసం రూ.50 వేలు తపాలశాఖకు చెల్లించి అనుమతి తీసుకోవాలి.  క్యూబిక్‌ మీటరు మొరానికి రూ.40 చొప్పున చెల్లించాలి. రెండు శాతం ఆదాయపన్ను, ఒక శాతం కార్మికశాఖకు పన్ను చెల్లించాలి.

ఇళ్ల నిర్మాణాల అనుమతి కోసం మొరం, ఇటుక బట్టీలకు నల్లమట్టి కోసం స్థానిక తహసీల్దారు నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో లేదా నెల రోజులకు పైగా తవ్వకాలు జరపాలంటే జిల్లా పాలనాధికారి నుంచి అనుమతి పొందాలి. భూగర్భశాఖ, కాలుష్య నియంత్రణ, డీఎఫ్‌వో, ఆర్డీవో, తహసీల్దార్లు సంబంధిత స్థలానికి వెళ్లి పరిశీలించిన అనంతరం పాలనాధికారికి నివేదిక అందజేస్తారు. అనంతరం మీసేవ కేంద్రాల ద్వారా గనులు భూగర్భశాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రైవేటు భూముల్లో అయితే సంబంధిత పట్టాదారు ఆమోదం పొందాలి.

ఇవేమి లేకుండా కొంతమంది అధికారుల చేతి వాటంతో అరకొర అనుమతులతో వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

తిమ్మాపూర్‌ మీదుగా ఇటుక బట్టీలకు టిప్పర్లలో తరలిస్తున్న నల్లమట్టి 

కరిగిపోతున్న కొండపర్తి గుట్టలు

కొండపర్తి, తరాలపల్లి, వనమాలకనపర్తి శివారులోని గుట్టల్లో 10 క్వారీలు లీజు ద్వారా అనుమతులు తీసుకొని 15 ఏళ్లుగా మొరం తరలిస్తున్నారు. ఏ ఒక్కరోజు కూడా అధికారులు అటువైపునకు వెళ్లి కొలతల ప్రకారం తవ్వకాలు జరుగుతున్నాయా లేదా పరిశీలించలేదు. నిత్యం పదుల సంఖ్యలో టిప్పర్లలో మొరం వరంగల్, హనుమకొండ నగరానికి తరలిస్తున్నారు. ఈ టిప్పర్లు వేబిల్లు లేకుండానే నడుస్తుంటాయి..

ఎక్కడెక్కడ ఎక్కువ అంటే..

  • ఐనవోలు మండలంలోని వెంకటాపూర్, కొండపర్తి, ముల్కలగూడెం, పంథిని, పున్నేలు  
  • ఆత్మకూరు మండలంలోని ఊరుగొండ, కొత్తగట్టు, హసన్‌పర్తిలోని జయగిరి, ముచ్చెర్ల, మడిపెల్లి  
  • దామెర, పరకాల, నడికూడ మండలాల్లోని చెరువులు

ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తాం..

సాంబశివరావు ఏడీ గనులశాఖ

చెరువు, కుంటలు, పట్టాభూముల్లో అనుమతులు లేకుండా మట్టి తీస్తే ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల పరిధిలోకి వస్తుంది. రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారుల ఎన్‌వోసీతోనే రాయల్టీ కట్ట¨ంచుకొని చెరువుల్లో మట్టి తీసేందుకు అనుమతులు ఇస్తున్నాం. అనుమతులు పొందిన గుత్తేదారు అధిక మొత్తంలో మట్టి తరలిస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని