logo

వసతిగృహం.. సమస్యలతో సతమతం

విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా.. జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవేశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సమస్యలు తిష్ఠ వేయడంతో విద్యార్థులు వసతిగృహాల్లో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు.

Published : 03 Jul 2024 05:19 IST

వరంగల్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే

విద్యా సంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా.. జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవేశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సమస్యలు తిష్ఠ వేయడంతో విద్యార్థులు వసతిగృహాల్లో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. ప్రవేశాలు లేకపోవడంతో నల్లబెల్లిలోని ఎస్సీ వసతిగృహాన్ని మూసేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు మరమ్మతులకు నోచుకోకపోవడంతో.. భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి.  మంగళవారం ‘న్యూస్‌టుడే బృందం’ నిర్వహించిన పరిశీలనలో చాలాచోట్ల సమస్యలే దర్శనమిచ్చాయి.

ఏటా వేసవి సెలవుల్లో వసతిగృహ భవనాల స్థితిగతులు, తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, వంటగదులు, తలుపులు తదితరాలను పరిశీలించి మరమ్మతులు చేయించాల్సి ఉన్నా.. ఈ ఏడాది సంబంధితశాఖ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టిసారించడం లేదని స్పష్టమవుతోంది. జిల్లాలోని ఎస్సీ వసతిగృహాల మరమ్మతులకు ఈ ఏడాది ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ నిధి కేటాయించలేదని, జిల్లాలో నర్సంపేట, పర్వతగిరిలో మాత్రమే ప్రభుత్వ భవనాల్లో వసతిగృహాలు నడుస్తున్నాయని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల సమస్య లేదని ఆమె పేర్కొన్నారు.


శిథిల భవనంలో భయంగా..

  • వరంగల్‌ నగర నడిబొడ్డున రంగంపేటలో ఎస్టీ బాలుర వసతిగృహం ఉంది. సుమారు 38-40 ఏళ్ల క్రితం నాటి భవనం పూర్తిగా పాడైంది. వానొస్తే వణుకే, విద్యార్థులు బిక్కు బిక్కుమనాల్సిందే.
  • 30 మంది విద్యార్థులువిద్యార్థుల వసతిగృహం భవనం శిథిలావస్థకు చేరింది.
  • తాత్కాలికంగా డెకోలంతో కిటికీలు, జాలీలు ఏర్పాటు చేశారు.
  • విద్యుత్తు సరఫరా పైపులు పాడయ్యాయి. అదనంగా ఫ్యాన్లు కావాలి.
  • మరుగుదొడ్లు, స్నానాల గదులు అధ్వానంగా ఉన్నాయి. కొన్నింటికి డోర్లు సరిగాలేవు.

రంగంపేట, న్యూస్‌టుడే


వంట సామగ్రి రావడం లేదు..

  • వర్ధన్నపేట పట్టణ శివారులోని ఎస్టీ బాలుర వసతిగృహం
  • 60 మంది విద్యార్థులు ఉన్నారు.
  • ప్రభుత్వం నుంచి ఒక్క బియ్యం మాత్రమే వస్తున్నాయి. ఇతర వంట వస్తువులు, గుడ్లను సిబ్బంది ప్రైవేటు కిరాణ దుకాణం నుంచి ఉద్దెరకు తీసుకువచ్చి విద్యార్థులకు భోజనం సిద్ధం చేస్తున్నారు. 
  • గదులకు కిటికీలకు తలుపులు ఏర్పాటు చేశారు. కానీ దోమలు రాకుండా జాలీలు ఏర్పాటు చేయలేదు.
  • వసతి గృహంలోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో మూలనపడ్డాయి. ఫ్యాన్లు పనిచేస్తున్నాయి.
  • విద్యార్థులు చేతులు, భోజనం చేసిన ప్లేట్లు శుభ్రం చేసుకునే ప్రాంతం అపరిశుభ్రంగా ఉంది. మరుగుదొడ్లు సగం మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రహరీ పూర్తిగా లేకపోవడంతో కర్రలు, ఇతర ముళ్లకొమ్మలు అడ్డుగా ఉంచారు.

వర్ధన్నపేట, న్యూస్‌టుడే


కొనసాగుతున్న పనులు..

నర్సంపేటలోని బీసీ బాలుర వసతిగృహంలో మొత్తం 100 మంది విద్యార్థులు ఉండగా 80 మంది హాజరయ్యారు. వసతిగృహానికి రూ.2 లక్షలు మంజూరు కావడంతో ఇంజినీరింగ్‌ అధికారులు మరుగుదొడ్లు, తాగునీటికి సంబంధించిన పనులు చేపట్టారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు గుత్తేదారు..  రంగులు వేయడం, విద్యుత్తు తీగలు, ఐదు కొత్త ఫ్యాన్లు, అన్ని గదుల్లో ట్యూబులైట్లు అమర్చారు. చిన్న మరమ్మతు పనులు చేస్తున్నారు. కిటికీలకు జాలీలు కొట్టించి ఊడిపోయిన తలుపులు పెట్టించాల్సి ఉంది. కొన్ని విద్యుత్తు మరమ్మతులు చేయాల్సి ఉంది.

నర్సంపేట, న్యూస్‌టుడే


మరమ్మతులకు ప్రత్యేక నిధులు..

- పుష్పలత, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి

జిల్లాలో 8 ప్రీమెట్రిక్, 8 పోస్ట్‌మెట్రిక్‌ బీసీ వసతిగృహాలు నడుస్తున్నాయి. ఈ ఏడాది వసతిగృహాల్లో చేయించాల్సిన మరమ్మతులకు కమిషనరేట్‌ నుంచి ఎలాంటి నిధులు రాలేదు. దీంతో జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక నిధుల నుంచి ఒక్కో వసతిగృహానికి రూ.2 లక్షలు కేటాయించారు. ఇప్పటివరకు కొన్ని వసతిగృహాల్లో మరమ్మతులు పూర్తవ్వగా.. మిగిలిన పనులను త్వరలో పూర్తిచేస్తాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని