logo

కొత్త నేర చట్టాలపై అవగాహన కల్పిస్తాం

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని జిల్లా ఎస్పీ శబరీష్‌ అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహించామని తెలిపారు.

Published : 03 Jul 2024 05:01 IST

జిల్లా పోలీసు అధికారి శబరీష్‌

ములుగు టౌన్, ములుగు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన కొత్త నేర చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని జిల్లా ఎస్పీ శబరీష్‌ అన్నారు. గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే పోలీసు అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక తరగతులు నిర్వహించామని తెలిపారు. ఈ నెల 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ)తో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది. వివరాలు ఆయన మాటల్లోనే..

న్యూస్‌టుడే: పాత, కొత్త చట్టాలకు తేడా ఏమిటి?
ఎస్పీ:
పాత చట్టాలనేవి బ్రిటీష్‌ కాలం నాటివి. ఫిర్యాదుదారులకు వెసులుబాటు కల్పించే విధంగా కొత్త చట్టాలను  రూపొందించారు. నేరాలను ఆడియో, వీడియో, మొబైల్‌లో రికార్డు చేయడమనేది గతంలో ఉండేదికాదు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. గతంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు తప్పనిసరిగా పోలీసు స్టేషన్‌కు రావాల్సిందే. ఇప్పుడు రానవసరం లేదు. గతంలో ఎక్కడ సంఘటన జరిగితే అక్కడే ఎఫ్‌ఐఆర్‌ చేసేవారు ..ఇప్పుడు ఎక్కడైనా నమోదు చేయొచ్చు.

కొత్తగా వచ్చిన చట్టాలతో ఉపయోగం?
సమయం ఆదాతో పాటు జాప్యం లేకుండా కేసు ముందుకు సాగే అవకాశం ఉంది. కేసు నమోదు నుంచి మొదలుకొని ఛార్జిషీటు దాఖలు, పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌ నివేదిక వంటి వాటి కోసం సమయం కేటాయించారు. దాంతో పాటు కోర్టు కూడా నిర్దేశించిన సమయంలోనే కేసు విచారణ పూర్తి చేయాలి. ఇలా ప్రతి అంశానికి సమయం ఉంది. వేగంగా తీర్పిచ్చే విధంగా రూపొందించారు. అత్యాచారం కేసులో గతంలో మెడికల్‌ రిపోర్టు రావడంలో జాప్యం జరిగేది. కొత్త చట్టాల ప్రకారం వారం రోజుల్లోనే రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. ఠాణాలో ఫిర్యాదు చేసినప్పుడు కేసు నమోదు కాకపోతే ఉన్నతాధికారి వద్దకు వెళ్తారు. అక్కడ కూడా నమోదవ్వకపోతే కోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేయొచ్చు. కోర్టు నేరుగా కేసు ఎందుకు నమోదే చేయలేదని వివరణ అడుగుతుంది. దీంతో తప్పుడు కేసులు నమోదు కాకుండా ఉండే అవకాశాలున్నాయి. కొత్త చట్టాలతో పూర్తి విచారణ తర్వాత కేసు నమోదు చేసేందుకు అవకాశం కలిగింది.

ఎస్సీ, ఎస్టీ చట్టానికి సంబంధించి మార్పులు, చేర్పులున్నాయా?
ఎస్టీ, ఎస్టీ చట్టానికి సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు పొందుపర్చలేదు. కేసు నమోదు, విచారణ తదితర అంశాలు యథావిధిగానే ఉంది. దానికి సంబంధించి పూర్తి సమాచారం లేదు.

విచారణ అధికారికి వెసులుబాటు కలిగిందా?
ఏదైనా కేసులో దర్యాప్తు చేసిన అధికారి కోర్టుకు సాక్ష్యం ఇచ్చేందుకు హాజరు కావాల్సి ఉంటుంది. పని ఒత్తిడిలో కొన్ని వాయిదాల వరకు కోర్టుకు వెళ్లలేని పరిస్థితి ఉండేది. కొత్త చట్టం ప్రకారం వర్చువల్‌ పద్ధతిలో వీడియో ద్వారా సాక్ష్యం ఇచ్చే అవకాశం కలిగింది. 

సమన్ల జారీకి ఏం రూపొందించారు?
గతంలో కోర్టు నుంచి జారీ చేసిన సమన్లను కక్షిదారుల ఇంటికెళ్లి ఇచ్చేవారు. ఇప్పుడు సంక్షిప్త సందేశం ద్వారా అందించే అవకాశాలున్నాయి. గతంలో సాక్షి తప్పనిసరిగా ఎక్కడున్నా స్టేషన్‌కు లేదంటే సంఘటన జరిగిన ప్రదేశానికి రావాల్సి ఉండేది. ఇప్పుడు సాక్ష్యాల సేకరణలో భాగంగా సాక్షి అందుబాటులో లేకపోతే వీడియో కాల్‌ ద్వారా సాక్ష్యాన్ని నమోదు చేయొచ్చు.

నేరస్థులపై ఎలా ప్రభావం చూపుతుంది?
నేరస్థులపై ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. పూర్తి విచారణ తర్వాత ఒకసారి కేసు నమోదైతే శిక్ష పడేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. కేసు నమోదులో పూర్తి వివరాలు సేకరిస్తారు. చట్టం దుర్వినియోగం కాదు. ఇది ఉపయోగకరమైంది. నేరస్థులు తప్పించుకోలేరు.

ఎలా అవగాహన కల్పిస్తారు?
పోలీసుస్టేషన్‌ ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేస్తాం. ఫిర్యాదు పద్ధతిపై సవివరంగా వివరిస్తాం. గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తాం. ఆడియో, వీడియో ఎలక్ట్రానిక్‌ పరికరాలు, వాయిస్‌ రికార్డింగ్‌ సాక్ష్యాలు మొదలగు అంశాలపై అవగాహన కల్పిస్తాం.

ప్రజలకు మీరిచ్చే సూచనలు?
కొత్త చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. ఎవరూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దు. శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలి. ప్రశాంత జీవనానికి ప్రజలందరూ సహకరించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని