logo

నాడు సక్రమం.. నేడు అక్రమం!

హనుమకొండ నగరంలో బాలసముద్రంలోని భారాస జిల్లా కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వ స్థలంలో భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని వరంగల్‌ మహానగర పాలక సంస్థ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.

Published : 03 Jul 2024 04:57 IST

బల్దియా, రెవెన్యూ అధికారుల తీరుపై విమర్శలు
ఈనాడు, వరంగల్, కార్పొరేషన్, న్యూస్‌టుడే

బాలసముద్రంలోని భారాస హనుమకొండ జిల్లా కార్యాలయం

రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అధికారులు నిబంధనలు అమలు పరచాలి. భారాస ప్రభుత్వం హయాంలో అప్పటి జనగామ కలెక్టర్‌ శ్రీదేవసేన నిక్కచ్చిగా వ్యవహరించారు. అప్పటి అధికార పార్టీ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బతుకమ్మ కుంట స్థలాన్ని ఆక్రమించగా ఆమె పెద్ద పోరాటమే చేశారు. ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించేది లేదని ఓ కలెక్టర్‌గా తన విధులు సక్రమంగా నిర్వర్తించారు. కొందరు అధికారులు మాత్రం ప్రజాప్రతినిధులు ఎలా చెబితే అలా  తలూపుతూ నిబంధనలు తుంగలో తొక్కడం గమనార్హం. హనుమకొండ నగర నడిబొడ్డున రూ.కోట్ల విలువైన ఎకరం భూమిని నాడు అధికారులు కేటాయించారు. నిర్మాణ అనుమతి పొందకుండా భవన నిర్మాణం చేస్తుంటే మహానగరపాలక సంస్థ ప్రేక్షకపాత్ర వహించింది. ఇప్పుడేమో నిర్మాణం అక్రమమని.. ఇందుకు సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. 

హనుమకొండ నగరంలో బాలసముద్రంలోని భారాస జిల్లా కార్యాలయం నిర్మాణానికి ప్రభుత్వ స్థలంలో భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని వరంగల్‌ మహానగర పాలక సంస్థ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. సర్వే నెంబరు 1066లోని ఎకరం భూమిని 2018లో రెవెన్యూ శాఖ దీనికి కేటాయించింది. గజానికి రూ.100 ధర ఖరారు చేశారు. బహిరంగ మార్కెట్‌లో రూ.కోట్లు విలువ చేసే భూమిని దారాధత్తం చేశారు. రెవెన్యూ అధికారులు అప్పటి పాలకులు చెప్పినట్టు తలలూపి నిబంధనలు అతిక్రమించి భూ కేటాయింపు చేశారు.. మరోవైపు గ్రేటర్‌ వరంగల్‌ అధికారులూ దీని నిర్మాణాన్ని అడ్డుకోలేదు. ఇప్పుడేమో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని నోటీసులు ఇచ్చారు..

పశ్చిమ ఎమ్మెల్యే ఫిర్యాదుతో..

వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఫిర్యాదుతో 2018లో కేటాయించిన ఎకరం భూమి కేటాయింపును రద్దు చేయాలని గతనెల 1న అప్పటి హనుమకొండ జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌.. హనుమకొండ ఆర్డీవోకు ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ ఆర్డీవో లేఖ ఆధారంగా గ్రేటర్‌ వరంగల్‌ కాజీపేట సర్కిల్‌ కార్యాలయం ఉపకమిషనర్‌ గతనెల 25వ తేదీతో భారాస కార్యాలయానికి నోటీసు జారీ చేశారు. స్థలానికి సంబంధించిన దస్తావేజులు, భవన నిర్మాణ అనుమతి ప్రొసీడింగ్‌ కాపీ, ప్లాన్‌ సమర్పించాలని, లేని పక్షంలో 2019 తెలంగాణ కొత్త పురపాలక చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని