logo

నూతన నేర చట్టాలతో సత్వర న్యాయం

దేశంలో అమల్లోకి వచ్చిన నూతన నేర చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం అందుతుందని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) కిరణ్‌ ఖరే అన్నారు. ఈ నెల  1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టాలపై మంగళవారం ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది.

Updated : 03 Jul 2024 05:05 IST

జిల్లా పోలీస్‌ అధికారి కిరణ్‌ ఖరే
ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి

దేశంలో అమల్లోకి వచ్చిన నూతన నేర చట్టాలతో బాధితులకు సత్వర న్యాయం అందుతుందని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) కిరణ్‌ ఖరే అన్నారు. ఈ నెల  1 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టాలపై మంగళవారం ఆయనతో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది.

ప్రశ్న: నూతన నేర చట్టాలపై సిబ్బందికి అవగాహన కల్పించారా?
ఎస్పీ:
నూతన నేర చట్టాలపై ముందుగా నలుగురు ఎస్సైలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇప్పించాం. ఆ తర్వాత వారితో వివిధ స్థాయిల 506 మంది పోలీస్‌ సిబ్బందిని 14 బృందాలుగా విభజించి శిక్షణ ఇచ్చాం. వారికి కొత్త చట్టాలకు సంబంధించిన పుస్తకాలు కూడా అందజేశాం.

మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించిన శిక్షలు ఎలా ఉండనున్నాయి?
మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై కఠిన శిక్షలున్నాయి. ప్రత్యేక అధ్యయనాన్ని చేర్చారు. 66, 64, 65, 80, 85, 86, తదితర సెక్షన్లను పొందుపర్చారు. చిన్నారులపై సామూహిక లైంగిక దాడి కేసుల్లో  జీవిత ఖైదు, మరణ శిక్ష లాంటి కొత్త నిబంధనలు చేర్చారు.

బాధితులకు ఎలాంటి ప్రయోజనాలున్నాయి?
బాధితులు ఠాణా పరిధిలోకి రాకుండానే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో వాట్సప్, మెయిల్, వెబ్‌సైట్‌ ద్వారా పంపొచ్చు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసిన మూడు రోజుల్లోగా ఠాణాకు వచ్చి ఫిర్యాదుపై సంతకం చేయాల్సి ఉంటుంది. అలాగే ఘటన జరిగిన వద్ద కాకుండా బాధితులు ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయవచ్చు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి సంబంధిత ఠాణాకు ఫిర్యాదును బదిలీ చేస్తారు. విచారణ పురోగతి సమాచారం కూడా బాధితులకు అందిస్తారు. విచారణ వేగవంతంగా పూర్తవుతుంది.

ప్రజలకు చట్టాలపై ఎలాంటి సందేశం ఇస్తారు?
ప్రజల కోసమే చట్టాలు పనిచేస్తాయి. తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడేలా రూపొందించారు. స్వాతంత్య్రానికి పూర్వం తయారు చేసిన చట్టాలను నవీకరించారు. వీటిపై అవగాహన కలిగి ఉండాలి. ఏవైనా సందేహాలుంటే పోలీస్‌ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. 

ఈ నెల 1కి ముందు జరిగిన నేరాలు, ఘటనలకు సంబంధించిన కేసులను ఏ చట్టాల పరిధిలో విచారణ జరుపుతారు?
జూన్‌ 30 వరకు నమోదైన కేసులను పాత చట్టాల ప్రకారమే విచారణ జరుపుతాం. జులై 1 నుంచి నమోదైనవి మాత్రం కొత్త చట్టం ప్రకారం విచారణ, శిక్షలు ఉంటాయి.

కొత్త చట్టాలపై ప్రజలకు ఎలా అవగాహన కల్పించనున్నారు?
ఇప్పటికే పోలీసు సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. శిక్షకులు, పోలీస్‌ సిబ్బందితో కొత్త చట్టాలపై గ్రామాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాం. ప్రజలకు  సందేహాలుంటే పోలీస్‌ వెబ్‌సైట్‌లో సమాచారం అందుబాటులో ఉంటుంది. అలాగే ఠాణాల్లోనూ తెలుసుకోవచ్చు.

కొత్త చట్టాల ద్వారా పోలీసులకు అనుకూలించే అంశాలేవి? కొత్త, పాత చట్టాలకు కొన్ని వ్యత్యాసాలను తెలుపుతారా?
కొత్త చట్టం ద్వారా పోలీస్‌ అధికారాలు బలోపేతం అయ్యేవి ఉన్నాయి. 7 సంవత్సరాల లోపు శిక్షపడే నేరాలకు రిమాండ్‌ అధికారం పోలీసులకు ఉండేది కాదు. ఇప్పుడు కొత్త చట్టాల్లో ఆ నేరాలకు పోలీసులు రిమాండ్‌ తీసుకునే అవకాశం ఉంది. నేర విచారణలో నిందితుడిని పోలిస్‌ రిమాండ్‌ను 15 రోజుల నుంచి 60 రోజులకు పెంచారు. దీనివల్ల కేసుల్లో పురోగతి వేగంగా ఉంటుంది. నేర ఘటన వివరాలను పంచనామా రూపంలో రాత పూర్వకంగా ఉండేది. దాని ఆధారంగానే విచారణ సాగేది. ఇప్పుడు ఘటనా స్థలిని వీడియోలో నిక్షిప్తం చేయాలి. సాక్ష్యంగా ఇవి ఉపయోగపడతాయి. తనిఖీల సమయంలోనూ వీడియోలు తీసుకునే అవకాశం ఉంటుంది. నిందితులకు సమన్లను  ఆన్‌లైన్‌లో పంపే అవకాశం ఉంది. జైలు, ఆసుపత్రి, ఇతర ప్రాంతాల నుంచి  వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివరాలను వెల్లడించవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని