logo

పురకు పట్టని కార్మికుల సంక్షేమం

పౌర, కార్యాలయ సేవలను ప్రజలకు అందించే నిబంధనల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే పురపాలిక అధికారులు గత కొద్ది రోజులుగా ప్రభుత్వ నిబంధనలను విస్మరిస్తున్నారు. తద్వారా చట్ట ఉల్లంఘన ఒక అంశం కాగా, నిర్లక్ష్యం కారణంగా పుర పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రమాదం ఏర్పడింది.

Published : 03 Jul 2024 04:52 IST

మున్సిపల్‌ పారిశుద్ధ్య విభాగానికి సంబంధించిన వాహనాలకు నెంబరు ప్లేట్లు లేక..

జనగామ, న్యూస్‌టుడే: పౌర, కార్యాలయ సేవలను ప్రజలకు అందించే నిబంధనల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే పురపాలిక అధికారులు గత కొద్ది రోజులుగా ప్రభుత్వ నిబంధనలను విస్మరిస్తున్నారు. తద్వారా చట్ట ఉల్లంఘన ఒక అంశం కాగా, నిర్లక్ష్యం కారణంగా పుర పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు ప్రమాదం ఏర్పడింది. మున్సిపల్‌ పారిశుద్ధ్య విభాగం వాహనాల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ, వాటికి రిజిస్ట్రేషన్, బీమా చేయించడంపై ఉండటం లేదు. వాహనాల వినియోగంలో పురపాలికలో నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతున్నా రవాణ శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. గతంలో జరిగిన తప్పిదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో కార్మికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది.

ఏటా రూ.4 కోట్ల వ్యయం

పట్టణ ప్రజా ఆరోగ్యం కోసం సేవలందించే పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని జనగామ పురపాలిక పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇంటింటి నుంచి చెత్తసేకరణ, యార్డుకు తరలింపునకు ఒక్కోటి రూ.లక్షల విలువైన వాహనాలను ఖరీదు చేశారు. 8 ట్రాక్టర్లు, 10 ఆటోలు, ఒక డంపర్‌ప్లేసర్, జేసీబీ, వైకుంఠరథం ఉన్నాయి. ఊడ్చే యంత్రంతో కూడిన మరో వాహనం కొనుగోలుకు ప్రతిపాదించారు. ఏటా వీటి నిర్వహణ, కార్మికుల వేతనాలు ఇతరత్రా అవసరాల పేరిట సుమారు రూ.4.5 కోట్లు ఖర్చవుతోంది. వాహనాల మరమ్మతు పేరిట జరిగే తంతుపై ఆరోపణలున్నాయి. వాహన ఖరీదు సమయంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ గుర్తింపు కార్డుతో బయటకు వచ్చినా, నెల రోజులపాటు వాడుకోవచ్చు. ఆ తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్‌కు నోచక గుర్తింపు, బీమా లేని వాహనాలు ప్రమాదానికి గురైతే, ప్రమాదంలో ఎలాంటి పరిహారం అందడం లేదని కార్మికులు వాపోతున్నారు.

వైకుంఠరథానిదీ అదే పరిస్థితి..

ఇలా ఉల్లంఘన

గతంలో ఖరీదు చేసిన ఆరు ట్రాక్టర్లలో ఒకటి మూలకు చేరింది. మరో రెండింటిని ట్యాంకర్లకు వాడుతున్నారు. ఏడాది క్రితం ఖరీదు చేసిన ట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్, బీమా జరగలేదు. పాత ట్రాక్టర్లలో నాల్గింటికి బీమా లేదు. కాలం చెల్లిన బీఎస్‌-4 రకం ఆటోలను ఖరీదు చేసినప్పుడు వెంటనే రిజిస్ట్రేషన్‌ చేయించలేదు. దీంతో ఇప్పుడు వాటికి గుర్తింపు ఇవ్వడం కుదరదని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ వైఫల్యాలకు గత అధికారులే కారణమని ప్రస్తుత అధికారులు అంటున్నారు. వాహన బీమా, నిర్వహణ నిమిత్తం గత బడ్జెట్లో రూ.8 లక్షలు కేటాయించి చేతులు దులిపారు. ప్రగతి నిధులు రూ.32 లక్షలతో సుమారు రెండేళ్ల క్రితం జేసీబీ కొన్నారు. ఇప్పటికీ దానికి గుర్తింపు నెంబరు లేదు. రూ.16 లక్షలతో ఖరీదు చేసిన వైకుంఠరధానిదీ అదే దుస్థితి నెలకొంది.  

వాహనాల రిజిస్ట్రేషన్, బీమా ప్రక్రియను పూర్తి చేసే ప్రక్రియ పుర పరిశీలనలో ఉంది.. ఈ విషయమై కార్మికులు ఇటీవలే కమిషనర్‌కు, కౌన్సిల్‌కు వినతి చేశారు.. సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పారిశుద్ధ్య విభాగం ఇన్‌ఛార్జి మధు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని