logo

తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ

పట్టణంలోని సిద్దిపేట రోడ్డు వైపు బ్రిడ్జి కింద ఉన్న బీరప్పగడ్డ ప్రాంతంలోని ఓ నివాసంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో అగంతకులు చొరబడి బంగారు, వెండి నగలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు.

Published : 03 Jul 2024 04:51 IST

బాధితురాలు ప్రేమలతతో మాట్లాడుతున్న డీసీపీ రాజమహేంద్రనాయక్‌

జనగామ టౌన్, న్యూస్‌టుడే: పట్టణంలోని సిద్దిపేట రోడ్డు వైపు బ్రిడ్జి కింద ఉన్న బీరప్పగడ్డ ప్రాంతంలోని ఓ నివాసంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంట్లో అగంతకులు చొరబడి బంగారు, వెండి నగలతో పాటు నగదు ఎత్తుకెళ్లారు. పట్టణ ఎస్సై మోదుగుల భరత్‌ కథనం ప్రకారం.. బీరప్పగడ్డకు చెందిన గుంటి ప్రేమలత అనే మహిళ తన ఇంట్లో మనవరాలితో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్‌లో చూపించుకోడానికి వెళ్లారు. బీరప్పగడ్డలోని ఒకే పోర్షన్‌లో దాయాదుల ఆరు ఇళ్లులు ఉన్నాయి. సోమవారం రాత్రి 1 గంట సమయంలో ప్రేమలత ఇంట్లో దీపం వెలుగులు రావడంతో అనుమానం వచ్చి బంధువులు చూడగా, ఆమె ఇంటి తాళం పగులకొట్టి ఉండటం చూసి చోరీ అయినట్లు నిర్ధారించుకొని అదే రోజు రాత్రి ప్రేమలతకు విషయం తెలిపారు. ఆమె తెల్లవారుజామున ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ఉన్న బీరువా తాళం పగులగొట్టి అందులో ఉన్న 11 తులాల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండి నగలతో పాటు రూ.15వేల నగదును అపహరించుకుపోయారని ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై తెలిపారు. ఘటనా స్థలాన్ని వెస్ట్‌జోన్‌ డీసీపీ రాజమహేంద్రనాయక్, పట్టణ సీఐ రఘుపతిరెడ్డి పరిశీలించారు. వరంగల్‌ నుంచి వచ్చిన క్లూస్‌టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని