logo

స్ఫూర్తి చాటుదాం.. కొలువు కొట్టేద్దాం!

నిరాశ, నిస్పృహలు దరిచేరకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లడం.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం.. అవకాశాలను అందిపుచ్చుకోవడం.. ఒత్తిడిని అధిగమించడం.. ప్రణాళిక అమలుపర్చడం..

Published : 01 Jul 2024 03:18 IST

నిరాశ, నిస్పృహలు దరిచేరకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లడం.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం.. అవకాశాలను అందిపుచ్చుకోవడం.. ఒత్తిడిని అధిగమించడం.. ప్రణాళిక అమలుపర్చడం.. ఇవన్నీ విజయ సూత్రాలైతే.. వీటిని చక్కగా అమలు చేసింది భారత క్రికెట్‌ జట్టు.. టీ-20 ప్రపంచకప్‌ను చేజిక్కించుకున్న తీరు అమోఘం.. ఆటను గమనిస్తే ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చే ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు..

జులై, ఆగస్టులో జరగనున్న డీఎస్సీ, గ్రూపు-2, 3 పరీక్షలను ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వేల మంది ఎదుర్కోబోతున్నారు.. వారందరూ ఒత్తిడిని అధిగమించి విజయతీరాలకు చేరాలంటే.. భారత జట్టును స్ఫూర్తిగా తీసుకోవాలి.. పట్టుదల, ఏకాగ్రతతో పాటు ఆత్మవిశ్వాసం కూడగట్టుకొని.. ప్రణాళికతో ముందుకు సాగితే.. కొలువు మీ సొంతమవుతుంది. 

గెలుపు బాట వేద్దామిలా..

సమయ స్ఫూర్తి : టీ-20 ప్రపంచ కప్‌ గెలవడంలో సూర్యకుమార్‌ యాదవ్‌ పట్టిన అద్భుతమైన క్యాచ్‌ ఆటకు మలుపు.. బంతి బౌండరీ దాటేలోపే సమయస్ఫూర్తితో ఒడిసిపట్టిన తీరు విజయానికి కీలకమైంది.. పరీక్షరాసే అభ్యర్థులు కూడా ఏదశలోనూ ఒత్తిడికి గురి కాకుండా సరైన సమాధానాలు రాయాలి. లేదంటే, చేతికందాల్సిన ఉద్యోగం దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. 

ఓటమి పాఠాలతో గెలుపు 

2023 నవంబరులో జరిగిన వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో పరాభవం చెందింది. ఆ సమయంలో ఎన్నో అవమానాలకు.. ఒత్తిడికి గురైంది. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఎన్నో పాఠాలు నేర్చుకుంది. అప్పటి లోపాలను గుర్తించి వాటికి చెక్‌పెట్టి పట్టుదలతో టీ-20 ప్రపంచకప్‌లో అడుగుపెట్టింది. పొరపాట్లకు తావివ్వకుండా గ్రూప్‌ దశ నుంచి రాణించి జగజ్జేతగా నిలిచింది. నిరుద్యోగ అభ్యర్థులు కూడా గతంలో విఫలమయ్యామని, ఫలానా సబ్జెక్టు కఠినంగా ఉందని నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో సిద్ధమవ్వాలి.

వేల సంఖ్యలో పోటీ..

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు 1,519 ఉన్నాయి.. దాదాపు 35 వేలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వీరిలో గతంలో రెండు, మూడు సార్లు పరీక్ష రాసిన వారున్నారు. సమయం దగ్గర పడుతుండటంతో ఉద్యోగార్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఉద్యోగం రాదనే అభద్రతా భావంతో ఉండకండి. మరికొద్ది రోజుల్లో గ్రూప్‌-2, 3 పోస్టుల భర్తీకి సంబంధించి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్‌-2లో 783, గ్రూప్‌-3లో 1388 పోస్టులు ఉన్నాయి. జోనల్‌ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 50 వేల మంది ఉద్యోగార్థులు పరీక్షలు రాయనున్నారు. 

కఠిన దశ దాటాలి : దక్షిణాఫ్రికా ఆటగాడు క్లాసెన్‌ స్పిన్నర్లను సునాయాసంగా ఎదుర్కొంటూ భారీ పరుగులు రాబట్టడంతో టీం ఇండియా వ్యూహాన్ని మార్చి పేసర్లను రంగంలోకి దించి వికెట్‌ రాబట్టింది. పరీక్ష దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు కూడా కఠిన దశను ఎదుర్కొంటారు. గందరగోళానికి గురవుతారు. ఏకాగ్రత, నిర్దిష్టమైన ప్రణాళికే కీలకం. 

సమష్టి ప్రదర్శన : తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ ఇండియా చకచకా మూడు వికెట్లు కోల్పోయింది.. కానీ, కోహ్లి, అక్షర్‌ బ్యాటింగ్‌లో రాణించడంతో మంచి స్కోర్‌ సాధ్యమైంది. ఆ తర్వాత ప్రత్యర్థి వికెట్లను పడగొట్టడంలో బౌలర్లు, ఫీల్డర్లు చురుగ్గా వ్యవహరించారు. సమష్టి కృషితో విజయం సొంతమైంది. పోటీ పరీక్షల వేళ నలుగురు, ఐదుగురు మిత్రులు కలిసి బృందంగా ఏర్పడి చదువుకోవాలి. సందేహాలను తీర్చుకుంటూ.. సమష్టి సహకారంతో విజయ తీరాలకు చేరవచ్చు.

నిరాశ చెందొద్దు : బ్యాటింగ్‌ సమయంలో ఇండియా బ్యాటర్లు ముగ్గురు తొందరగా ఔట్‌ కావడంతో జట్టు ఒత్తిడిలో పడింది. కానీ, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ఆత్మవిశ్వాసంతో ఆడి పరుగులు రాబట్టారు. ఇప్పుడు పరీక్ష రాయనున్న అభ్యర్థులు కూడా ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదవకుండానే తొలి రెండు పేజీల్లోని ప్రశ్నలను చూసి గాబరాపడొద్దు.. ప్రశాంతంగా ఆలోచిస్తూ.. సులువైన ప్రశ్నలు ముందుగా రాస్తూ.. ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయాలి.

గత తప్పిదాలకు తావివ్వను

చిట్టిబాబు, డీఎస్సీ ఉద్యోగార్థి, మహబూబాబాద్‌

2017లో జీవశాస్త్రం ఉద్యోగానికి టీఆర్టీ పరీక్ష రాశాను. 64 మార్కులు వచ్చాయి. మూడు మార్కుల తేడాతో ఉద్యోగాన్ని కోల్పోవడంతో ఒత్తిడికి గురయ్యాను. కొద్ది రోజులకు ఎక్కడ తప్పు చేశానని.. ప్రశ్నపత్రాన్ని ముందు పెట్టుకొని పరిశీలించి గుర్తించాను. గత తప్పిదాలకు తావివ్వొద్దని నిర్ణయించుకున్నాను.

గత ప్రశ్నావళికి అనుగుణంగా..:

దినయ్, మహబూబాబాద్‌

గతంలో గ్రూప్‌-1 పరీక్షను రెండు సార్లు రాశాను. ఇటీవల మూడోసారి రాశాను. త్వరలో గ్రూప్‌-2, 3 రాసేందుకు చదువుతున్నాను. గ్రూప్‌-1లో ఏవిధంగా ప్రశ్నావళి ఇచ్చారో దానికి అనుగుణంగా చదువుతున్నాను. ప్రతి అంశాన్ని ఒకటికి రెండు సార్లు చదువుతూ పట్టుసాధిస్తున్నాను. ఏకాగ్రతతో పరీక్ష రాసేందుకు సన్నద్ధమవుతున్నా.. తప్పకుండా కొలువు సాధిస్తాననే ధీమాతో ఉన్నా.

న్యూస్‌టుడే, నెహ్రూసెంటర్‌

జిల్లా వారీగా డీఎస్సీ పోస్టులు

హనుమకొండ : 187
జనగామ : 221
మహబూబాబాద్‌ : 381
వరంగల్‌ : 301
భూపాలపల్లి : 237
ములుగు : 192

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని