logo

ఖాళీ ప్లాట్లు.. స్థానికులకు పాట్లు

నగరంలో ఖాళీగా ఉన్న ప్లాట్లతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు నిలిచి పాములు, తేళ్లు, దోమలకు ఆవాసాలుగా మారడంతో కాలనీవాసులకు అవస్థలు తప్పడం లేదు. తలుపులు, కిటికీలు నిత్యం మూసేయాల్సి వస్తోందని వాపోతున్నారు.

Updated : 01 Jul 2024 06:14 IST

హంటర్‌రోడ్‌ సంతోషిమాత కాలనీలో.. 

నగరంలో ఖాళీగా ఉన్న ప్లాట్లతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు నిలిచి పాములు, తేళ్లు, దోమలకు ఆవాసాలుగా మారడంతో కాలనీవాసులకు అవస్థలు తప్పడం లేదు. తలుపులు, కిటికీలు నిత్యం మూసేయాల్సి వస్తోందని వాపోతున్నారు. పలు ప్రాంతాల్లో ఏళ్ల తరబడి కొన్ని ప్లాట్లు ఖాళీగా ఉంటున్నాయి. అందమైన భవనాల నడుమ ఖాళీ ప్లాటు ఉంటే.. అందులో చెత్తాచెదారం వేస్తున్నారు. దీంతో అపరిశుభ్రత ఏర్పడుతోంది. దీంతో రోగాలు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లోని ఖాళీ ప్లాట్లను ఆదివారం ‘న్యూస్‌టుడే’ బృందం పరిశీలించింది.

కార్పొరేషన్, న్యూస్‌టుడే

రూ.5-10 వేల వరకు జరిమానా

వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లోని పలు కాలనీల్లో 4 వేల పైచిలుకు ప్రైవేటు ఖాళీ స్థలాలున్నాయని గ్రేటర్‌ వరంగల్‌ ప్రజారోగ్య విభాగం సర్వే ద్వారా గుర్తించారు. ప్రజా ఆరోగ్య భద్రత దృష్ట్యా, తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ నిబంధనల ప్రకారం ఖాళీ ప్లాట్లపై చర్యలు తీసుకునే అధికారం కమిషనర్‌కు ఉంది. ఖాళీ స్థలం యజమానిని గుర్తించి నోటీసు జారీ చేయాలి. వారం రోజుల్లో ప్లాటు శుభ్రం చేసుకోవాలని సూచించాలి. గడువు ముగిసినా.. స్పందించక పోతే మున్సిపల్‌ కార్మికులు, యంత్రాలతో స్థలాన్ని చదును చేయించాలి. యజమానికి రూ.5-10 వేల వరకు జరిమానా విధించాలి. అవసరమైతే స్థలాన్ని స్వాధీనం చేసుకొని గ్రేటర్‌ వరంగల్‌ పేరుతో బోర్డు ఏర్పాటు చేయాలి. బల్దియా ప్రజారోగ్య విభాగం అధికారులు మాత్రం నోటీసులతో సరిపెడుతున్నారు.

ఎక్కువ ఖాళీ స్థలాలున్న ప్రాంతాలు..

హంటర్‌రోడ్, బృందావన్‌ కాలనీ, ఎన్టీఆర్‌నగర్, సంతోషిమాత కాలనీ, గాయత్రినగర్, ఆటోనగర్, దేశాయిపేట, ఎల్బీనగర్, ఎనుమాముల సాయిగణేష్‌ కాలనీ, మధురానగర్, లేబర్‌ కాలనీ, రంగశాయిపేట తెలంగాణ కాలనీ, ఉర్సు, ఎస్‌ఆర్‌ఆర్‌తోట, శివనగర్, విద్యానగర్, నాగేంద్రనగర్, ఉర్సు, పాపయ్యపేట, రంగంపేట.

మినీ డంపింగ్‌యార్డులు..

కరీమాబాద్‌: 33వ డివిజన్‌ శాంతినగర్‌లోని ఖాళీ స్థలాల్లో చెత్తకుప్పలు పేరుకుపోయాయి. ప్రతిరోజూ స్వచ్ఛ ఆటోలు రాకపోవడంతో స్థానికులు చెత్తను ఖాళీ స్థలాల్లో వేస్తున్నారు. భవనాల పక్కనున్న ఖాళీ స్థలాలు మినీ డంపింగ్‌ యార్డులుగా మారుతున్నాయి. 33వ డివిజన్‌లో పదికిపైగా ఖాళీ స్థలాలు ఉండగా.. ప్రతిచోటా అదే పరిస్థితి.

పాముల బెడద..

రంగశాయిపేట: 41వ డివిజన్‌ పరిధిలోని శంభునిపేట విశ్వనాథ కాలనీలో నివాస గృహాల నడుమ ఖాళీ స్థలాల్లో ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు పెరిగాయి. దోమలు, విష పురుగుల సంచారం ఎక్కువైంది. పాముల బెడద నెలకొంది. దీంతో స్థానికులు రాత్రివేళ బయటికి రావాలంటే జంకుతున్నారు.

దోమలకు నిలయం..

పోచమ్మమైదాన్‌: గ్రేటర్‌ వరంగల్‌ 13 డివిజన్‌లోని వాసవీకాలనీ, గణేష్‌నగర్, టీచర్స్‌కాలనీ 22వ డివిజన్‌లోని 80 అడుగుల రోడ్డు మార్గం, పోచమ్మమైదాన్‌ సమీపంలోని ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగాయి. 12వ డివిజన్‌ తుమ్మలకుంట ప్రాంతంలో నివాస గృహాల మధ్య మురుగు నిలిచి దోమలకు నిలయంగా మారింది.

అడుగడుగునా ఇక్కట్లే..

కీర్తినగర్‌కాలనీ(గీసుకొండ): గీసుకొండ మండలం 16వ డివిజన్‌ పరిధి కీర్తినగర్‌ కాలనీలో అడుగడుగునా ఖాళీ ప్లాట్లు ఉన్నాయి. కీర్తినగర్‌ కాలనీలో 25 ఏళ్ల క్రితం ప్రభుత్వం హౌజింగ్‌బోర్డును ఏర్పాటు చేసి 1450 ఇళ్లను నిర్మించింది. ఇందులో ఎంఐజీ, ఎల్‌ఐజీ, హెచ్‌ఐజీ ఇళ్లు ఉన్నాయి. ఈ కాలనీలో సుమారు 50 వరకు ప్రభుత్వ స్థలాలతో పాటు అంతకంటే ఎక్కువగానే ప్రైవేటు ఖాళీ స్థలాలున్నాయి. అందులో వర్షం నీరు నిల్వ ఉండి.. తుమ్మ చెట్లు, పిచ్చిమొక్కలు మొలిచాయి. అపరిశుభ్రతతో స్థానికులు రోగాల బారిన పడుతున్నారు.

వానాకాలంలో తీవ్ర ఇబ్బంది..

శ్రీదేవి, గృహిణి, సాయిగణేష్‌ కాలనీ

మా కాలనీలో పదుల సంఖ్యలో ఖాళీ స్థలాలున్నాయి. సంవత్సరాల తరబడి వృథాగా ఉంటున్నాయి. యజమానుల వివరాలు తెలియడం లేదు. వానాకాలం వచ్చిందంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు ఆగుతోంది. దోమల సమస్య ఎక్కువవుతోంది.

అధికారులు చర్యలు తీసుకోవాలి

ఎసబోయిన అశోక్, స్థానికుడు

 ఖాళీ స్థలాల యజమానులపై అధికారులు చర్యలు తీసుకోవాలి. నోటీసులు జారీ చేశామంటూ చేతులు దులుపుకోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునేలా చూడాలి.

నోటీసులు జారీ చేస్తాం:

డాక్టర్‌ రాజేష్, ముఖ్యఆరోగ్యాధికారి, గ్రేటర్‌ వరంగల్‌

 వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో డివిజన్ల వారీగా ప్రైవేటు ఖాళీ స్థలాల వివరాలు సేకరించాం. సంబËంధిత యజమానులకు నోటీసులు జారీ చేస్తాం. స్పందించక పోతే భారీ జరిమానాలు విధిస్తాం. స్థలాలు స్వాధీనం చేసుకుంటామని ప్రచారం చేస్తాం. దోమల నివారణ చర్యలు చేపడతాం  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని