logo

బాహ్యవలయ రహదారి నిర్మాణానికి కసరత్తు

జిల్లా కేంద్రమైన మహబూబాబాద్‌ పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతోంది. పట్టణంలో ద్విచక్రవాహనాలతో పాటు ఇతర వాహనాలు కలిపి సుమారు 30 వేల వరకు ఉంటాయని అంచనా.

Published : 01 Jul 2024 03:08 IST

సర్వే చేపట్టాలని మున్సిపాల్టీ ఏకగ్రీవ తీర్మానం

మహబూబాబాద్‌ నుంచి తాళ్లపూసపల్లి వెళ్లే ప్రధాన రహదారి 

మహబూబాబాద్, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రమైన మహబూబాబాద్‌ పట్టణంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమవుతోంది. పట్టణంలో ద్విచక్రవాహనాలతో పాటు ఇతర వాహనాలు కలిపి సుమారు 30 వేల వరకు ఉంటాయని అంచనా. వీటితో పాటు నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే వాహనాలతో సంఖ్య రెట్టింపవుతోంది. పట్టణంలోని ప్రధాన వీధుల్లో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. బాహ్యవలయ రహదారి నిర్మాణంతోనే ఈ ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభించనుందని పురపాలక సంఘం భావించింది. 

జిల్లా కేంద్రంలో నలువైపుల సుమారు 11.750 కి.మీ., పొడవులో జాతీయ రహదారులకు అనుసంధానిస్తూ నాలుగు బాహ్యవలయ రహదారుల నిర్మాణం చేపట్టేందుకు ఇటీవల పురపాలకవర్గం నిర్ణయించింది. రహదారి నిర్మాణం ప్రారంభమైన ప్రదేశం నుంచి పూర్తయ్యే వరకు అవసరమయ్యే నిధులపై అంచనాలను తయారు చేసేందుకు సర్వే చేపట్టడానికి రూ. 23.50 లక్షలు కేటాయిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించింది. అనుభవం కలిగిన సంస్థ ద్వారా సర్వే చేబట్టి అనంతరం సమగ్ర నివేదిక(డీపీఆర్‌) రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదించనుంది. 

జిల్లా కేంద్రంతో పాటు పట్టణ నలువైపుల నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలకు సాగించే వాహనాలకు మహబూబాబాద్‌ కూడలిగా మారింది. మహబూబాబాద్‌ నుంచి భద్రాచలం, వరంగల్, హైదరాబాద్, ఖమ్మం, సూర్యాపేట ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఎటు వెళ్లాలన్నా పట్టణంలోకి రావలసిన పరిస్థితి ఉండడంతో ఇక్కడ ట్రాఫిక్‌ సమస్య అధికమైంది. ఈ సమస్యకు ప్రత్యామ్నాయంగా హైదరాబాద్‌ వలిగొండ నుంచి వయా తొర్రూరు, మహబూబాబాద్‌ మీదుగా భద్రాచలం 930-పి జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌)ని కలుపుతూ ఈ నాలుగు బాహ్యవలయ రహదారి నిర్మాణాలు పూర్తి చేస్తే భద్రాచలం, వరంగల్, ములుగు, సూర్యాపేట, ఖమ్మం, హైదరాబాద్‌ -తొర్రూరు ప్రాంతాల నుంచి వచ్చే భారీ వాహనాలు పట్టణంలోనికి ప్రవేశించకుండా వెళ్లిపోతాయి. ప్రస్తుతం ఉన్న జనావాసాలకు దగ్గర కాకుండా ఈ బాహ్యవలయ రహదారి నిర్మాణం చేపట్టాలని పలువురు భావిస్తున్నారు. భవిష్యత్‌లో జరుగనున్న పట్టణ విస్తరణ దృష్టితో ఆలోచించి రహదారి నిర్మాణ వ్యయాన్ని భారంగా పరిగణించకుండా నిర్ణయాలను తీసుకోవలసిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని