logo

వ్యాధుల కాలం.. అప్రమత్తతే కీలకం

వర్షాలు అడపాదడపా కురుస్తున్నాయి. పల్లెలు, పట్టణాల్లో అపరిశుభ్రం నెలకొంటోంది. గుంతలు, మురుగు కాల్వలు, ఖాళీ స్థలాల్లో నిలిచే నీరు మశకాలకు ఆవాసంగా మారుతున్నాయి.

Updated : 01 Jul 2024 06:16 IST

 వెంకటాపురం మండలం ఉప్పేడుగొల్లగూడెంలో నివాసాల మధ్య మురుగు

వెంకటాపురం(ములుగు జిల్లా), న్యూస్‌టుడే: వర్షాలు అడపాదడపా కురుస్తున్నాయి. పల్లెలు, పట్టణాల్లో అపరిశుభ్రం నెలకొంటోంది. గుంతలు, మురుగు కాల్వలు, ఖాళీ స్థలాల్లో నిలిచే నీరు మశకాలకు ఆవాసంగా మారుతున్నాయి. కీటక, నీటిజనిత వ్యాధులకు ఊతమిస్తున్నాయి. ముసురుకొస్తున్న వ్యాధుల ముప్పు అధికారుల్లో అప్రమత్తతను హెచ్చరిస్తుస్తోంది. వైద్యఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా విభాగం సమన్వయంతో ముందడుగు వేస్తేనే ప్రమాదఘంటికలు తప్పనున్నాయి. ఈ నేపథ్యంలో మన్యంలో తరుణవ్యాధుల స్థితి, యంత్రాంగం సన్నద్ధతపై ‘న్యూస్‌టుడే’ కథనం.

జిల్లా పరిధిలో 419 గ్రామాల్లో 3.52 లక్షల జనాభా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ములుగు జిల్లా ఆసుపత్రి, వెంకటాపురం, ఏటూరునాగారంలో సీహెచ్‌సీలు, 15 పీహెచ్‌సీలు జిల్లాలో ఉన్నాయి. అనుబంధంగా పల్లెస్థాయిలో 51 ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌లు, 38 ఆరోగ్య ఉప కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఇదంతా ఓ వైపు కాగా.. వైద్యులు, సిబ్బంది కొరతతో గ్రామీణంలో సకాలంలో సేవలు అందని పరిస్థితి ఉంది. ఇది వ్యాధుల ముప్పెట దాడికి ప్రతీ ఏటా కారణమవుతోంది.

గొత్తికోయ గూడేలపై దృష్టి 

వ్యాధులు వ్యాప్తి చెందటంపై వైద్యశాఖ అప్రమత్తమైంది. ఇందుకు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి వలసల కారణంగానే దోమల వ్యాప్తి చెందుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా గొత్తికోయ గూడేలపై ఈ ఏడాది ప్రత్యేక దృష్టి సారించేలా ప్రణాళిక చేసింది. జిల్లాలో 60కి పైగా గొత్తికోయగూడేల్లో 6,426 మంది నివసిస్తున్నట్లు క్షేత్రస్థాయి సర్వే ద్వారా తేల్చారు. ఈ గూడాల్లో వ్యాధులపై చైతన్యం కలిగించడం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి రాకపోకలు సాగిస్తే ముందస్తు ఏర్పాట్లు చేసుకునేలా చొరవ చూపుతున్నారు.

దోమతెరలు వచ్చేదెన్నడో.. 

దోమతెరల ఊసేలేదు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రభావిత పల్లెలకు అందాల్సిన తెరలు గ్రామాలకు చేరలేదు. రెండేళ్ల కిందట సరఫరా చేపట్టగా, ప్రస్తుత ఏడాదికి వైద్యశాఖ ఎదురుచూస్తోంది. జిల్లా వ్యాప్తంగా 34 వేల దోమతెరలు అవసరం ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించినట్లు వైద్యశాఖ చెబుతోంది. వానాకాలానికి ముందే రావాల్సిన ఈ సామగ్రి నేటీకీ అందకపోవడం గుబులు కలిగిస్తోంది. దోమల నివారణకు  పిచికారి సైతం నెమ్మదిగానే సాగుతోంది. 

చాపకింద నీరులా.. 

వ్యాధుల కాలం ఆరంభానికి ముందే జిల్లాలోని పలు ప్రాంతాల్లో మలేరియా, డెంగీ కేసులు నమోదయ్యాయి. కన్నాయిగూడెం, రొయ్యూరు, కొడిశాల, తాడ్వాయి, పస్రా, వాజేడు, పేరూరు, ఎదిర తదితర ఎనిమిది పీహెచ్‌సీల పరిధిలోని 15 ఆరోగ్య ఉప కేంద్రాలు మలేరియా ప్రభావిత ప్రాంతాల జాబితాలో చేరాయి. ఈ పరిధిలోని 123 గ్రామాలు తీవ్ర ప్రభావిత పల్లెలుగా వైద్యశాఖ నిర్ధారించింది. దోమకాటు ప్రభావిత ప్రాంతాలతో పాటు ఇతర పల్లెల్లోనూ ఈ ఏడాది మే నాటికి 13 మలేరియా, 4 డెంగీ కేసులు నమోదయ్యాయి.

క్షేత్రస్థాయిలో శ్రమిస్తేనే..

అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో తీవ్రంగా శ్రమిస్తేనే కాలానుగుణ వ్యాధులను కట్టడి చేయొచ్చు. ఇందుకు ప్రభుత్వశాఖల్లో సమన్వయం అవసరం. గ్రామీణుల్లో వ్యాధులపై ఉన్న నిర్లిప్తత, అవగాహన రాహిత్యాన్ని తొలగించేలా చర్యలు చేపట్టాలి. ఫ్రైడే డ్రైడేతో పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. దోమలను నియంత్రించేందుకు ఫాగింగ్‌ యంత్రాల దుమ్ము దులపాల్సి ఉంది. పైపులైన్ల లీకేజీలు అరికట్టడం, పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు చేపడితేనే మున్ముందు ముప్పు తప్పనుంది.

సమన్వయంతో ముందుకు  

అల్లె అప్పయ్య, డీఎంహెచ్‌వో, ములుగు

సీజనల్‌ వ్యాధుల కట్టడికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఏడాది గొత్తికోయగూడేలపై ప్రత్యేక దృష్టి సారించాం. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని ముందుకు సాగుతాం. దోమల నివారణకు చర్యలు ప్రారంభమయ్యాయి. దోమతెరలకు ప్రతిపాదనలు పంపించాం. వరద ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక సేవలకు ప్రణాళిక చేస్తున్నాం.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు