logo

బకాయిల ఊబిలో సింగరేణి

భూపాలపల్లి సింగరేణి డివిజన్‌లో కార్మికుల, అధికారుల క్వార్టర్లు, భవనాలను అద్దెకు తీసుకున్న ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు కొందరు నెలవారీగా అద్దె చెల్లించటం లేదు. సకాలంలో సింగరేణికి అద్దె చెల్లించకపోవడంతో విద్యుత్తు బిల్లులు, తాగునీరు.

Updated : 01 Jul 2024 06:20 IST

సింగరేణి వీటీసీ భవనంలో ఏర్పాటైన పోలీసు భరోసా కేంద్రం 

న్యూస్‌టుడే, భూపాలపల్లి : భూపాలపల్లి సింగరేణి డివిజన్‌లో కార్మికుల, అధికారుల క్వార్టర్లు, భవనాలను అద్దెకు తీసుకున్న ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు కొందరు నెలవారీగా అద్దె చెల్లించటం లేదు. సకాలంలో సింగరేణికి అద్దె చెల్లించకపోవడంతో విద్యుత్తు బిల్లులు, తాగునీరు. తదితర నిర్వహణ ఖర్చుల భారం పెరుగుతోంది. భూపాలపల్లి ఏరియాలోని క్వార్టర్లు, భవనాల్లో నివాసం ఉంటున్న రెవెన్యూ, ఫారెస్టు, పోలీసు, తదితర శాఖల అధికారులే కాకుండా పలువురు ప్రజా ప్రతినిధులు చెల్లించాల్సిన ఇంటి అద్దె బకాయిలు రూ.2.15 కోట్ల వరకు ఉన్నాయి. కార్మికులు క్వార్టర్లు సకాలంలో ఖాళీ చేయకుంటే, వారి వేతనాల నుంచి అద్దె డబ్బులు రికవరీ చేస్తారు. ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు సకాలంలో క్వార్టర్లు ఖాళీ చేయకుంటే, వారికి వచ్చే డబ్బులను నిలుపుదల చేస్తారు. సింగరేణి అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, రాజకీయ నాయకులు తీసుకున్న క్వార్టర్లకు, భవనాలకు ఎందుకు అద్దె వసూలు చేయటం లేదని పలువురు కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఒక వైపు వందల సంఖ్యలో సింగరేణి కార్మికులు క్వార్టర్ల సౌకర్యం లేక అద్దె ఇళ్లలో రూ.వేలకు వేలు ఇంటి అద్దె చెల్లిస్తున్నారు. మరికొందరు నివాస గృహాలు లేక చుట్టుపక్కల గ్రామాల్లో నివాసం ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. 

జిల్లా ఆవిర్భావం నుంచే..

భూపాలపల్లి జిల్లా ఆవిర్భావం నుంచే సింగరేణి యాజమాన్యం కోట్లాది రూపాయలు వెచ్చిన సింగరేణి అధికారులకు, కార్మికులకు నివాస గృహాలు వివిధ శాఖల అధికారులకు, ఇతర సిబ్బందికి కేటాయించారు. ముఖ్యంగా కలెక్టర్‌ కార్యాలయానికి కూడా మంజూరునగర్‌ ప్రాంతంలో నిర్మించిన ఓ అతిథి గృహాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఇందులో సుమారు పది ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కొనసాగాయి. గతేడాది నవంబరు మాసంలో సింగరేణి అతిథి గృహంలో కొనసాగిన కలెక్టర్‌ కార్యాలయం మంజూరునగర్‌ ప్రాంతంలోని వంద పడకుల ఆసుపత్రి సమీపంలో నిర్మించిన కొత్త సమీకృత కార్యాలయాల భవన సముదాయంలోకి మార్చారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఇందులోకే వచ్చాయి. ఇక్కడి వరకు మంచిగానే ఉంది. 2017 నుంచి ఇప్పటివరకు సింగరేణి సంస్థకు చెల్లించాల్సి అద్దె  చెల్లించకపోవడంతో బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. భూపాలపల్లి ఏరియాలో సింగరేణి యాజమాన్యం నిర్మించిన దాదాపు 135  క్వార్టర్లు, భవనాలు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులకు, ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు అద్దెకిచ్చారు. వీటిలో నివాసం ఉంటున్న కొందరు అద్దె బకాయిలు ఎందుకు చెల్లించాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరి కొందరు ఇక్కడ అద్దెకు ఉండి ఇతర ప్రాంతాలకు వెళ్లిన అధికారులు చెల్లించటం లేదు. బదిలీపై వెళ్లిన అధికారులు, సిబ్బంది కుటుంబీకులు సింగరేణి క్వార్టర్లలో నివాసం ఉంటున్నా అద్దె అడిగితే క్వార్టర్‌ తమ పేరుతో లేదని సమాధానం చెబుతున్నారు. 

బకాయిల వసూళ్లకు ఒత్తిడి పెంచుతున్నాం 

సయ్యద్‌ హబీబ్‌ హుస్సేన్, జీఎం, భూపాలపల్లి  

సింగరేణికి సంబంధించిన క్వార్టర్లు, భవనాల్లో నివాసం ఉంటున్న పలు శాఖల అధికారులు చెల్లించాల్సిన అద్దె బకాయిల వసూళ్లపై ఒత్తిడి పెంచుతున్నాం. ఇటీవల వీటి విషయమై కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాం. కొంత మంది నివాసం ఉంటున్న ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలుపుదల చేస్తే, బకాయిలు చెల్లించారు. ఇప్పటికే మొండి బకాయిదారులకు నోటీసులు జారీ చేశాం. ఖాళీగా ఉన్న 300 క్వార్టర్లను త్వరలో అర్హులైన కార్మికులకు అప్పగిస్తాం.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని