logo

పలిమెల మండలం పేరుకేనా?

జిల్లాలోనే మారుమూల ప్రాంతం పలిమెల మండలం. ఆ ప్రాంత అభివృద్ధికి, ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు ఎనిమిదేళ్ల కిందట నూతన మండలంగా ఏర్పాటుచేశారు.

Updated : 01 Jul 2024 06:17 IST

మండల కేంద్రంలో నిర్మించిన సమీకృత కార్యాలయాల భవనం

జిల్లాలోనే మారుమూల ప్రాంతం పలిమెల మండలం. ఆ ప్రాంత అభివృద్ధికి, ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసేందుకు ఎనిమిదేళ్ల కిందట నూతన మండలంగా ఏర్పాటుచేశారు. కాని ప్రభుత్వ సేవలన్నీ పూర్వపు మండల కేంద్రమైన మహదేవ్‌పూర్‌ నుంచే నిర్వహిస్తున్నారు. కొత్త మండలం ఏర్పాటువల్ల స్థానికులకు ఇప్పటికీ ప్రయోజనాలు అంతంత మాత్రమే అందుతున్నాయి.  

-ఈనాడు డిజిటల్, జయశంకర్‌ భూపాలపల్లి, పలిమెల, న్యూస్‌టుడే 

సిద్ధంగా సమీకృత భవనం.. మరో భవనానికి శంకుస్థాపన..

పలిమెలలో కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు ఐదేళ్ల క్రితం సమీకృత కార్యాలయాల భవనం నిర్మించారు. ఇందులో తహసీల్దారు, మండల ప్రజా పరిషత్‌  బోర్డులు పెట్టారు.  ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు మాత్రమే అధికారులు వస్తారు. సుమారు రూ.65 లక్షల నిధులతో మరో సమీకృత  కార్యాలయం మంజూరైంది. ఫిబ్రవరి నెలలో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు  భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 

మెరుగైన రవాణా సౌకర్యం..

పలిమెల మండలం ఏర్పాటైన కొత్తలో రవాణా సౌకర్యం ప్రమాదకరంగా ఉండేది. వాగులపై వంతెనలు లేక రాకపోకలు కష్టంగా ఉండేది. ప్రస్తుతం పెద్దంపేట, పంకెన, తీగలవాగులపై వంతెనలు పూర్తవటమేగాక, పలిమెల నుంచి మహాదేవ్‌పూర్‌ వరకు రెండు వరుసల రహదారి నిర్మించారు. హనుమకొండ నుంచి పలిమెలకు రాకపోకలు కొనసాగించేలా ఆర్టీసీ బస్సు సౌకర్యం సైతం అందుబాటులోకి వచ్చింది.  

భద్రత ఇబ్బందులు తొలగినా..

గతంలో పలిమెలలో ఎలాంటి చరవాణి సిగ్నళ్లు సరిగా ఉండేవి కావు. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్, ఓ ప్రైవేటు కంపెనీకి సంబంధించిన 5జీ సిగ్నళ్లు అందుబాటులోకి వచ్చాయి. కార్యాలయాలు ఏర్పాటు చేస్తే ఇంటర్నెట్‌ పరంగా ఎలాంటి సమస్యలు ఉండవు. మారుమూల ప్రాంతం, నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతం కావడంతో భద్రతాపరమైన ఇబ్బందులుంటాయని అప్పట్లో అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం పలిమెలలో పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటై మూడు సంవత్సరాలుగా పోలీసు సేవలు అందిస్తున్నారు. అందువల్ల ఇక్కడ  కార్యాలయాలు ఏర్పాటు చేస్తే భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది స్పష్టం. ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించే ప్రాంతం సైతం ఠాణా సమీపంలోనే గుర్తించినందున రక్షణపరంగా ఇబ్బందులుండవు.

కార్యాలయాలన్నీ అక్కడే..

2016లో పలిమెలను 8 గ్రామ పంచాయతీలతో నూతన మండలంగా ఏర్పాటైంది. మండలం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ కార్యాలయాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇప్పటికి 8 సంవత్సరాలు గడుస్తున్నా మండల కేంద్రానికి ఏ ఒక్క కార్యాలయం కూడా రాలేదు. మండలం ఏర్పాటైన కొత్తల్లో భవనాల కొరత, ఫోన్‌ సిగ్నల్, రవాణా సౌకర్యం, భద్రత, పోలీసు సేవలు అందుబాటులో లేవు. ఈకారణంగా పాత మండలమైన మహదేవపూర్‌లోనే తహసీల్దార్, మండల ప్రజాపరిషత్, వ్యవసాయ, విద్యావనరుల కేంద్రం తదితర  కార్యాలయాలు ఏర్పాటుచేసి అక్కడినుంచే  పాలన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పలిమెలలో సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉన్నా కార్యాలయాలను మాత్రం తరలించటం లేదు. దీంతో ప్రజలు ప్రతి చిన్న పనికీ 32 కి.మీ దూరంలో ఉన్న మహదేవపూర్‌కి వెళ్లాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు.

 స్థానికంగా కార్యాలయాలు ఏర్పాటు చేయాలి

బాడిష భాస్కర్, పలిమెల

పలిమెలకు సంబంధించిన కార్యాలయాలు మహదేవపూర్‌లో ఉండటంతో ఒక గంటలో అయ్యే పని రెండు రోజులు పడుతోంది. పలుమార్లు తిరగడం వల్ల అదనపు ఖర్చు, సమయం వృథా అవుతోంది. కలెక్టర్‌ స్పందించి కార్యాలయాలు పలిమెల తరలించేలా చర్యలు తీసుకోవాలి.

పత్రాల విషయంలో ఇబ్బందులు

చిలుముల సంతోష్, పంకెన గ్రామం

మండలంలో మీసేవ కేంద్రాలు ఉన్నప్పటికీ పత్రాలపై అధికారుల సంతకాల కోసం 32 కిలోమీటర్లు దూరంలోని మహదేవపూర్‌ వెళ్లాల్సి వస్తోంది. ఆ సమయంలో అధికారి లేకుంటే సాయంత్రం వరకు ఎదురుచూసి, మరుసటి రోజు వెళ్తున్నాం. కుల, ఆదాయ ధ్రువపత్రాల విషయంలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

త్వరలోనే కార్యాలయాలు తరలిస్తాం 

వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్‌

అన్ని కార్యాలయాలను పలిమెల మండలానికి తరలిస్తాం. రెండ్రోజుల్లోనే అక్కడికి మార్చేలా చర్యలు తీసుకుంటున్నాం. మండల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కార్యాలయాలు అందుబాటులోకి తెస్తాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు