logo

నిర్మాణం పూర్తయినా.. నిరుపయోగం

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన ఆరోగ్య పరిరక్షణ, యోగా సాధన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోజు రోజుకు పెరుగుతున్న యోగా ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని జిల్లాల్లో ఆయుష్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సాధన చేయడానికి ఆరోగ్య స్వస్థత కేంద్రాలను(హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌) ఏర్పాటు చేస్తున్నారు.

Published : 01 Jul 2024 02:53 IST

 దేవరుప్పుల మండలం పెద్దమడూరులో..

జనగామ టౌన్, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన ఆరోగ్య పరిరక్షణ, యోగా సాధన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోజు రోజుకు పెరుగుతున్న యోగా ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని జిల్లాల్లో ఆయుష్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సాధన చేయడానికి ఆరోగ్య స్వస్థత కేంద్రాలను(హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌) ఏర్పాటు చేస్తున్నారు. జనగామ జిల్లాకు కూడా రూ.54 లక్షల వ్యయంతో 9 సెంటర్లు మంజూరు చేయగా, ఏడాదిన్నర క్రితమే 8 కేంద్రాల నిర్మాణం పూర్తి చేయగా, జనగామ పట్టణంలో మాత్రం భూసేకరణ సమస్యతో నిర్మాణం జరగలేదు. పూర్తయిన చోట నిర్వీర్యం చేస్తున్నారు.

ఒక్కో కేంద్రానికి రూ.6 లక్షలు

జిల్లాలో మొత్తం 9 ఆరోగ్య స్వస్థత కేంద్రాలను ఆయుష్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడానికి పనులను పంచాయతీరాజ్‌ శాఖకు అప్పగించారు. జిల్లాలోని పెద్దమడూరు, చెన్నూరు, పెంబర్తి, పడమటికేశ్వాపూర్, తాటికొండ, ఛాగల్, అశ్వరావుపల్లి, నవాబ్‌పేట గ్రామాల్లో ఆరోగ్య స్వస్థత కేంద్రాల నిర్మాణం పూర్తి చేశారు. జనగామ పట్టణంలో తొలుత కేంద్రం నిర్మాణానికి ప్రభుత్వ స్థలం లభించలేదు. ఇటీవలే పట్టణంలోని ధర్మకంచలో ఉన్న అర్బన్‌ పీహెచ్‌సీలో వెనుక వైపు అందుబాటులో ఉన్న ఖాళీ నిర్ణయించారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నట్లు తెలిసింది. అయితే ఇతర గ్రామాల్లో పూర్తయిన ఎనిమిది కేంద్రాలు ఏడాదిన్నరగా నిరుపయోగంగా ఉంటున్నాయి. దీనికి కారణం ఆయా కేంద్రాల్లో యోగా శిక్షకుల నియామకం పూర్తి కాలేదు. తొలుత ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇప్పించాలని యోచించినా, వారికి ఇతర పని ఒత్తిడి వల్ల ఆలోచనను విరమించుకున్నారు. దీనికి ఆయా గ్రామాల్లో ఉన్న నిరుద్యోగులనే ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. యోగాలో డిప్లొమాతో పాటు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలో రాష్ట్ర స్థాయిలో శిక్షకుల ఎంపిక  జరుగనుంది.

గర్భిణులకు ఎంతో ఉపయోగం..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ కాన్పులపై వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు కాన్పు కంటే ముందు వారికి అవసరమైన యోగాసనాలను నేర్పించాలని యోచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సాధారణ కాన్పులు అయ్యే వీలుంటుందని ఆయుష్‌ అధికారులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అలాగే అన్ని వయసులు, వర్గాల ప్రజలు కూడా సాధన చేయడానికి ఈ కేంద్రాలు ఉపయోగించుకునే వీలుంటుందని చెపుతున్నారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా సిద్ధంగా ఉన్న ఆరోగ్య స్వస్థత కేంద్రాలను ప్రారంభించడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలు అందుబాటులోకి వచ్చినట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. 

త్వరలోనే ప్రారంభిస్తాం.. 

ధర్మరాజు, ఆయుష్‌ జిల్లా కోఆర్డినేటర్‌.

జిల్లాలో నిర్మాణం పూర్తయిన ఆరోగ్య స్వస్థత కేంద్రాలను త్వరలో ప్రారంభించడానికి చర్యలు చేపడతాం. శిక్షకులు లేని విషయాన్ని రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో నియామకం ఉంటుంది, తర్వాత ప్రారంభం ఉంటుంది. ప్రారంభిస్తే గర్భిణులతో పాటు సాధారణ ప్రజలు కూడా వినియోగించుకునే వీలుంటుంది.

జిల్లాలో మంజూరైన ఆరోగ్య స్వస్థత కేంద్రాలు : 09
నిర్మాణం పూర్తయినవి : 08
ఒక్కో కేంద్రానికి మంజూరైన నిధులు : రూ.6 లక్షలు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని