logo

కాంగ్రెస్‌లో అసమ్మతి గళం!

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నాయకుల మధ్య కలహాలు పెరిగాయి.  ఉమ్మడి జిల్లాలోని కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య మాటామంతి ఉండటం లేదు. ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.

Published : 01 Jul 2024 02:47 IST

రంగంపేట, న్యూస్‌టుడే : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ నాయకుల మధ్య కలహాలు పెరిగాయి.  ఉమ్మడి జిల్లాలోని కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య మాటామంతి ఉండటం లేదు. ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటనకు సంబంధించి కనీస సమాచారం లేదని పలువురు జిల్లా ముఖ్య నాయకులు వాపోయారు. సీఎంను కలిసేందుకు, హెలిప్యాడ్‌ వద్దకెళ్లేందుకు నానా తంటాలు పడ్డామని పరకాలకు చెందిన ఓ సీనియర్‌ నాయకుడు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనపై ఎమ్మెల్యేలు కనీస సమాచారం ఇవ్వలేదని నగరానికి చెందిన ఇద్దరు సీనియర్‌ నాయకులు తెలిపారు. మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారిని, పదేళ్లుగా భారాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారిని విస్మరించి, కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని మండల, గ్రామ, నగర స్థాయిలోని నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఉంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కలహాలు ఎక్కువయ్యే అవకాశాలున్నాయని సీనియర్‌ నాయకులంటున్నారు. అధికారంలోకి వచ్చి ఆరునెలలవుతున్నా.. గెలిచిన ప్రజాప్రతినిధులు కార్యకర్తల బాగోగులు, ఇబ్బందులు చూడటం లేదంటున్నారు.

  • శనివారం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై ఆదివారం దొంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలిసింది. ‘పరకాల, వరంగల్, హనుమకొండ నగర పర్యటనకు ముఖ్యమంత్రి వచ్చారు, నా నియోజకవర్గానికి వచ్చినప్పుడు నేను కనిపించకపోతే అడగాలని’ అన్నట్లు సమాచారం. 
  • పరకాల నియోజకవర్గంలో పాత, కొత్త కాంగ్రెస్‌ నాయకుల మధ్య పొసగడం లేదు. ఫ్లెక్సీలు, చిన్న చిన్న అంశాలపై నిత్యం వాగ్వాదాలు జరుగుతున్నాయని సీనియర్‌ నాయకుడు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
  • వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నాయకులు ఎవరికి వారే అన్నట్లుగా ఉంటున్నారు. శనివారం రాత్రి ఓ కాంగ్రెస్‌ నాయకుడు ఏర్పాటు చేసిన విందు భోజనంలో ముఖ్యనాయకులు, డివిజన్‌ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ నాయకుడి పెత్తనం ఎక్కువైందని, అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు వాపోయినట్లు తెలిసింది. గంటన్నర పాటు సదరు నాయకుడి గురించే చర్చించినట్లు సమాచారం.
  • వర్ధన్నపేటలో ముఖ్యనాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని