logo

వైద్య వృత్తి.. సేవా కీర్తి

పశ్చిమ బెంగాల్‌ రెండో ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్‌ బిధాన్‌ చంద్రరాయ్‌ జ్ఞాపకార్థం ఏటా జులై 1న జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో ఉండేవారు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటారు.

Updated : 01 Jul 2024 06:19 IST

నేడు జాతీయ వైద్యుల దినోత్సవం 

పశ్చిమ బెంగాల్‌ రెండో ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్‌ బిధాన్‌ చంద్రరాయ్‌ జ్ఞాపకార్థం ఏటా జులై 1న జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో ఉండేవారు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా.. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటారు. కానీ! గ్రామాల్లో ఆర్థిక, సామాజిక పరిస్థితుల కారణంగా రోగం ముదిరే వరకు వెళ్లరు. దీనివల్ల ప్రాణనష్టం ఎక్కువగా ఉంటోంది. కొన్ని అటవీ ప్రాంతాల్లోని గూడేలకు ఇప్పటికీ మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. అలాంటి వారి కోసం పలువురు వైద్యులు సేవా స్ఫూర్తితో పనిచేస్తున్నారు. వాగులు, వంకలు దాటి.. పేదల దరికి చేరి వైద్య సేవలందిస్తున్నారు. రోగాలు ముందుగా గుర్తించి, మెరుగైన చికిత్స కోసం పట్టణాలకు పంపించి ప్రాణాపాయం నుంచి తప్పిస్తున్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పేదలకు ఉత్తమ సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న పలువురు వైద్యులపై ‘న్యూస్‌టుడే’ కథనం.. 

న్యూస్‌టుడే, ఎంజీఎం ఆసుపత్రి

వాగులు వంకలు దాటి..

 డా.అంగడి సుమలత ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యూర్‌(చెల్పాక) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా పనిచేస్తున్నారు. పీహెచ్‌సీ పరిధిలో 8 గొత్తికోయ గ్రామాలు, మరో 8 వరకు పంచాయతీలుంటాయి. చాలా గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. వాగులు దాటితేగానీ ఎలిశెట్టిపల్లి, గుండెంగవాయి వంటి గ్రామాలకు వెళ్లలేం. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ అప్పయ్య సహకారం, స్థానికుల సాయంతో ఆయా గ్రామాలకు నడిచివెళ్లి సేవలందిస్తున్నట్లు సుమలత తెలిపారు. వర్షాకాలంలో వాగులు ఉప్పొంగినప్పుడు గర్భిణులు ప్రసవం కోసం ఆసుపత్రికి రావడం కష్టమని, నెలలు నిండిన వారిని ముందే సురక్షిత ప్రాంతాల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పీహెచ్‌సీ పరిధిలో వాయిలాల వెంకటమ్మ అనే మహిళకు క్యాన్సర్‌ ఉందని ముందే గుర్తించి హైదరాబాద్‌కు పంపించామని, సకాలంలో చికిత్స అందించడం వల్ల ఆమె ఇప్పుడు ఆరోగ్యంగా ఉందని, ఇలాంటి ఘటనలు సంతృప్తినిస్తాయని సుమలత పేర్కొన్నారు. ఈమె పుట్టింది పెరిగింది పట్టణ ప్రాంతమైన సిద్దిపేట అయినా.. అటవీ ప్రాంతాల్లో సేవలందించడం గమనార్హం.

 పడవలో అటవీ గ్రామాలకు వెళ్తున్న వైద్య బృందం 

చికిత్స చేస్తూ.. పాఠాలు బోధిస్తూ..

ఎంజీఎం రుమటాలజీ విభాగంలో సేవలందిస్తున్న డాక్టర్‌ విఘ్నేష్‌ మరోవైపు తన మిత్రులతో కలసి ఏర్పాటు చేసిన అస్యూర్‌(భరోసా) మెడికల్‌ ఫౌండేషన్‌ ద్వారా దేశవ్యాప్తంగా సూపర్‌స్పెషాలిటీ పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నారు. పీజీ సీటు పొందిన దేశంలోని టాప్‌-20 విద్యార్థుల్లో ఎక్కువ మంది తమ ఫౌండేషన్‌లో శిక్షణ తీసుకున్నవారే కావడం గర్వంగా ఉందని ఆయన తెలిపారు. తమిళనాడుకు చెందిన ఆయన అక్కడే ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. ఆ తర్వాత దిల్లీ ఏయిమ్స్‌లో సూపర్‌స్పెషాలిటీ రుమటాలజీ విభాగంలో పీజీ చదివారు. ప్రస్తుతం వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో ఓపీ విభాగంలోని 33 నంబరు గదిలో ప్రతి మంగళ, శుక్రవారం రోగులకు రుమటాలజీ సేవలందిస్తున్నారు. ఒకప్పుడు ప్రైవేటులో మాత్రమే లభించే ఈ వైద్యం.. ఆయన చేరికతో ఎంజీఎంలో పేదలకు అందుబాటులోకి వచ్చింది. ఏడాది క్రితం అయిదుగురు రోగులు ఉండగా.. నేడు 100 మందికి చేరారు. ఎంజీఎంకు మయోటైటిస్, కీళ్లవాతం, సోరియాటెక్‌ కీళ్లవాతం, ఎంటెరోపతిక్, జువైనల్‌ ఇడియోపతిక్, క్రిస్టల్‌ కీళ్లవాతం వంటి జబ్బులతో వచ్చేవారు ఉన్నారన్నారు. లక్షల్లో ఒకరికి వచ్చే ఈ జబ్బు బాధితులు ఎంజీఎంలో 50కి పైగా ఉన్నారని వివరించారు. ఈ వ్యాధులకు సంబంధించి పరిశోధక పత్రాలు అంతర్జాతీయ వేదికలపై ప్రచురించినట్లు ఆయన తెలిపారు.

ఉత్తమ సేవలకు గుర్తింపు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన డాక్టర్‌ మౌనిక ఖమ్మంలోని ఓ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చదివారు. అనంతరం భూపాలపల్లి ఏరియా ఆసుపత్రిలో పనిచేశారు. ఏడాదిన్నర కాలంగా కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా సేవలందిస్తున్నారు. నిత్యం 150 మంది ఓపీ రోగులను చూడటంతో పాటు, ప్రతి నెలా సగటున 5-6 సుఖప్రసవాలు చేస్తున్నారు. తన పరిధిలోని కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దన్వాడ, బయ్యారం ఉప ఆరోగ్య కేంద్రాల్లో నేషనల్‌ హెల్త్‌మిషన్‌ నిబంధనల మేరకు సౌకర్యాలు, రోగులకు వసతులు కల్పించినందుకు గతేడాది జాతీయ నాణ్యతా ప్రమాణాల గుర్తింపు దక్కింది. తద్వారా ఆయా ఆసుపత్రులకు కేంద్రం మూడేళ్లపాటు ప్రత్యేక నిధులు సమకూరనున్నాయి. వాటితో ఆయా ఆసుపత్రుల్లో ఆధునిక వైద్యసేవలు, సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మౌనిక తెలిపారు. ఈ సంవత్సరం మరో రెండు ఆసుపత్రులకు గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. 

విద్యార్థులకు చేయూత..

వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు గ్రామ శివారు తూర్పు తండాకు చెందిన డాక్టర్‌ మాలోతు రవీందర్‌ మహబూబాబాద్‌ జిల్లా వైద్యకళాశాల ఆసుపత్రిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జనరల్‌ సర్జన్‌గా సేవలందిస్తున్నారు. వైద్య విద్య చదవాలనే పేదలకు ఆర్థికంగా చేయూత అందిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా రిమ్స్‌లో మహబూబాబాద్‌ జిల్లా వెంకట్రాంతండాకు చెందిన బాదావత్‌ గణేష్, నిజామాబాద్‌ రిమ్స్‌లో గూడురు మండలానికి చెందిన బానోతు అజిత్, ఇనుగుర్తి మండలానికి చెందిన బాదావత్‌ గణేష్, మహబూబాబాద్‌ మెడికల్‌ కాలేజీలో పర్వతగిరి మండలం ఏనుగల్లు తూర్పు తండాకు చెందిన బానోతు భికను లను చదివిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులు ఇప్పిస్తున్నట్లు వివరించారు. 

  • ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్ధారించిన దాని ప్రకారం ప్రతి 1000 మందికి ఒక వైద్యుడు ఉండాలి. 
  • ప్రపంచంలో అత్యధిక వైద్యులున్న దేశంగా క్యూబా గుర్తింపు పొందింది. ఆ దేశ తలసరి డాక్టర్‌ రేటింగ్‌ 84.30 శాతం, అదే సమయంలో  అత్యల్ప 0.20శాతం వైద్యులున్న దేశంగా సోమాలియ నిలిచింది. 
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రిజిస్టర్‌ వైద్యులు 3500 మంది ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రస్తుతం ప్రతి 800 మందికి ఒక వైద్యుడు ఉన్నట్లు ఐఎంఏ ప్రతినిధులు తెలిపారు. కొత్త వైద్యకళాశాలల రాకతో వచ్చే అయిదేళ్లలో తెలంగాణలో ప్రతి 400 మందికి ఒక వైద్యుడు ఉంటారని వివరించారు.
  • వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో కొన్ని వైద్య విభాగాల్లో వైద్యుల కొరత ఉంది. ప్రస్తుతం 250 మంది ఉండగా.. మరో 118 మంది వైద్యుల ఖాళీలు ఉన్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని